టోక్యో: సెంట్రల్ జపాన్‌ను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని ప్రధాన నది పరిధిలో అత్యవసర వరద హెచ్చరిక జారీ చేశారు. రహదారులు, రైల్వే ట్రాక్‌లు సహా కీలక మౌలిక వసతులన్నీ నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని స్థానిక అధికారులు సూచించారు.
జపాన్ వాతావరణ సంస్థ షోనై నదికి అత్యున్నత స్థాయి-5 వరద హెచ్చరిక జారీ చేసింది. ఈ నది గిఫు, ఐచి ప్రిఫెక్చర్ల మీదుగా ప్రవహిస్తుంది. నగోయాలో గంట వ్యవధిలోనే 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చికుసా, మోరియామా, మీటో వార్డుల్లోని ప్రజలు భద్రత కోసం అప్రమత్తంగా వ్యవహరించాలని నగర పాలక సంస్థ కోరింది. భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ఘటనల్లో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయని ఐచి ప్రిఫెక్చర్ ప్రభుత్వం తెలిపింది. సుమారు 2,700 మంది సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఆసియా క్రీడల వేదికల్లోనూ పలు చోట్ల వర్షపు నీరు చేరింది.
నగర మెట్రో సేవలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేఆర్ చువో లైన్ రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. రద్దీగా ఉండే సకాయే ప్రాంతంలోని రహదారులపై ఒక దశలో మోకాలి లోతు వరకు నీరు చేరింది. ఐచి ప్రిఫెక్చర్‌లోనే టయోటా మోటార్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉంది. జేఆర్ సెంట్రల్ ప్రకారం, టోక్యో వైపు వెళ్లే టోకైడో షింకాన్సెన్ రైళ్లు ఒక దశలో ఒకాయామా-టోక్యో స్టేషన్ల మధ్య నిలిచిపోయాయి. టోక్యో-నగోయా మధ్య బయలుదేరే రైళ్లను కూడా నిలిపివేశారు. జేఆర్ వెస్ట్ ప్రకారం వర్షాల కారణంగా సాన్యో షింకాన్సెన్ సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. టోకైడో, సాన్యో షింకాన్సెన్ సేవలు సాయంత్రం 5.15 గంటల ప్రాంతంలో పునఃప్రారంభమయ్యాయి.

ఐచి, గిఫు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు ఒకే ప్రాంతంలో భారీ వర్షాలు కురిపించే ‘లీనియర్ రెయిన్‌బ్యాండ్స్’ ఏర్పడ్డాయని వాతావరణ సంస్థ తెలిపింది. పశ్చిమం నుంచి ఈశాన్య జపాన్ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొండచరియలు విరిగిపడటం, వరదల ముప్పుపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. టోక్యో, సైతామా, చిబా, కనగావాతో పాటు పశ్చిమ జపాన్‌లోని ఒసాకా, హ్యోగో ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో భారీ మార్పులు.. 120 మంది యువ నేతలకు పగ్గాలు!


