ఐదేళ్లలో 32,596 మంది బలి.. నగరాల్లో కానరాని భద్రత! | 32,596 Deaths in 5 Years NCRB Data Raises Urban Safety Alarms | Sakshi
Sakshi News home page

ఐదేళ్లలో 32,596 మంది బలి.. నగరాల్లో కానరాని భద్రత!

Sep 9 2026 11:40 AM | Updated on Sep 9 2026 11:44 AM

32,596 Deaths in 5 Years NCRB Data Raises Urban Safety Alarms

న్యూఢిల్లీ: దేశంలోని పలు నగరాల్లో మౌలిక వసతులు, పౌరుల భద్రతపై ప్రభుత్వ గణాంకాలు ఆందోళనకర పరిస్థితిని వెల్లడిస్తున్నాయి. 2020 నుంచి 2024 మధ్య భవనాలు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, గుంతలు, మ్యాన్‌హోల్స్‌ లేదా మురుగు కాలువల్లో పడిపోవడం వంటి ఘటనల్లో మొత్తం 32,596 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా 22,291 మంది అగ్ని ప్రమాదాల్లో మృతి చెందారు.

ఏటా వేలాది మరణాలు
ఎన్‌సీఆర్‌బీ ఆధారిత గణాంకాల ప్రకారం.. 2020లో ఈ తరహా ఘటనల్లో 7,556 మంది, 2021లో 6,486 మంది, 2022లో 6,529 మంది, 2023లో 6,054 మంది, 2024లో 5,971 మంది మృతి చెందారు. ఐదేళ్లలో నమోదైన 32,596 మరణాలు కేవలం ప్రమాదాల గణాంకాలు మాత్రమే కావని.. నగరాల్లో నిర్మాణాలు, నిర్వహణ, భద్రతా తనిఖీలు, పాలనా బాధ్యతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

అగ్నిప్రమాదాలే ప్రధాన కారణం
ఐదేళ్లలో అగ్ని ప్రమాదాల కారణంగా 22,291 మంది మృతి చెందారు. 2020లో 5,473, 2021లో 4,476, 2022లో 4,237, 2023లో 3,991 మంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఈ సంఖ్య మళ్లీ పెరిగి 4,114కు చేరింది. తాజా ఎన్‌సీఆర్‌బీ ఆధారిత వివరాల ప్రకారం.. 2024లో అగ్ని ప్రమాద మరణాల్లో గణనీయమైన సంఖ్య నివాసాలు, ఇళ్లలో జరిగిన మంటలకు సంబంధించినవే.

భవనాలు కూలిపోవడంతో..
2020-2024 మధ్య భవనాలు కూలిన ఘటనల్లో 5,951 మంది మృతి చెందారు. 2022లో అత్యధికంగా 1,285 మరణాలు నమోదయ్యాయి. 2024లోనూ 1,047 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 2020 నుంచి 2024 మధ్య భవన నిర్మాణాలు కూలిన ఘటనల్లో సుమారు 170 మరణాలు నమోదైనట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

గుంతలు, మ్యాన్‌హోల్స్‌తోనూ ప్రమాదం
ఐదేళ్లలో గుంతల్లో పడి 3,470 మంది, మ్యాన్‌హోల్స్‌ లేదా మురుగు కాలువల్లో పడి 1,094 మంది మృతి చెందారు. గుంతల ఘటనల్లో 2022 అత్యంత ప్రాణాంతకంగా నిలిచింది. ఆ ఏడాది 800 మంది ప్రాణాలు కోల్పోయారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవి అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలు కావు. మెరుగైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, పరిపాలనా పర్యవేక్షణ ఉంటే అనేక ప్రమాదాలను నివారించవచ్చు.

కలుషిత నీటి కారణంగానూ..
ఈ గణాంకాలు పట్టణ పౌర భద్రతకు సంబంధించిన అన్ని మరణాల పూర్తి చిత్రాన్ని చూపించవని నివేదిక పేర్కొంది. మున్సిపల్‌ పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో చెత్త రోడ్లు లేదా గుంతల పాత్ర ఉండొచ్చు. కలుషిత నీటి కారణంగా సంభవించే మరణాల పూర్తి వివరాలు కూడా ఇందులో లేవు. అందువల్ల 32,596 అనేది నమోదైన మరణాల సంఖ్య మాత్రమే.. పట్టణ పౌర భద్రతకు సంబంధించిన ప్రతి మరణాన్ని సూచించేది కాదు. ప్రతి కార్పొరేటర్‌ లేదా కౌన్సిలర్‌, మున్సిపల్‌ అధికారి, మేయర్‌ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: బీజేపీ ఖజానాలో భారీ పెరుగుదల.. వివరాలివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement