కాంగ్రెస్‌కు మిత్రపక్షం నుంచే ఘాటు కౌంటర్‌ | Vande Mataram Row: Congress Faces Counter From Ally NC | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు మిత్రపక్షం నుంచే ఘాటు కౌంటర్‌

Sep 9 2026 11:41 AM | Updated on Sep 9 2026 11:47 AM

Vande Mataram Row: Congress Faces Counter From Ally NC

ఇండియా కూటమి మిత్రపక్షాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇంతకాలం ఎన్నికలు.. సీట్ల పంపిణీ కారణం కాగా.. ఈసారి కాంగ్రెస్‌–నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య మరో కారణం మాటల యుద్ధానికి దారి తీసింది. ఇదే అదనుగా బీజేపీ రంగంలోకి దిగి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. ‘వందేమాతరం’ చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు కూటమి మిత్రపక్షాల మధ్య రాజకీయ పోరుగా మారింది.

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సోమవారం జరిగిన తొలి అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవంలో జాతీయ గీతం ‘జనగణమన’కు ముందు ‘వందేమాతరం’ పూర్తి రూపాన్ని ఆలపించారు. ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా సహా పలువురు నేతలు మొత్తం గీతం పూర్తయ్యే వరకు గౌరవంగా నిలబడ్డారు. ఈ పరిణామంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం రాజుకుంది. కాంగ్రెస్‌–ఎన్‌సీ రెండూ ఇండియా కూటమిలో భాగస్వాములే కావడంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

‘పూర్తి గీతం మా వైఖరికి విరుద్ధం’
శ్రీనగర్‌ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. ‘వందేమాతరం’ పూర్తి రూపం స్వాతంత్య్ర సమరయోధులు కోరుకున్నదానికి అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ 1937లో ఆమోదించిన రూపాన్నే పాటించాలని, మిత్రపక్షాలు కూడా ఆ నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు.  మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, సుభాష్‌ చంద్రబోస్‌, మౌలానా ఆజాద్‌ తదితర స్వాతంత్య్ర సమరయోధుల అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వేణుగోపాల్‌ పేర్కొన్నారు. మతపరమైన విభేదాలకు తావులేకుండా ఉండేందుకే కాంగ్రెస్‌ రెండు చరణాల రూపాన్ని అనుసరిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే దీనికి ఎన్‌సీ ఘాటుగా స్పందించింది.

అంతమాత్రాన ఆదేశిస్తారా?
కేసీ వేణుగోపాల్‌ ట్వీట్‌కు ఎన్‌సీ నేత బషీర్‌ అహ్మద్‌ బదులిచ్చారు. మిత్రపక్షంగా ఉన్న తమను ఏం పాడాలి, ఎంతవరకు పాడాలి అని కాంగ్రెస్‌ నిర్దేశించలేదని స్పష్టం చేశారు. ‘‘ఆయనకు తన అభిప్రాయాన్ని ‘ఎక్స్‌’లో వెల్లడించే హక్కు ఉంది. అయితే దాన్ని మిత్రపక్షాలపై విధించలేరు. ప్రజలపై ఏదైనా విషయాన్ని బలవంతంగా రుద్దడాన్ని మేం వ్యతిరేకిస్తాం అని స్పష్టం చేశారు.

‘నాగ్‌పూర్‌ ఆదేశాలు పాటించొద్దు’
ఎన్‌సీ స్పందనతో కాంగ్రెస్‌ కూడా వెనక్కి తగ్గలేదు. ఒమర్‌ అబ్దుల్లా, ఫరూక్‌ అబ్దుల్లాలు ఇండియా కూటమిలో భాగస్వాములని గుర్తుచేసిన కాంగ్రెస్‌ నేతలు.. కూటమి నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు. నాగ్‌పూర్‌ అంటే ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలను అనుసరించవద్దంటూ ఎన్‌సీ నేతలపై విమర్శలు చేశారు.

కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి
ఈ వివాదాన్ని బీజేపీ కూడా అందిపుచ్చుకుంది. పూర్తి ‘వందేమాతరం’పై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. కాంగ్రెస్‌ వైఖరి ఆ పార్టీని 21వ శతాబ్దపు ‘ముస్లిం లీగ్‌’గా మార్చిందని బీజేపీ ఎంపీ, అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్‌ ఈ అంశంలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయిందని ఆయన అన్నారు. మరో బీజేపీ నేత ఆర్‌ఎస్‌ పఠానియా కూడా కాంగ్రెస్‌పై మండిపడ్డారు. కశ్మీర్‌లో వేర్పాటువాదులు సైతం ‘వందేమాతరం’పై అభ్యంతరం వ్యక్తం చేయలేదని వ్యాఖ్యానించారు.

కూటమిలో కొత్త రగడ?
ఒకే కూటమిలో ఉన్న కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ‘వందేమాతరం’ విషయంలో భిన్న వైఖరులు తీసుకోవడం ఇండియా కూటమి అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది. శ్రీనగర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామం.. ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది.

రెండు చరణాలకే కాంగ్రెస్‌ కట్టుబాటు
‘వందేమాతరం’ విషయంలో కాంగ్రెస్‌ ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. 1937లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పార్టీ కార్యక్రమాల్లో రెండు చరణాల రూపాన్నే ఆలపించాలని గత నెలలో సీడబ్ల్యూసీ నిర్ణయించింది. పూర్తి గీతం విషయంలో బీజేపీ విమర్శలు పెరగడంతో ఈ నిర్ణయం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు కేంద్రం కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, అధికారిక వేడుకల్లో పూర్తి ‘వందేమాతరం’ను ఆలపించే అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ తన 1937 నాటి నిర్ణయానికే కట్టుబడి ఉండగా.. అదే ఇండియా కూటమిలోని ఎన్‌సీ నేతలు శ్రీనగర్‌లో పూర్తి గీతానికి నిలబడటం చర్చనీయాంశంగా మారింది.

ఇదీ చదవండి: సర్‌ప్రైజ్‌!! బీజేపీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement