సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాల వేడి కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. బీఆర్‌ఎస్ నేతలు నేడు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా కొనసాగిన పరిణామాలపై ఆయనకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇటు అధికార కాంగ్రెస్ కౌంటర్ యాక్షన్‌కు సిద్దమైంది.
ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు లోక్‌భవన్‌కు బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం వెళ్లాల్సి ఉంది. అయితే అనుకున్న టైం కంటే అరగంట ముందుగానే గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేల బృందం ఆయన్ని కలవనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా పోలీసుల జులుం.. మహిళా ఎమ్మెల్యేలతో ప్రవర్తించిన తీరు, ఎమ్మెల్సీల అరెస్టులు.. నిన్న ఎర్రవల్లికి వెళ్తుండగా అడ్డగింతలు.. ఇలా ఇటీవల చోటుచేసుకున్న దాడుల ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదులపై కాంగ్రెస్ పార్టీ కూడా కౌంటర్‌కు సిద్ధమవుతోంది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారాన్ని రేవంత్ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. మధుతో పాటు నవీన్‌కుమార్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయించే దిశగా.. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇటు ఈ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభకు హాజరై క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అవసరమైతే.. అప్పటిదాకా బీఆర్‌ఎస్ నేతలకు మైక్ ఇవ్వకూడదని స్పీకర్‌ను కోరాలని చూస్తోంది.
నేడు మండలిలో కీలక చర్చ
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు మూడో రోజుకు చేరుకోనున్నాయి. శాసనమండలిలో తాతామధు వ్యవహారంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన శాసనసభలో ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు.
శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించి.. తాతా మధు, నవీన్‌కుమార్ రెడ్డిలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. ఒకవైపు బీఆర్‌ఎస్ నేతలు గవర్నర్‌ను కలిసి దాడుల ఘటనలపై ఫిర్యాదు చేయనుండగా.. మరోవైపు అసెంబ్లీ, మండలి సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదానికి అవకాశం ఉండటంతో తెలంగాణ రాజకీయాల్లో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఏం తమాషా చేస్తున్నారా? లోపలేస్తా..


