జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్‌ జగన్‌ | LIVE: YS Jagans Key Meeting with Parchur Leaders | Sakshi
Sakshi News home page

జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్‌ జగన్‌

Sep 9 2026 10:38 AM | Updated on Sep 9 2026 3:55 PM

LIVE: YS Jagans Key Meeting with Parchur Leaders

సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. 

బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్‌తో జరిగిన సమావేశంలో జగన్‌ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. 

ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. 

ఓట్లపై కూడా అనుమానాలు..
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపైనా జగన్‌ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్‌సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్‌సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రోజుకో డ్రామా.. డైవర్షన్‌ పాలిటిక్స్‌
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్‌ పాలిటిక్స్‌’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్‌ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.

2019 హిస్టరీ రిపీట్ చేద్దాం.. జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం

నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..
పర్చూర్‌ కేడర్‌ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్‌ జగన్‌ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్‌సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్‌ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.

మంచి చేసి ఓటు అడగాలి..
పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్‌ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు జగన్‌ పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్‌ పోస్టులా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement