మాతృత్వం ఆ మహిళను ఆహార వ్యాపారం ప్రారంభించడానికి పునాది వేసింది. ముఖ్యంగా తన పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలనే అన్వేషణ ఇందుకు అంకురార్పణ. అలా వ్యాపార వేత్తగా మారి సక్సెస్ అందుకుందా అంటే..
ఆ మహిళే ఉత్తరప్రదేశ్‌కి చెందిన జ్యోతి శ్రీ వాస్తవ భారత సైన్యం కోసం ఒకప్పుడు రాకెట్లు రూపొందించేది. కెమికల్ ఇంజనీర్ అయిన జ్యోతి నానో టెక్నాలజీ, రాకెట్ ప్రొపెల్లెంట్ల విభాగంలో మంచి నైపుణ్యం సాధించారామె. అలా ఆమె ఆర్మీ కోసం రాకెట్లు డిజైన్ చేసే విభాగంలో పనిచేసింది. అయితే ఆ వర్క్‌లో ఉండే తీవ్రమైన ఒత్తిడికి తట్టుకోలేగా ఆ ఉద్యోగానికి కొన్నాళ్లపాటు విరామం తీసుకునేలా రిజైన్ చేసింది.
ఒక ఏడాది తర్వాత ఆమె గర్భవతి కావడం ఒక పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ చిన్నారికి ఘన ఆహారం కోసం అన్వేషిస్తున్నప్పుడే తెలిసింది మార్కెట్లో లభించేవన్నీ పోషకవంతమైనవి కావని. చిన్నప్పటి నుంచి సరైన ఆహారం అందిస్తేనే కదా వాళ్ల పెరుగుదల బాగుంటుందన్న ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. ఆ క్రమంలో పడిన తపన మళ్లీ ఆమెను తన ఉద్యోగం వైపుకి వెళ్లకుండా ఫుడ్ వ్యాపారంలోకి దిగేలా చేసింది.
మైదా లేనివి, శుద్ధి చేసిన చక్కెరలు ఉపయోగించిన ఆరోగ్యకరమైన ఆహారాలు ఇచ్చేలా యూనిసెఫ్ నుంచి శిక్షణ తీసుకుని మరి సర్టిఫికేషన్ పొందింది. అది ఆమెకు శిశువుల పెరుగుదల అభివృద్ధిలో వివిధ సూక్ష్మ, స్థూల పోషకాలు, ఖనిజాలు, విటమిన్ల పాత్రలను అర్థం చేసుకోవడానికి సహాయపడిందని అంటోంది. అలాగే పిల్లల ఆరోగ్యంలో వనమూలికల పాత్రను అర్థం చేసుకునేందుకు ఆయుర్వేదాన్ని అధ్యయనం చేసింది. ఆ తర్వాత వ్యాపారం పెట్టేందకు నిధులు కొరతతో ఇబ్బందులు ఎదురైనా..ఏదోలా కష్టపడి లిటిల్ చెర్రీ మామ్ అనే వ్యాపారాన్ని తన సొంతూరు మీరట్‌లో ప్రారంభించింది.
దాన్ని ఓ బ్రాండ్‌లా మార్చి.. పోషకవంతమైన ఆహారం అందించేలా దోస మిక్స్‌లు, చిరుధాన్యల పిండి, పంచదార, బెల్లం లేని లడ్డూలు వంటి మంచి ఉత్పత్తులను అందించింది. అంతేగాదు పిల్లల కోసం సన్నని క్రాకర్లు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను కూడా అందుబాటులోకి తీసకొచ్చింది. ముఖ్యంగా ఆరునెలల తదనంతరం ఎలాంటి ఫుడ్ పెట్టాలని భయపడే చిన్నారుల తల్లులకు ఈ ప్రొడక్ట్స్‌ని ధైర్యంగా పెట్టొచ్చు అనేలా ప్రజల నమ్మకం సంపాదించుకుంది జ్యోతి.
ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఈ బ్రాండ్‌కి దేశవ్యాప్తంగా 70 వేల మంది వినియోగదారులున్నారని ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్ ఆర్జిస్తుండటం విశేషం. అంతేగాదు జ్యోతి 'షార్క్ ట్యాంక్ ఇండియా' సీజన్ 5లో పాల్గొని తన వ్యాపార సక్సెస్ గురించి కూడా పంచుకుంది.
(చదవండి: కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదని సైన్యంలోకి సివిల్ ఇంజనీర్!)


