చిన్న ఖర్చుకూ మామనే అడగాలా?.. | Kanpur Businessman Murder Case, Daughter-in-Law Allegedly Plots Killing After Family Dispute, Check Details Inside | Sakshi
Sakshi News home page

చిన్న ఖర్చుకూ మామనే అడగాలా?..

Sep 9 2026 7:43 AM | Updated on Sep 9 2026 9:34 AM

CCTV Watch Constant Questions Shocking Details UP Kanpur Case

సంపన్న కుటుంబానికి ఆమె కోడలిగా వెళ్లింది. అయితే అత్తింట్లో అడుగు పెట్టినప్పటి నుంచే ఆమెను మనశ్శాంతి కరువైందట. అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా. ఏం చేసినా ఓ కన్నేసి చూసే పిసినారి మామ. నచ్చిన దుస్తులు వేసుకుంటే..  సూటిపోటి మాటలు. కాస్త ఆలస్యంగా ఇంటికి వస్తే ప్రశ్నలు. చిన్న ఖర్చుకూ భార్యభర్తలిద్దరూ ఆయన్నే డబ్బులు అడగాల్సిన పరిస్థితి.. ఇవన్నీ ఆమెలో తీవ్ర అసంతృప్తిని పెంచాయి. ఆ అసహనం.. కోపంగా మారి తీవ్ర నిర్ణయం తీసుకుంది. 

ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌కు చెందిన 63 ఏళ్ల ఫార్మాస్యూటికల్‌ వ్యాపారి వినీత్‌ మినోచా దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసులో ఆయన కోడలే ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చేశారు. మాజీ పనిమనుషులకు సుపారీ ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలిసింది. నేరాంగీకారంలో ఆమె విస్తుపోయే విషయాలే వెల్లడించింది. 

సెప్టెంబర్‌ 5 శనివారం రాత్రి తన ఇంట్లో వినీత్‌ దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. ఆ కుటుంబానికి గతంలో పనిచేసిన విశాల్‌ (30), అతడి సహచరుడు రాజ్‌ కిశోర్‌పై అనుమానం వచ్చింది. ఆదివారం రాత్రి ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో విశాల్‌ ఇచ్చిన సమాచారంతో కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వినీత్‌ కోడలు షాలు (36) తన మామను హత్య చేయాలని తమను సంప్రదించిందని విశాల్‌ పోలీసులకు చెప్పాడు. ఇందుకోసం రూ.6 లక్షలు ఇస్తానని ఆమె ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించాడు. దీంతో పోలీసులు షాలును అదుపులోకి తీసుకుని విచారించారు. తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఆమె.. ఆ తర్వాత తన ప్రమేయాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

షాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మామ తన కదలికలను నిరంతరం గమనించేవారు. రాత్రిళ్లు పార్టీలకు వెళ్లడం, ఆలస్యంగా ఇంటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు. కుటుంబం ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ.. తనకు, తన భర్తకు సంబంధించిన చిన్న ఖర్చులకు కూడా మామను డబ్బులు అడగాల్సి వచ్చేదని ఆమె పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.

ఆ రాత్రి..
జూలై 28న పార్టీ నుంచి షాలు ఆలస్యంగా ఇంటికి రావడంతో మామతో తీవ్ర వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఘటన తర్వాతే ఆమె మామపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ తర్వాత వినీత్‌ దగ్గర గతంలో పని చేసిన విశాల్‌ను ఆమె సంప్రదించింది. సెప్టెంబర్‌ 6న రూ.2 లక్షలు, మిగిలిన రూ.4 లక్షలను 15 రోజుల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అంతేకాదు హత్య కోసం ఫ్లాట్‌ డూప్లికేట్‌ తాళం చెవిని కూడా షాలు ఏర్పాటు చేసి విశాల్‌ చేతికి అందించింది. జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్‌ 4న అతడిని ఇంటికి పిలిచి.. హత్య స్కెచ్‌ను వివరించింది. 

గుండెపోటుగా..
శనివారం రాత్రి షాలు తన భర్త సుబ్రత్‌, కుమారుడితో కలిసి పార్టీకి వెళ్లింది. వారు ఇంటి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే విశాల్‌, రాజ్‌ కిశోర్‌ ఫ్లాట్‌కు చేరుకున్నారు. సెక్యూరిటీ గార్డు మదన్‌ వారిని అడ్డుకోవడంతో.. విశాల్‌ వెంటనే షాలుకు ఫోన్‌ చేశాడు. వాళ్లిద్దరూ మందులు తెచ్చారని.. లోపలికి అనుమతించాలని గార్డుకు ఆమె చెప్పింది. అయితే వినీత్‌ను దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయడం.. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించాలన్నది వాళ్ల ప్లాన్‌. 

అయితే జరిగింది వేరు. ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరూ.. బెడ్‌రూమ్‌లో దాక్కున్నారు. వినీత్‌ అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఏకంగా 26 సార్లు పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.

రక్తపు మడుగులో మామ..
పార్టీ ముగించుకుని షాలు, ఆమె భర్త సుబ్రత్‌ రాత్రి సుమారు 3 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. బెడ్‌రూమ్‌లో వినీత్‌ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులేవీ దొంగిలించకపోవడం పోలీసులకు కీలక ఆధారంగా మారింది. దీంతో తొలినుంచే ఇది దోపిడీ కోసం జరిగిన హత్య కాదని.. కుటుంబంలో వ్యక్తిగత విభేదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానించారు.

ప్రస్తుతం షాలు జైలులో ఉంది. మరోవైపు ఆమె భర్త సుబ్రత్‌ ఈ కుట్ర గురించి ముందే తెలుసా? హత్యలో అతడి పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం అతడి ఫోన్‌ కాల్‌ రికార్డులను పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: యూట్యూబర్‌ రమా నందన సంచలన వాంగ్మూలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement