సాధిక్ ఖాన్‌ను సర్పవరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తున్న పోలీసులు సాధిక్ ఖాన్
కాకినాడ క్రైం / కాకినాడ రూరల్ : తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. సర్పవరం పోలీసుల తొలిరోజు విచారణలో నిందితుడు సాధిక్‌ఖాన్ ఇచ్చిన సమాధానాలు దాదాపుగా ఇవే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు అనుమానాస్పద మృతిలో కీలక నిందితుడు సాధిక్ ఖాన్‌ను మంగళవారం కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు తొలిరోజు విచారణ ప్రారంభించారు. అతడి న్యాయవాది సమక్షంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్‌కుమార్ ఆధ్వర్యంలో రూరల్ పీఎస్ ఆవరణలో ఉన్న ప్రత్యేక గదిలో అతన్ని విచారిస్తున్నారు.
ఉదయం ప్రారంభమైన విచారణ, రాత్రి 9.30 సమయానికి కూడా కొనసాగుతోంది. పోలీసు వర్గాల నుంచి తెలిసిన సమాచారం మేరకు.. సాధిక్‌ను విచారించేందుకు 200 ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు తొలిరోజు 60 ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మేరకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సాధిక్ సమాధానం ఇవ్వడం గమనార్హం. సాంకేతిక ఆధారాలతో సాధిక్‌ను అడిగిన ప్రశ్నలకు వాస్తవ సమాధానాలు కనిపెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. విచారణకు పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్ల సాంకేతిక అంశాలపై ఆధారపడి కేసు విచారణ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం.
మీరట్‌లో ఏం జరిగింది...
సాధిక్ మీరట్ వెళ్లడం వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కకుండా సాధిక్ అక్కడి పోలీసుల ద్వారా అరెస్టయ్యాడని తెలిసింది. స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వల్లే ఆంధ్రా పోలీసులు వెళ్లి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకురావలసి వచ్చిందని స్పష్టమైంది. ఆంధ్ర పోలీసులకు చిక్కే సమయానికి సాధిక్‌కు చెందిన స్థానికులు మీరట్ పోలీసులకు సమాచారం అందించి కావాలనే అరెస్టు చేయించారని, నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే గుర్తించిన సాధిక్ తన మార్గదర్శి ద్వారా ఈ పన్నాగం పన్నాడని చెబుతున్నారు. అతడి వెనకున్నదెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏ మూల ఉన్నా నిందితులను పోలీసులు ఆయా ప్రాంతాలను వెళ్లి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువస్తారు. కాని సాధిక్ విషయంలో అలా జరగలేదు. ట్రాన్సిట్ వారెంట్ తప్పనిసరి అయింది.
అవును రసాయనం తెచ్చాను...
సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు వినియోగించాడని చెబుతున్న ప్రాణాంతక రసాయనం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావన్న ప్రశ్నకు రసాయనం తేవడం నిజమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే, ఆ రసాయనం ఉపయోగించి తాను చంపలేదని చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడం పోలీసులకు ఓ సవాల్‌గా మారింది. ఇప్పటికే జగదీశ్వర్‌రెడ్డి చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఆరోగ్య నివేదికలు సేకరించారు. వాటిని నిపుణుల పరిశీలనకు పంపారు.
నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో..
మంగళవారం నాటి విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టారు. మోసం చేయడం ఆది నుంచి సాధిక్‌కు ఓ అలవాటైన విషయమని మరోసారి నిర్ధారించుకున్నారు. ఇంత డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తున్న సాధిక్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నకిలీ సర్టిఫికెట్ ఒకటి తయారు చేయించుకొని వివిధ పోటీలలో పాల్గొనడం దగ్గర నుంచి, కోచ్‌గా పాఠశాలల్లో చేరడం వరకు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని స్వయానా సాధిక్ అంగీకరించాడు.
ఇద్దరు సెంటు వ్యాపారస్తుల విచారణ...
సా«ధిక్ ఖాన్‌ను కస్టడీకి తీసుకొచ్చే కొద్ది రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగదీశ్వర్‌రెడ్డిని హతమార్చేందుకు సాధిక్ సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం రూఢీ అయింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం గాం«దీపురంలో ఉన్న ఓ సెంటు వ్యాపారస్తుడు అబ్దుర్ రెహమాన్ సాధిక్ సంప్రదించాడు. తనకు హానికారక రసాయనం కావాలని, ఒక వ్యక్తిని హతమార్చాలని చెప్పాడు. అది ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పిన రెహమాన్ హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ ఖాదిర్‌ను సంప్రదించాలని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు. పోలీసులు వీరిద్దరినీ విచారిస్తుండగా వారి న్యాయవాది వచ్చి విడుదల చేయించారని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిసింది. సాధిక్ విచారణ కొనసాగుతుండడంతో వారిద్దరినీ మరో మారు పిలిపించే అవకాశం ఉంది.
ఆ పార్సిల్‌లో ఏముంది?
అబ్దుల్ ఖాదిర్ హైదరాబాద్ నుంచి సెంట్‌ల తయారీలో వినియోగించే ఓ హానికర రసాయనాన్ని సాధిక్‌కు పంపాడని సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పంపిన మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ట్రావెల్ బస్సులో కొద్ది రోజుల క్రితం సాధిక్‌కు ఓ పార్సిల్ అందిందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదురుగా ఉన్న సదరు ట్రావెల్స్ ఆఫీసులో విచారణ చేశారు. అక్కడి వారు పార్సిల్ రావడం నిజమేనని నిర్ధారించారు. ఆ పార్సిల్‌లో ఏమొచ్చిందో పోలీసులకు అంతుబట్టడం లేదు. అది ఖాదిర్ పంపిన విషపూరిత రసాయనం అయి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులలో ఉన్నాయి.


