నిబంధనల ప్రత్తిబంధకం | AP Government issues orders announcing SOP for cotton procurement | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రత్తిబంధకం

Sep 9 2026 6:18 AM | Updated on Sep 9 2026 6:18 AM

AP Government issues orders announcing SOP for cotton procurement

ఆధార్‌.. ఈ–పంట.. యాప్‌ స్లాట్‌.. పాస్‌బుక్‌ తప్పనిసరి 

సాగు విస్తీర్ణం, మండల దిగుబడి లెక్కల ప్రకారమే కొనుగోలు 

గతేడాది స్లాట్‌ సమస్యలే ఈసారీ సవాల్‌ 

పత్తి కొనుగోళ్లలో ఎస్‌వోపీని  ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) ఉందని ఊరట చెందుతున్న రైతుకు.. నిబంధ­నల చట్రం ప్రతిబంధకం కానుంది.. పత్తి కొనుగోళ్లను పూర్తిగా డిజిటల్‌ ప్రక్రియతో ముడిపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని(ఎస్‌వోపీ) ప్రకటించడం ఇబ్బ­ం­దికరంగా మారింది. ఆధార్‌ ఆధారిత ఈ–పంట వివరాల్లో రైతు గుర్తింపు ఉండాలి. పత్తి కొనుగోలుకు ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. సాగు విస్తీర్ణం, మండలాల వారీ దిగుబడి, దశల వారీ ఉత్పత్తి ఆధారంగానే ఎంత పత్తి కొనుగోలు చేయాలో నిర్ణయించనున్నారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌ మంగళవారం జీఓఎంఎస్‌ నం. 46ను జారీ చేశారు.  

ఈ–పంట ఆధారంగానే..  
రైతు సాగు చేసిన విస్తీర్ణం, వ్యవసాయ శాఖ నమోదు చేసిన మండలాల వారీ హెక్టారుకు దిగుబడి, పత్తి ఏరే దశల వారీ ఉత్పత్తి ఆధారంగా అనుమతించే పరిమాణంలోనే పంటను విక్రయించేందుకు అనుమతిస్తారు. అంటే కొనుగోలు ప్రక్రియ­లో ఈ–పంటలో నమోదైన సాగు విస్తీర్ణం, అధికారిక దిగుబడి లెక్కలు కీలకం కానున్నాయి. పత్తి రైతుల గుర్తింపునకు ఆధార్‌ ఆధారిత ఈ–పంట బుకింగ్‌ డేటానే ప్రాతిపదిక అవుతుంది. ఆ తర్వాత ఈ–పంట డేటా కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)కి అందించి ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌/సీసీఐ పత్తి కొనుగోలు మాడ్యూల్‌తో అనుసంధానం చేస్తారు. 

పత్తి విక్రయానికి స్లాట్‌ బుకింగ్, షెడ్యూలింగ్‌ వ్యవస్థను అమలు చేస్తారు. గత ఏడాది స్లాట్‌ బుకింగ్, షెడ్యూలింగ్, స్లాట్ల పరిమితి, జిన్నింగ్‌ మిల్లులను ఎల్‌1/ఎల్‌2/ఎల్‌3 ప్రాతిపదికన తెరవడం వంటి సమస్యలు తలెత్తినట్లు ప్రభుత్వమే జీఓలో పేర్కొంది. రాష్ట్రంలో సీసీఐ గుర్తించిన మార్కె­ట్‌ యార్డులు, జిన్నింగ్‌ మిల్లుల్లో పత్తి కొను­గోళ్లు జరుగుతా­యి. జిల్లా జాయింట్‌ కలెక్టర్లు నోటి­ఫై చేసిన జిన్నింగ్‌ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా ఉపయోగిస్తారు. రైతులు స్లాట్‌ బుకింగ్‌ సమయంలోనూ, మార్కెట్‌ యార్డు/జిన్నింగ్‌ మిల్లు­లో పత్తి విక్రయించే సమయంలోనూ ఆధార్‌ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్‌బుక్‌ జిరాక్స్‌ చూపించాల్సి ఉంటుంది. 

పత్తి కూడా ‘లూజ్‌’గానే!  
కొనుగోలు కేంద్రాలకు పత్తిని పీపీ బ్యాగులు లేదా గోనె సంచుల్లో కాకుండా లూజుగా తీసుకురావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొన్న పత్తికి సీసీఐ ఆన్‌లైన్‌లో అదీ రైతు ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాకే చెల్లింపులు చేస్తుంది. తగినన్ని జిన్నింగ్‌ మిల్లులు స్థానికంగా లేకుంటే సమీపంలోని ఇతర జిల్లాల్లో సీసీఐకి పత్తి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అక్కడి నుంచి సమీప జిన్నింగ్‌ మిల్లు కు పత్తిని తరలించేందుకు సీసీఐ ఏర్పాట్లు చేయాలి. రవాణా ఖర్చులను సీసీఐ చెల్లించే మార్కెట్‌ ఫీజు నుంచి భరించే విధానాన్ని ప్రభు­త్వం నిర్దేశించింది. రోజూ అన్ని కొనుగోలు కేంద్రాల్లో సాయంత్రం 5గంటల వరకే పత్తి సేకరిస్తారు. కేంద్రాల్లో తేమ మీ­టర్లు, టార్పాలిన్లు, ధ్రువీకరించిన ఎల్రక్టా నిక్‌ తూకం యంత్రాలు, నెట్‌ కనెక్టివిటీ, సీసీ కెమె­రాలు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. 

ఈసారి అసలు పరీక్ష ఇదే!  
కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌గా జిల్లాస్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నారు.  ఈ–పంటలో నమోదైన వివరాలు, ఆధార్‌ అనుసంధానం, స్లాట్‌ బుకింగ్, షెడ్యూలింగ్, అనుమతించే పత్తి పరిమాణం, నాణ్యతా ప్రమాణాలు, జిన్నింగ్‌ మిల్లుల అందుబాటు, రోజువారీ సమయ పరిమితి ఇవన్నీ సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. గత ఏడాది స్లాట్‌ బుకింగ్, షెడ్యూలింగ్, స్లాట్ల పరిమితి, జిన్నింగ్‌ మిల్లుల ప్రారంభంలో సమస్యలు ఎదురైనట్లు జీఓలోనే ప్రభుత్వం ప్రస్తావించిన నేపథ్యంలో.. ఈసారి వాటిని పునరావృతం కాకుండా చూసేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement