గరివిడిలోని ప్రభుత్వ వెటర్నరీ కళాశాల మూత
వైఎస్ జగన్ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభం
ఈ విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిరాకరణ
ఇతర కళాశాలలకు సీనియర్ విద్యార్థుల తరలింపు
ఇక్కడి అధ్యాపకులను డిప్యూటేషన్లపై పంపడం, కాంట్రాక్టు సిబ్బందితో కళాశాల కొనసాగించడంపై ఆగ్రహం
పూర్తిస్థాయిలో శాంక్షన్ పోస్టులన్నీ భర్తీ చేయాలి
అవకతవకలన్నీ సరిదిద్దుకోవాలని తేల్చి చెప్పిన వీసీఐ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ పోకడలకు వెటర్నరీ విద్యార్థుల చదువులు చట్టు బండలవుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన విజయనగరం జిల్లా గరివిడిలోని ప్రభుత్వ వెటర్నరీ కళాశాల మూతపడింది. 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(వీసీఐ) నిరాకరించింది. ఇక్కడ విద్యనభ్యసిస్తున్న సీనియర్ బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులను ఇతర కళాశాలలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులను డిప్యూటేషన్లపై పంపడంతో పాటు కాంట్రాక్టు పద్ధతిన బోధనా సిబ్బందితో కళాశాలను కొనసాగిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో శాంక్షన్ పోస్టులన్నీ భర్తీ చేసి, నిబంధనల మేరకు మౌలిక సదుపాయాలు కల్పించే వరకు ప్రవేశాలకు అనుమతినిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో..
గరివిడి కళాశాలకు వెటర్నరీ కౌన్సిల్ నుంచి అన్ని అనుమతులు తీసుకొన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం 2020–21 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించింది. ఇక్కడ డీన్ పోస్టుతో పాటు 17 మంది ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 43 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మంజూరు కాగా, డీన్‌తో పాటు 28 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 13 మంది ప్రొఫెసర్లను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేశారు. మరో 25 మందిని కాంట్రాక్టు పద్ధతిన నియమించారు.
బాబు పాలనలో రాజకీయ ప్రయోజనాల కోసం..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 49 మంది రెగ్యులర్ అధ్యాపకులను డిప్యూటేషన్లపై వెటర్నరీ యూనివర్సిటీతో పాటు ఇతర ప్రభుత్వ కళాశాలలకు పంపేసినట్టు వీసీఐ తనిఖీల్లో గుర్తించారు. 25 మంది కాంట్రాక్టు సిబ్బందితో ఈ కళాశాల నడుస్తోందని, కళాశాలలో విస్తరణ, ఇతర సేవా కోర్సులు నిర్వహిస్తున్నప్పటికీ అందుకు తగిన అధ్యాపకులను నియమించలేదని గుర్తించారు.
పనిచేసేది ఒక చోట.. పోస్టింగ్ మరొక చోట..
గరివిడి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఫుల్‌టైం విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పి.రవికుమార్‌ను ఈ వెటర్నరీ కళాశాలలో వెటర్నరీ కెమికల్ కాంప్లెక్స్‌కు అసిస్టెంట్‌గా చూపించడంపై వీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరుపతిలోని ఎస్వీవీలో పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఆదిలక్ష్మమ్మ గరివిడి కళాశాలలో పనిచేస్తున్నట్టుగా చూపించడమే కాక, జీతభత్యాలను కూడా ఇదే కళాశాల నుంచి ఇస్తున్నట్టు తనిఖీల్లో బయటపడింది. ఈ కళాశాలకు చెందిన రెగ్యులర్ సిబ్బందిని ఇతర కళాశాలలకు డిప్యూటేషన్‌పై పంపగా, వర్శిటీతో పాటు వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న వారిని డిప్యూటేషన్‌పై ఇక్కడ పని చేస్తున్నట్టుగా చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
పైగా బోధనలో ఎలాంటి అనుభవం లేని ఇద్దరు పశుసంవర్ధక శాఖాధికారులను ప్రొఫెసర్లుగా నియమించినట్టు గుర్తించారు. మరొక వైపు మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు తేలింది. గత ఏడాది కూడా ఇదే రీతిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించగా, 2025–26 విద్యాసంవత్సరంలోనే ప్రవేశాలకు వీసీఐ అనుమతి నిరాకరించింది. ఆరు నెలల్లో అంతా సరిదిద్దుతామంటూ ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో వీసీఐ ఆ మేరకు అనుమతినిచ్చింది. అయితే ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కొనసాగడంతో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను అనుమతించబోమని తేల్చి చెప్పింది. గరివిడి కళాశాలకు వీసీఐ గుర్తింపు తీసుకొస్తామంటూ సవాల్ విసిరిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు..


