ఉద్యోగాలడిగారని ఉక్రోషం.. నిరుద్యోగ గుండెలపై దమనకాండ | High Tension in Kakinada | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలడిగారని ఉక్రోషం.. నిరుద్యోగ గుండెలపై దమనకాండ

Sep 9 2026 5:29 AM | Updated on Sep 9 2026 6:34 AM

High Tension in Kakinada

కాకినాడలోని శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వద్ద నిరుద్యోగులను తనిఖీ చేస్తున్న పోలీసులు

కాకినాడలో పోలీసుల దాష్టీకం  

రోడ్డెక్కి గళంవిప్పారని ప్రతీకారం.. నలుగురుపై కేసులు నమోదు 

హాస్టళ్ల్ల చుట్టూ మోహరించి రాత్రంతా కర్ఫ్యూ వాతావరణం 

హాస్టళ్లలో తెల్లవారుజామున సోదాలు 

రోడ్లపై ఎక్కడికక్కడ ఆపి తనిఖీలు

కాకినాడ క్రైం: నిరుద్యోగ గుండెలపై ఖాకీ­లు దమనకాండ సాగించారు. ఉద్యోగాలివ్వమని అడిగిన పాపానికి ఉగ్రవాదుల్లా చూశారు. రాత్రంతా కాళరాత్రి కళ్లకుకట్టారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలో ఉండగా పోలీస్‌ శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల హాస్టళ్లలోకి ముష్కర మూకలు తెగబడినట్టు పోలీసులు గుంపులుగా దూసుకొచ్చా­రు. తలుపులు కొట్టి, బలవంతంగా నెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఎవడ్రా ఇక్కడ నిరసనలో పా­ల్గొన్నదని కళ్లెర్రజేశారు. నిరుద్యోగులపైనా, వారంతా చదువుతున్న విద్యా­సంస్థ యాజమాన్యంపైనా కేసులు నమోదు చేశారు. భవిష్యత్‌ను నాశనం చే­స్తాం.. ఖబడ్దార్‌.. అంటూ హెచ్చరించి మరీ వెళ్లారు.  

అసలేం జరిగింది...  
రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పోలీస్‌ నిరుద్యోగులంతా ఏకమయ్యారు. దశల వారీగా వివిధ జిల్లాల్లో చేపడుతున్నట్టుగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలన్నీ భర్తీచేయాలని, తక్షణం ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలనే డిమాండ్లతో సోమవారం కాకినాడలో భారీ నిరసన చేపట్టారు. శారదాదేవి జంక్షన్‌కు సోమ­వారం ఉదయం సుమారు 1,000 మంది నిరుద్యోగులు చేరుకుని అక్కడి నుంచి భానుగుడి కూడలి వరకు నిరుద్యోగ భృతి కాదు.. ఉద్యోగాలు కావాలని డిమాండ్‌ చేస్తూ సీఎం బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్, హోంమంత్రి అనితల తీరును నిరసించారు. 

12 వేలకుపైగా ఖాళీలు ఉంటే కేవలం 1500కు అటుఇటుగా పోస్టులు విడుదల చేస్తారన్న విషయం తెలియవచ్చిందని, అదే జరిగితే తమ భవిష్యత్‌ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వెళ్లగక్కారు. నోటిఫికేషన్లు ఇవ్వడం ఆలస్యమవుతుండడం వల్ల వ­యోపరిమితి మినహాయింపునివ్వాలని డిమాండ్‌ చేశారు. భానుగుడి వరకు భారీ ప్రదర్శనగా వెళ్లి అక్కడి నుంచి కలెక్టరేట్‌ ఆవరణను చేరుకొని ధర్నా చేపట్టారు., పాలకుల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.   

అణగదొక్కాలని హుకుం
సోమవారం కాకినాడలో జరిగిన నిరసన ప్రదర్శన జిల్లా పోలీస్‌ శాఖకు సవాల్‌ విసిరినట్టయింది. రాష్ట్రంలో మరెక్కడా జరగనంత ఉధృతంగా కాకినాడలో ఈ నిరసన జరగడంతో పోలీసులే కంగుతిన్నారు. ఇది పాలకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రభుత్వం జిల్లా పోలీసుల తలంటింది. తక్షణం ఆందోళన చేసిన వారిని అణగదొక్కాలని, మళ్లీ నిరసన చేపట్టాలంటే భయపడేలా చేయాలని హుకుం జారీచేసింది. దీంతో పోలీసులు పేట్రేగిపోయారు. పైశాచికత్వానికి పదునుపెట్టారు.  నిరుద్యోగులు, వారు శిక్షణ తీసుకుంటున్న సంస్థలపై సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు తమ ప్రతాపాన్ని చూపించారు. హాస్టళ్లలోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు.   

రాత్రంతా ప్రత్యక్ష నరకం..  
సోమవారం రాత్రి నుంచే పోలీసులు హాస్టళ్లపై దాడులు చేపట్టారు. విద్యుత్‌ నగర్‌లో ఉన్న శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లే దారులన్నింటిలోనూ పోలీసులు మోహరించి తమ జీపులను నిలిపారు. అటుగా వెళుతున్న విద్యార్థులు ప్రతి ఒక్కరినీ ఆపి ఆరా తీశారు. గుర్తింపు కార్డులను పరిశీలించి వ్యక్తిగత ఆరాలూ తీశారు. ఎందుకని ప్రశ్నిస్తే తాట­తీ­స్తామని హెచ్చరించారు. రాత్రి అంతా ఇన్‌స్టిట్యూ­ట్‌ చుట్టూ, అలాగే అక్కడి విద్యార్థులు ఉంటున్న హాస్టళ్ల చుట్టూ కలియదిరిగారు. మఫ్టీలో మాయ చేసి, సెల్‌ఫోన్‌ కెమెరాలతో అటుగా వెళుతున్న ప్రతి ఒక్కరి కదలికలను రికార్డు చేశారు. కర్ఫ్యూ వాతావరణాన్నే సృష్టించారు. కాళరాత్రిని కళ్లకు కట్టారు. తెల్లవారుజామున హాస్టళ్లలోకి చొరబడ్డా­రు. తలుపులు బాదుతూ, నెడుతూ నిరుద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారు. 

ఆడా మగా తేడా లేకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. మహిళా అభ్యర్థులు నైట్‌ డ్రెస్‌లలో ఉండగానే పోలీసులు ఫొటోలు తీశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్‌ సహా గుర్తింపు కార్డుల ఫొటోలు తీసుకున్నారని పేర్కొన్నారు, వ్యక్తిగత అంశాలనూ ప్రశ్నించి వెకిలిచేష్టలతో నరకం చూ­పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరసనల్లో పాల్గొంటే భవిష్యత్‌ నాశనం చేస్తామని హెచ్చరించి వెళ్లారని విమర్శించారు. ఈలోపు శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత గుంటూరి శ్యామ్‌ అక్కడికి వచ్చి తనిఖీలకు అనుమతులు ఉన్నా­యా అని ప్రశ్నిస్తే, అవసరం లేదని పోలీసులు మరింత చెలరేగిపోయారు.  

నలుగురిపై కేసులు నమోదు.. 
ఉద్యోగ ప్రకటన పేరుతో శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత శ్యామ్‌ నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్డెక్కించారని, ఇందులో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నే­త­లు భాగమయ్యారని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గుంటూరి శ్యామ్‌తో పాటు డీవై­ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు తొట్టిపూడి రాజా, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మదిన గంగా సూరిబాబు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజేష్ ­లపై కేసులు నమోదు చేసినట్టు కాకినాడ త్రీటౌన్‌ సీఐ సత్యనారాయణ తెలిపారు. మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు.  

శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత కన్నీటి పర్యంతం  
తమ సంస్థ హాస్టల్లో ఉన్న వి­ద్యార్థులు, నిరుద్యోగులపై పో­లీసులు దాడులు చేయడంపై శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత గుంటూరి శ్యామ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు తమ సంస్థకు సంబంధం లేదన్నా.. పోలీసులు వినలేదని కన్నీటిపర్యంతమయ్యారు. చెబితే విని నిరసనలు చేయడానికి నిరుద్యోగులు చిన్నపిల్లలేం కాదని, డిగ్రీలు, పీజీలు చదివిన వారని, ఎంతోకాలంగా శిక్షణ పొందినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతోనే నిరసన బాట పట్టి ఉంటారని పేర్కొన్నారు. ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులూ ఒక్కప్పుడు ఉద్యోగాల కోసం వేదన పడ్డవారేనని గుర్తుంచుకోవాలని హితవుపలికారు.

 జి­ల్లా­లో ఏ నేరం జరిగినా తమ సంస్థలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల మీదకే నెట్టడం వారి భవితను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పు చేస్తున్న వారు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, కక్ష సాధింపు చర్యలు మా­నుకోవాలని కోరారు. పోలీసులు సోమవారం మధ్యా­హ్నం తమ విద్యార్థులను పోలీసుస్టేషన్‌కు పిలిచి విచారణ పేరుతో రాత్రి వరకు ఉంచారని, మళ్లీ తెల్లవారుజామున దాడులకు తెగబడ్డారని ఆక్రోశించారు. తమ సంస్థలో శిక్షణ పూర్తిచేసుకున్న వారు ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురు ఉంటూ తినీతినక కష్టాలు పడుతున్నారని వారి వేదన చూడలేక సీఎం చంద్రబాబును కలిసి పోలీసు శాఖలో ఉద్యోగాలు పెంచాలని కోరానని గుర్తుచేశారు.  

అనుమతిలేకుండా ర్యాలీ  
నిరుద్యోగులను రెచ్చగొ­ట్టి దురుద్దేశంతో రోడ్డెక్కించారు. శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న సెంట్రల్‌ మైక్‌లో నిరసనల సమాచారం పంచుకున్నారు. ఈ విషయం అధినేత శ్యామ్‌కు తెలిసే జరిగింది. నిరుద్యోగులపై కేసులేవీ పెట్టలేదు. శ్యామ్‌ సహా మరో ముగ్గురు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ నాయకులపై కేసులు నమోదు చేశాం. పోలీసుల అనుమతి తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడూ డిప్యూటీ సీఎం కారును శ్యామ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అడ్డుకోబోయారు, అలాగే, పలు నేరాల్లో కూడా కొందరు భాగమవుతున్నారు. వీటి వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకే హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించాం. మేం ఎవరినీ ఉగ్రవాదుల్లా పరిగణించలేదు, నిబంధనలకు లోబడే తనిఖీలు చేశాం.  
– మహంతి కిషోర్‌కుమార్, ఇన్‌చార్జి ఎస్పీ, అదనపు ఎస్పీ, కాకినాడ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement