ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు! | Kajal Prajapati Decade after acid attack, woman cracks 2 govt job exams | Sakshi
Sakshi News home page

ఆ గాయం రూపాన్ని మార్చిందే తప్ప..ఆమె గెలుపుని కాదు!

Sep 8 2026 4:27 PM | Updated on Sep 8 2026 5:06 PM

Kajal Prajapati Decade after acid attack, woman cracks 2 govt job exams

కొందరు దుర్మార్గుల వికృత ప్రేమకు ఎందరో అమ్మాయిలు జీవితాలు బలైన ఉదంతాలు చూశాం. కొందరు వాటిని తట్టుకుని తమ సత్తా ఏంటో చూపించి స్ఫూర్తిగా నిలవడమే కాదు, యావత్తు దేశం తమలాంటి వాళ్లవైపు తిరిగి చూసేలా చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ కాజల్‌ ప్రజాపతి. ప్రేమ పేరుతో వెంటపడే ఓ వ్యక్తి దుశ్చర్యకు రూపాన్ని పోగోట్టుకుని, వికలాంగురాలిగా మారిన అమ్మాయి కథ.

అహ్మదాబాద్‌లోని మెహసానాలోని రామోసానా గ్రామానికి చెందిన అమ్మాయే కాజల్‌ ప్రజాపతి. రిక్షా డ్రైవర్‌ కుమార్తె. బికాం మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు 2016లో ఓ దుర్మార్గుడి యాసిడ్‌ దాడికి బలైంది. ఆ వ్యక్తి ప్రేమను కాదన్నందుకు..ఫలితంగా ఘెరమైన నరకయాతనను చవిచూసింది. ఆ యాసిడ్‌ దాడిలో ఒక కన్ను పూర్తిగా కోల్పోగా, మరో కన్ను పాక్షికంగా చూపుని కోల్పోయింది. బయటకు తలెత్తుకోని తిరగలేని విధంగా జీవితాన్ని కోల్పోయింది. తన ముఖాన్ని తానే చూసుకోలేక, బయటకు వెళ్లలేక ఎంతో బాధను, వేదనను చవిచూసింది. 

హాయిగా చదువుకోవాల్సిన ఆ టీనేజ్‌ వయసు మొత్తం సర్జరీలకే జీవితం అంకితమైపోయింది. అలా ఆమె అప్పటికే 20కి పైగా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. అయినా సరే తనెందుకు బిక్కుబిక్కుమంటూ బతకాలి, తానేం ఏ నేరం చేశా, అన్న ఆలోచన కాజల్‌ని ఒక పట్టాన నిలువనిచ్చేది కాదు. ఈ సమాజంలో అందరిలా ధైర్యంగా బయట తిరగాలి, తన కాళ్లమీద తాను నిలబడేలా గౌరవంగా బతకాలి అన్న కోరికతో పోటీ పరీక్షల వైపు దృష్టిసారించింది. 

అస్సలు తనకు కావాల్సింది జాలి చూపులు కాదు..తను మీలాంటి మనిషి అని గుర్తించే మనసే కావలంటూ ధైర్యంగా ముందుకు సాగింది. నిజానికి కాజల్‌ డ్రీమ్‌ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ అవ్వడం కానీ కంటి చూపు కారణంగా ఆ అవకాశం దూరమైంది. దాంతో రెవెన్యూ శాఖ  ఉద్యోగాలపై ఫోకస్‌ పెట్టి ఆయా పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. అలా ఆమె ఈ ఏడాది ఒకటి కాదు ఏకంగా రెండు ప్రభుత్వోద్యోగాలు దక్కించుకుని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. మొదటిది గ్రామీణ పరిపాలనా కార్యదర్శి ఉద్యోగం కాగా, మరోకటి రెవెన్యూ విభాగంలో కీలకమైన డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగం. 

అయితే కాజల్‌ రెండోదే ఎంచుకుంది. డిప్యూటీ తహసీల్దార్‌ ఉద్యోగమే ప్రతిష్టాత్మకమైనదని అదే ఎంచుకున్నట్లు ఆమె పేర్కొంది. ఈ నెల సెప్టెంబర్‌ 17న డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకానుంది. అంటే యాసిడ్‌ దాడి జరిగిన పదేళ్లకు తిరిగి తన గుర్తింపుని దక్కించుకునేలా ప్రభుత్వోద్యోగాలను సాధించింది. అంతేగాదు ఆమె నెల జీతం రూ. రూ. 49,600 దాక ఉంటుంది.  కాగా, ఈ స్థాయికి చేరుకునేందుకు తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నా అని ఆనందంగా చెబుతోంది కాజల్‌. అలాగే తాను ఈ పరీక్షలకు సన్నద్ధమవ్వడం అంటే.. అందరికీ ఉన్నన్ని కాకపోయినా కనీస వెసులుబాటు కూడా ఏమి లేదని అంటోంది. 

తన ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రిపరేషన్‌కి ఎలాంటి కోచింగ్‌ తీసుకోలేదని, కేవలం ప్రభుత్వ లైబ్రరీపై ఆధారపడి చదువుకున్నట్లు తెలిపింది. కానీ ఆ లైబ్రరీ కోసం బయటకు వెళ్తే..తన రూపు చూసి జాలిపడే చూపులను ఎదుర్కొనాల్సిన ఉంటుంది. అయినప్పటికీ ధైర్యం చేశా, కానీ ఏ రోజు తన ముఖాన్ని దాచుకోలేదని అంటోంది కాజల్‌. ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడు కూడా అందరితో కలవాలంటే ముందు ఈ పరిస్థితిని తాను అధిగమించాల్సి ఉంటుంది కాబట్టే ఇలా చేసినట్లు తెలిపింది. 

అంతేగాదు ఇక తాను ఎలాంటి శస్త్ర చికిత్సలు చేయించుకోనని, తాను ఎలా ఉన్నానో అలాగే అంగీకరించాలని ఆశిస్తోంది. ఈ గెలుపు ప్రయాణంలో ముందుగా తనకు అతిపెద్ద బలం తన అన్నయ్యేనని అంటుంది. తను నా చెల్లి అని గర్వంగా చెప్పడమే కాదు, తానెంతో ధైర్యవంతురాలిని అని చెప్పే మాటలే ధైర్యంగా ముందుకు సాగేలా చేశాయని అంటోంది. అలాగే నిర్భయంగా బయటకు రాగాలిగానంటే అందుకు తన స్నేహితురాలే కారణమని అంటోంది. 

ఆమె పదే పదే నువ్వు బయటకు రావాలి, ఈ సమాజంంలో నీ స్థానాన్ని తిరిగి పొందాలని చెబుతుండేది, అవి నాకు కొండంత ధైర్యాన్ని ఆశను అందించాయని చెబుతోంది. అలాగే తనకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులకు ధన్యవాదాలు చెబుతోంది. ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని చాలామటుకు చికిత్సలో రాయితీ అందించారని చెప్పుకొచ్చింది. ఇవాళ ఇలా గెలుపుతో నిలదొక్కుకున్నానంటే..అందుకు వాళ్లందరూ అందించిన సహాయసహకారాలే కారణమని సగర్వంగా చెబుతోంది కాజల్‌.

(చదవండి: కుల మతాలకు అతీతంగా సరికొత్త చరిత్ర సృష్టించిన న్యాయవాది..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement