బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా? | Funday Special Story On Igogo Festival Nigeria OWO Kingdom | Sakshi
Sakshi News home page

'ఇగోగో'! 600 ఏళ్లుగా ఈ పండుగలో ఆ వింత ఆచారం ఎందుకు?

Sep 6 2026 2:05 PM | Updated on Sep 6 2026 2:05 PM

Funday Special Story On Igogo Festival Nigeria OWO Kingdom

ఫండే

అగడం బగడం

నైజీరియాలోని ఓండో రాష్ట్రంలో ఉన్న ఓవో నగరం శోభాయమానంగా వెలిగిపోతోంది. 600 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ‘ఇగోగో’ మహోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఆగస్టు చివరిలో ప్రారంభమై, సెప్టెంబరు మాసమంతా ఈ పండుగ సాగుతుంది. ఇది నైజీరియన్ల స్థానిక జ్ఞాపకాలతో, రాచరికంతో, సామాజిక గుర్తింపుతో ముడిపడి ఉన్న వేడుక. ఎంతో ఉత్సాహంగా సాగే ఈ వేడుకలను తిలకించడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇప్పటికే ఓవో నగరానికి క్యూకట్టారు.

నైజీరియాలో వర్షాకాలం ముగిసే వేళ జరిగే సాంస్కృతిక పండుగల కాలంలోనే ఈ ఉత్సవం కూడా జరుగుతుంది. ఈ ఇగోగో వేడుక మూలాలు పురాణ కాలపు రాణి ఒరోన్సే చరిత్రతో ముడిపడి ఉన్నాయి. దేవలోకం నుంచి దివికి దిగివచ్చిన ఒరోన్సే, ఓవో రాజును వివాహమాడి, రాజసౌధంలో కొన్ని నియమాలను విధించింది. తనకు ఇష్టంలేని బెండకాయలను వండరాదని, తన సమక్షంలో తలపాగాలు ధరించరాదని, తన దారిలో నీరు చల్లకూడదని కోరింది.

ప్రజలు కొన్నేళ్లపాటు ఆ నిబంధనలను గౌరవించినప్పటికీ, కాలక్రమంలో వాటిని ఉల్లంఘించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాణి ఒరోన్సే, అడవుల్లోకి వెళ్లి అదృశ్యమైపోయింది. కానీ వెళ్లేముందు తన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఇగోగో ఉత్సవాన్ని నిర్వహించాలని, అలా చేస్తే రాజ్యానికి శుభం కలుగుతుందని వరమిచ్చింది. నాటి నుంచి ఇగోగో పండుగ ఆచారంగా మారింది. వేడుకకు కొన్ని వారాల ముందునుంచే నగరం నూతన శోభను సంతరించుకుంటుంది. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.

మహిళలు ఊదా, తెలుపు, పసుపు రంగుల ప్రత్యేక వస్త్రాలను నేస్తారు. సంగీత, నృత్య కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పిల్లల నుంచి పెద్దవారి వరకు సన్నద్ధమవుతారు. విదేశాల్లో స్థిరపడినవారు తమ మాతృభూమికి చేరుకుంటారు. మహిళలు పగడపు పూసల ఆభరణాలు ధరించి, ఒరోన్సే రాణి గుణగణాలను, ఆమె త్యాగాన్ని కీర్తిస్తూ తరతరాలుగా వస్తున్న సంప్రదాయ గీతాలను ఆలపిస్తారు. ఈ వేడుకల్లో ఆనాడు రాణి ఒరోన్సే విధించిన నిబంధనలను ప్రజలంతా కచ్చితంగా పాటిస్తారు. నేడు ఇగోగో పండుగ కేవలం సంప్రదాయానికే పరిమితం కాకుండా, పర్యాటకంగానూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 

ప్రత్యేక ఆకర్షణ ఒలోవో రాజు
ఇగోగో ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ ఓవో సామ్రాజ్య అధిపతి అయిన ‘ఒలోవో’ రాజు ప్రత్యేకమైన అలంకరణ. సాధారణ రోజుల్లో కిరీటాలు, మిరుమిట్లుగొలిపే వస్త్రాలు ధరించే రాజు, ఈ పండుగ రోజుల్లో విభిన్నంగా కనిపిస్తాడు. తలపాగా లేకుండా, పగడాల పూసల టోపీని, పగడాల హారాలను ధరిస్తాడు. అంతేకాక, రాణి ఒరోన్సే స్త్రీత్వాన్ని, ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని చాటడానికి చీర వంటి ప్రత్యేక వస్త్రాన్ని ధరిస్తాడు. రాజ పురోహితులు, సర్దారులతో కలిసి వీథుల్లో నృత్యం చేస్తూ సాగుతాడు.
- రమా జంబుల

ఇవి కూడా చదవండి: బ్రేకింగ్‌ న్యూస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement