తలుపు: ‘మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం’.. నెలకే ఏమైంది? | Woman Realizes Husbands True Protection After Tragic Loss | Sakshi
Sakshi News home page

తలుపు: ‘మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం’.. నెలకే ఏమైంది?

Sep 6 2026 12:56 PM | Updated on Sep 6 2026 1:17 PM

Woman Realizes Husbands True Protection After Tragic Loss

ఫండే

కథాకళి

గడాలు కుటుంబం తూర్పు గోదావరి జిల్లా నుంచి హైద్రాబాద్‌కి వలస వచ్చింది. వారిది కొంకుదురు అనే చిన్న పల్లెటూరు. పగడాలు, ఆమె భర్త వ్యవసాయ కూలీలుగా పనిచేసేవారు.
పగడాలు తమ్ముడు కొంకుదురు వచ్చినప్పుడల్లా ‘హైద్రాబాద్‌కి వెళ్తే బాగుపడని వారు లేరు. ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటాం’ అని ఆమెతో పదేపదే చెప్పడంతో, పగడాలు ఓ రోజు తన భర్తతో చెప్పింది.
‘‘వెళ్ళి చూద్దాం. నచ్చకపోతే మళ్ళీ కోతల సమయానికి వచ్చేద్దాం.’’

‘‘సరే, ఇక్కడ ఎటూ మనకి సంవత్సరం పొడుగూతా పని దొరకటం లేదు కదా.’’ అతను ఒప్పుకున్నాడు.
అతని బావమరిది ఓ బిల్డర్‌ దగ్గర పని చేస్తున్నాడు. తన సూపర్‌వైజర్‌తో మాట్లాడి అక్కా బావలకి పని ఇప్పించాడు. ప్రతి శనివారం ఆ వారానికి చేసిన పనికి డబ్బు ముట్టడం ఆ దంపతులు ఇద్దరికీ నచ్చింది.
వాళ్ళు ఓ స్లమ్‌లోని చిన్న గుడిసె అద్దెకి తీసుకుని దిగారు. రెండు సంవత్సరాల తర్వాత ఆ దంపతులకి సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆలోచన వచ్చింది. స్వంత స్థలం కొనేంత డబ్బు వారికి లేదు. మిగిలిన కూలీలు చేసే పనే వాళ్ళూ చేశారు. ఓ రౌడీకి నెల నెలా అద్దె చెల్లిస్తున్నంత కాలం ఓ పోరంబోకు స్థలంలో యాభై చదరపు గజాల మేర ఏదైనా కట్టుకోవచ్చు. రైలు పట్టాల పక్కనే కొత్తగా విస్తరించిన పట్టణంలో, అపార్ట్‌మెంట్స్‌ బాగా అభివృద్ధి చెందే చోటది. అది పనికి కూడా దగ్గర్లోనే ఉంటుంది.

పగడాలు, ఆమె భర్త కాగితాలు లేని, నోటి మాట మీద నడిచే ఓ యాభైమంది గల చిట్టీలో చేరి, అవసరమైన సొమ్ముని తీసుకున్నారు.
తనకున్న నైపుణ్యంతో పగడాలు భర్త, అతని బావమరిది ఆ ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. సిమెంట్‌ ఖర్చు కాబట్టి బంక మట్టిని ఉపయోగించి గోడలని లేపారు. పైన నల్లటి టార్పాలి¯Œ ని కప్పుగా వేశారు. ఆ ఇంటికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. తలుపుకి డబ్బు చాలక తెర కట్టారు. ఓ శుభముహూర్తంలో గృహప్రవేశం చేశారు.

స్వంత ఇల్లు అనేది వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. క్రమంగా వాళ్ళు ఆ ఇంటిని అభివృద్ధి చేసుకోసాగారు. ముందుగా పగడాలు భర్త లోపలి మట్టి నేల మీద గచ్చు చేశాడు. తర్వాత వర్షాకాలంలో గోడలని కాపాడటానికి బయటివైపు సిమెంట్‌ చేశాడు. ఆ తర్వాత పైన టార్పాలిన్‌ స్థానంలో సెకండ్‌ హేండ్‌ ఇనుప రేకులను కొని కప్పాడు. వాటికున్న చిల్లుల్లోంచి వర్షం కారకుండా వాటిని సీసంతో మూసేశాడు.
ఆ తర్వాత గోడల లోపలి వైపు సిమెంట్‌ చేశాడు. వారు కూలీకి వెళ్ళి చేసే ఈ పనులన్నీ తమ స్వంతానికి చేస్తూండటంతో ఆ పనులు మునుపు ఇవ్వని ఆనందాన్ని ఇవ్వసాగాయి.

పగడాలు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి తన భర్తని ఇంటికి తలుపు పెట్టించమని అడుగుతూనే ఉంది. తెర తీసుకుని ఎవరైనా, ఎప్పుడైనా లోపలికి రావచ్చు. రాత్రి తాము నిద్రలో ఉండగా దొంగ చొరబడొచ్చు. కాని ప్రతిసారి తలుపు కన్నా చేయాల్సిన ఇతర పనులే ముఖ్యం అవడం వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది.
ఇంట్లోని మట్టి నేలలో జెర్రులు తిరుగుతూండటంతో ఆ నేలని గచ్చు చేయించాల్సి వచ్చింది. వర్షాకాలంలో ఇటుకల మధ్య ఉన్న మట్టి కారి గోడలు కూలకుండా సిమెంట్‌ చేయాల్సి వచ్చింది. అరబస్తా సిమెంట్‌ మిగలడంతో అది వృథా కాకుండా దాంతో ఇంట్లో వంటకి ఓ చిన్న గట్టుని కట్టాడు. వర్షానికి కప్పు మీంచి గోడల మీదకి కారే నీటిని ఆపటానికి పైకప్పు వేయించాల్సి వచ్చింది. ఇలా వాళ్ళా ఇంట్లోకి ప్రవేశించాక తలుపు కన్నా మిగిలినవే ముఖ్యమైనవి అయ్యాయి.

అవన్నీ పూర్తయ్యాక పగడాలు భర్త ముందు గోడకి గుమ్మం తెచ్చి పెట్టాడు. తర్వాతి సంవత్సరం తలుపుని అమర్చాడు.
‘‘నాలుగేళ్లకి ఇది కుదిరింది. ఇంక దొంగలు ఎవరూ చొరబడరు. మన ఇల్లు ఇనప్పెట్టెలా భద్రం.’’ పగడాలు ఆ రాత్రి తలుపు లోపల టవర్‌ బోల్ట్‌ పెట్టి సంతృప్తిగా చెప్పింది.
తలుపు అమర్చిన నెల రోజులకి పగడాలు భర్త పనిలో జరిగిన ప్రమాదంలో మరణించాడు. అతని మరణం అందరికీ షాక్‌.
∙∙ 
ఆ రాత్రి స్పర్శకి పగడాలుకి మెలకువ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తే ఓ మగాడు తనని తడుముతూ కనిపించాడు. ఆమె ఒక్క ఉదుటున బయటికి దూకి, తలుపు బయట గొళ్ళెం పెట్టి దొంగ అని అరవసాగింది. క్షణాల్లో ఆడ, మగ చాలామంది పక్క గుడిసెల్లోంచి లేచి వచ్చారు.
ఆ దొంగ ఆమె పక్కింటివాడు. ఆమె భర్త వయసున్న అతను చిత్తూరు జిల్లా నుంచి వలస వచ్చాడు. అంతా అతనికి దేహశుద్ధి చేసి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలని తీర్పు చెప్పారు.
మర్నాడు పగడాలు తన మరదలితో చెప్పింది.
‘‘ఇంతకాలం నేను తలుపే రక్షణ ఇస్తుంది అనుకున్నాను. కాదు. తెర ఉండగా ఎన్నడూ వాడు రాలేదు. అప్పుడు నా భద్రతకి మా ఆయన అనే బలమైన తలుపు ఉందని నాకు తెలీలేదు. ఆడదానికి నిజమైన తలుపు మగాడే.’’
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఇవి కూడా చదవండి: ఈ వారం కథ: 'ఆత్మబలం'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement