104 ఏళ్లకు బెయిల్‌... 105లో స్వేచ్ఛ | Funday Special Legal Case Story Interesting Old Man Legal case | Sakshi
Sakshi News home page

104 ఏళ్లకు బెయిల్‌... 105లో స్వేచ్ఛ

Sep 6 2026 9:27 AM | Updated on Sep 6 2026 9:27 AM

Funday Special Legal Case Story Interesting Old Man Legal case

జీవిత చరమాంకంలో ఉన్న ఓ వృద్ధుడికి కోర్టు స్వేచ్ఛ ప్రసాదించింది. శిక్షా కాలాన్ని రద్దు చేసింది. 30 ఏళ్ల జైలు జీవితానికి ‘సుప్రీం’ తీర్పుతో  తెరపడింది. పశ్చిమబెంగాల్‌లోని మాల్దా జిల్లాలో పాతకక్షల నేపథ్యంలో ఓ హత్య జరిగింది.  రసిక్‌చంద్ర మండల్‌ అనే వ్యక్తిపై  హత్యానేరం కింద అభియోగాలు నమోదయ్యాయి. అప్పుడు అతని వయస్సు 68 ఏళ్లు. ట్రయల్‌ కోర్టు  74 ఏళ్ల వయసులో యావజ్జీవ శిక్ష విధించింది. 104 ఏళ్ల వయసులో మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. వృద్ధాప్యం, అనారోగ్యంతో  ఉన్న అతడ్ని తిరిగి జైలుకు పంపకూడదని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం అతని వయస్సు105 ఏళ్లు.

1998 నవంబరు8న మాల్దా జిల్లాకు చెందిన సురేష్‌ మండల్‌ తన ఇంట్లో భోజనం చేస్తున్నాడు. అదే సమయంలో రసిక్‌చంద్ర మండల్‌తో పాటు మరికొందరు అక్రమంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి సురేష్‌పై కాల్పులు జరిపిఅక్కడి నుంచి పరారయ్యారని వారిపై అభి యోగం నమోదైంది. తీవ్రంగా గాయపడిన సురేష్‌ను అతడి భార్య, చుట్టుపక్కల వారు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మాల్దా సర్దార్‌ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత సురేష్‌ మృతి చెందాడు. ఈ ఘటనపై మాణిక్‌ఛక్‌ పోలీస్‌స్టేషన్‌లో నిందితులపై ఐపీసీ సెక్షన్‌ 302/34, ఆయుధాల చట్టం సెక్షన్‌ 25/27 కింద కేసులు నమోదయ్యాయి. 

ట్రయల్‌ కోర్టులో విచారణ
మాల్దా అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో విచారణ జరిగింది. నిందితులు తాము నిర్దోషులమని వాదించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలకు, మృతుడి భార్య వాంగ్మూలానికి మధ్య అనేక వైరుధ్యాలున్నాయని నిందితుల తరపు న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు రసిక్‌చంద్ర, మరో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ 1994లో తీర్పు ఇచ్చింది. రెండో నిందితుడికి ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష అదనంగా విధించింది. మిగిలిన నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. 

ఉన్నత, సర్వోన్నత న్యాయస్థానాల్లో చుక్కెదురు 
ట్రయల్‌ కోర్టు తీర్పుపై  నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. మృతుడి బంధువుల సాక్ష్యం చెల్లదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని రెండో నిందితుడు పేర్కొన్నాడు. పలు సాక్ష్యాలను కోర్టు ముందుంచాడు. ఇరుపక్షాల వాదనలు, మెడికల్‌ రికార్డులు పరిశీలించిన హైకోర్టు ట్రయల్‌ కోర్టు తీర్పులో జోక్యం చేసుకునే అంశాలేవీ కనిపించలేదని పేర్కొంటూ అప్పీల్‌ను డిస్మిస్‌ చేసింది. దీంతో మండల్‌  2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సరైన ఆధారాలు లేవని ఈ అప్పీల్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. 

99 ఏళ్ల వయసులో మధ్యంతర బెయిల్‌ మండల్‌ 30 ఏళ్లు జైలులోనే ఉన్నాడు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా ముందస్తు విడుదల కోరుతూ 99 ఏళ్ల వయసులో 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మండల్‌ శారీరక, ఆరోగ్య పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. అనంతరం సుప్రీంకోర్టు మధ్యంతర  బెయిల్‌ మంజూరు చేసింది. 

ట్రయల్‌ కోర్టు విధించే షరతులకు లోబడి అతడ్ని విడుదల చేయాలని ఆదేశించింది. అప్పటికి అతని వయసు 104 ఏళ్లు. 2026లో సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. అతని వయసును పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్వేచ్ఛను ప్రసాదించింది.. ‘వృద్ధాప్యం, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును ముగిస్తు్తన్నాం. మిగిలిన శిక్షాకాలాన్ని మాఫీ చేస్తున్నాం’ అని సీజే బెంచ్‌ తీర్పు ఇచ్చింది. 

జీవిత ఖైదు శిక్షాకాలం పూర్తి కాకపోయినా అతడ్ని మళ్లీ కస్టడీలోకి తీసుకోరని ధర్మాసనం పేర్కొంది. 2024లో మండల్‌కు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ ఉత్తర్వును తుది ఉత్తర్వుగా వెల్లడించింది. ఈ కేసులో మండల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించలేదు; దోషిగా నిర్ధారించిన తీర్పునూ మార్చలేదు. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో జీవిత ఖైదును కొనసాగించాల్సిన అవసరం లేదని భావించింది. శిక్ష నుంచి విముక్తి కల్పించింది. మానవీయ ముగింపును ఇచ్చింది.

దిలీప్‌ మాదిరెడ్డి

(చదవండి: చిన్నారులు ఏఐ నేర్చుకునేలా శృతి ధరివాల్‌ గేమ్‌ స్ట్రాటజీ..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement