మొబైల్ వాడకంతో పెరుగుతున్న సమస్య
ఈ రోజుల్లో కంప్యూటర్‌పై పని లేకపోవడాన్ని లేదా గంటల తరబడి మొబైల్ లేని జీవితాన్ని ఊహించడం కష్టం. టెకీలు సరే సరి. ఇంట్లో ఉండే మహిళలూ, పెద్దగా టెక్నాలజీతో టచ్ లేనివారు సైతం అదేపనిగా రీల్స్ చూడటమో లేదా యూట్యూబ్‌లో వీడియోలు చూడటమో చేస్తున్నారు. దాంతో పాటు ఇటీవలి జీవనశైలి కారణంగా శారీరక శ్రమ తగ్గిపోవడం దాంతో ఎప్పుడూ ఒకే చోట కూర్చుని ఉండటం లేదా వృత్తి ఉద్యోగాల్లో సైతం కదలకుండా ఒకేచోట కూర్చుని పనిచేయడం బరువు పెరగడం (ఊబకాయం రావడం) వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
అంతేకాదు... అలాంటి స్థిరంగా ఒకే చోట ఉండిపోవడంతో (సెడెంటరీ లైఫ్‌స్టైల్) వల్ల ఎముకలూ, కీళ్ల ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా యువత అదేపనిగా మెడవంచి, దాన్ని కాస్తంత ముందుకు సాచి మొబైల్ చూస్తుండటం వల్ల వస్తున్న ఆరోగ్య సమస్య పేరే... ‘టెక్ నెక్’. అసలు ‘టెక్ నెక్’ అంటే ఏమిటి, ఎముకలూ, కీళ్లూ (ముఖ్యంగా మెడ ఎముకలైన వెన్నుపూసలపై) దాని ప్రభావాలేమిటి; నివారణకు ఏం చేయాలనే అంశాలను తెలుసుకోవడం కోసం ఉపయోగపడేదే ఈ కథనం...
ఇటీవల మొబైల్ కారణంగా మెడ నుంచి మోకాళ్ల వరకు ఉన్న ఎముకలపై ప్రభావం పడుతోంది. ఎప్పుడో బాగా వయసు పెరిగాక రావాల్సిన ఎముకల అరుగుదల, మెడ ఎముకల్లో డిస్క్ సమస్యల వంటివి ఇప్పుడు చాలా యుక్తవయసువారిలోనూ, ఇప్పుడిప్పుడే కౌమార వయసు వీడుతున్నవారిలోనూ కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద కీళ్ల సమస్యలకు దారితీయవచ్చనీ, అందునా మరీ ముఖ్యంగా మొబైల్‌ను ఎక్కువసేపు తల వంచి చూడటం వల్ల మెడపై నిరంతర ఒత్తిడి పడుతోందనీ,. దీనినే సాధారణంగా ‘టెక్ నెక్’ సమస్యగా ఆర్థోపెడిక్ నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘టెక్ నెక్’ సమస్య ఏమిటో చూద్దాం.
ఏమిటీ ‘టెక్ నెక్’ సమస్య...?
మెడను ఎక్కువసేపు ముందుకు వంచి అదేపనిగా అదే భంగిమలో చాలాసేపు ఉంచడం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంటుంది. దాంతో మెడ నొప్పి, భుజాలు బిగుతు ఉన్నట్లు అనిపించడం, తల ముందుకు వంగి అసహజ భంగిమలో చాలాసేపు ఉండిపోవడంతో తలనొప్పి వంటి సమస్యలు కనిపించవచ్చు. ఇలా ఈ లక్షణాలతో వ్యక్తమయ్యే సమస్యనే డాక్టర్లు ‘టెక్ నెక్’గా చెబుతున్నారు.
మరి కంప్యూటర్ / మొబైల్స్ మానేయాల్సిందేనా?
ఈరోజు కంప్యూటర్ మీద పనిచేయడమనేది జీవన విధానంలో ఒక భాగం మాత్రమే కాదు. అదే జీవనోపాధికి ప్రధాన మార్గం కూడా. అంతేకాదు... మొబైల్ వాడకం కూడా జీవితం నుంచి విడదీయలేని అంశమై పోయింది. ప్రతిపనికీ ఓటీపీలూ, బ్యాంకు నుంచి మనకు వచ్చే సమాచారాలు, డబ్బు ట్రాన్స్‌ఫర్లు వంటి అనేక పనులకోసం మొబైల్ వాడకం అన్నది జీవితంలో ఒక అవిభాజ్యమైన అంశంగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో వాటిని ఉపయోగించకుండా ఉండటమన్నది అసాధ్యం. అందుకే మొబైల్ లేదా కంప్యూటర్ వాడకాన్ని పూర్తిగా మానేయడం అవసరం లేదు. కాకపోతే వాటిని సరైన భంగిమలో ఉపయోగించడం, తరచూ విరామాలు తీసుకోవడం, మెడను ఒకే స్థితిలో ఎక్కువసేపు ఉంచకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
నివారణ ఇలా...
టెక్ నెక్‌తో మెడ దగ్గరి ఎముకల్లో నొప్పి లేదా మెడ కండరాల దగ్గర ఇబ్బంది వంటివి ఉన్నవారు అదేపనిగా మెడను ముందుకు సాచి ఉంచడానికి బదులుగా తలను నిటారుగా ఉంచి మాత్రమే కంప్యూటర్‌గానీ, మొబైల్‌గానీ చూడటం అలవాటు చేసుకోవాలి. మెడను ఎంతగా వంచితే అంతగా మెడ ఎముకలపైనా, మెడ కండరాలపైనా ఒత్తిడి పెరిగి మున్ముందు అది సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుందని గుర్తించాలి.
ఇక దీనితో పాటు అదేపనిగా కూర్చుని ఉండటంతో బరువు పెరిగి, అది మోకాళ్లపై ఒత్తిడిని పెంచి మోకాళ్ల నొప్పులు వస్తున్నవారు, మోకాళ్ల వాపు, కీళ్లలో బిగుతు, కూర్చున్నవాళ్లు వెంటనే లేకలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే తక్షణం ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించడం అవసరం. అయితే ఈ సమస్యలకు తక్షణం మందులు వాడటం, శస్త్రచికిత్స చేయించడం అవసరం ఉండకపోవచ్చు.
అదేపనిగా కూర్చుని ఉండటానికి బదులుగా పనిలో తరచూ బ్రేక్ ఇస్తూ అటు ఇటు కదలడం, పొద్దున్నే వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం, జీవనశైలిలో మార్పులు చేసుకుని బరువు తగ్గించుకోవడంతో పాటు అవసరమైతే ఫిజియోథెరపీ వంటి ప్రక్రియలను డాక్టర్లు సూచిస్తారు.
ఒకవేళ కొందరిలో ఇప్పటికే కీళ్లనొప్పులు లేదా కీళ్ల సమస్య ఉన్నవారికి వైద్య నిపుణులు వారికి సరిపోయే వ్యాయామాన్ని సూచిస్తారు. దీనికి తోడు ఆరోగ్యకరమై సమతులాహారం, అందులో తగినంత ప్రోటీన్, కాల్షియం, విటమిన్ల వంటివి తీసుకోవాలంటూ ఆ మేరకు దేహానికి అన్ని పోషకాలు అందే ఆహారంపై కూడా దృష్టిపెట్టేలా సలహాలు అందిస్తారు.
నేటి వృత్తుల్లో వచ్చిన మార్పులతో ఇవీ అనర్థాలు...
కదలకుండా ఒకేచోట కూర్చుని అదేపనిగా తల ముందుకు ఒంచి కంప్యూటర్ చూడటంతో పాటు అదేపనిగా కూర్చుని చేసే వృత్తుల కారణంగా చాలామందిలో బరువు పెరిగి ఊబకాయం వస్తోంది. దాంతో ఆ బరువు కారణంగా కొద్దిగా నడవడం గానీ, మెట్లు ఎక్కడం గానీ లేదా ఎక్కువ సేపు నిలబడటం, మామూలు రోజువారీ పనులుచేయడంలో వాళ్ల మోకాళ్లపైన భారమూ, ఒత్తిడీ పెరుగుతున్నాయి.
దాంతో గతంలో చాలాకాలం తర్వాత వచ్చే మోకాళ్ల కీళ్ల అరుగుదల వంటి ముప్పు ఇప్పుడు చాలా త్వరితంగానే వచ్చే ప్రమాదం పెరుగుతోంది. ఇక దేహం బరువు పెరగడం వంటి అంశాలు హైబీపీ, డయాబెటిస్‌కూ దారితీస్తాయన్న విషయం చాలామందికి తెలిసిందే. వీటితో పాటు కనిపిస్తున్న కాస్తంత పాత సమస్యకే సరికొత్త పేరు ‘టెక్ నెక్’! కూడా.
చికిత్స... తొలిదశల్లో కొన్ని మందులతో ఉపశమనం కలిగేలా డాక్టర్లు తాత్కాలికమైన చికిత్సలు అందిస్తారు. ఒకవేళ దేహం బరువు ప్రమాదకరంగా మారినవాళ్లకూ, మెడ ఎముకలూ, మోకాళ్లు బాగా అరిగిపోయిన వాళ్లకు తగిన చికిత్సలతో పాటు బాగా అవసరమైన వాళ్లకు చివరి ప్రత్యామ్నాయంగా (గ్రేడ్ – 4 దశలో) మాత్రమే శస్త్రచికిత్సలను డాక్టర్లు సూచిస్తారు.


