షావుకారు జానకి కన్నుమూత | Veteran South Indian actress Sowcar Janaki passed away | Sakshi
Sakshi News home page

షావుకారు జానకి కన్నుమూత

Aug 22 2026 5:06 AM | Updated on Aug 22 2026 5:06 AM

Veteran South Indian actress Sowcar Janaki passed away

దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటి షావుకారు జానకి శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. చెన్నై తేనాంపేట సెనటాఫ్‌ రోడ్డులోని నివాసంలో ఉంటూ వచ్చారు జానకి. బుధవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురయ్యారు. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరారు. శ్వాస సమస్య తలెత్తడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి, ఆమెకు చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారామె. జానకి భౌతిక కాయాన్ని ఆస్పత్రి నుంచి రాత్రి సమయంలో తేనాంపేటలోని స్వగృహానికి తరలించారు. జానకికి ఇద్దరు కుమార్తెలు యజ్ఞ›ప్రభ, సచ్చీరావు, కుమారుడు వెంకటరమణ ఉన్నారు. శనివారం సాయంత్రం బీసెంట్‌ నగర్‌ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్‌ మీడియాకు తెలిపారు.

శ్రీదేవి పరిచయం జానకి వల్లే! 
షావుకారు జానకి వల్లే శ్రీదేవి వెండితెరకు పరిచయం అయ్యారు. వాహిని స్టూడియోస్‌ వాళ్ళు ఒక పెద్ద సినిమా తీస్తున్నారు. ఆ సమయంలో రాజేశ్వరి (శ్రీదేవి తల్లి) తన ఆరేళ్ల కుమార్తె శ్రీదేవితో కలిసి దూరంగా ఉండి షూటింగ్‌ చూస్తున్నారు. అప్పుడు ఆ చిత్రంలోని బాల మురుగన్‌ పాత్రకు ఓ పిల్లాడు కావాలి... అందంగా ఉండాలి... బ్రిలియంట్‌గా ఉండాలని దర్శకుడు చెబుతున్నారు. అది విని, శ్రీదేవిని తీసుకుంటే బాగుంటుందని ఆ దర్శకుడితో జానకి అన్నారు. రాజేశ్వరి కూడా ఒప్పుకున్నారు. మేకప్‌ టెస్ట్‌ చేస్తే, అందరూ ఆశ్చర్యపోయేలా బాల మురుగన్‌ పాత్రకు శ్రీదేవి చక్కగా సరిపోయింది. చిన్న చిన్న డైలాగ్స్‌ చెప్పమంటే... మంచి హావభావాలతో డైలాగ్స్‌ చెప్పడం చూసి వెంటనే ఓకే చేసేశారు. అలా శ్రీదేవి పరిచయం జానకి వల్ల జరిగింది.

ఉచితంగా నాటకాలు
వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నప్పటికీ నాటకాల మీద మక్కువ మాత్రం పోలేదు షావుకారు జానకికి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, పైసా కూడా తీసుకోకుండా సుమారు 300 నాటకాలు చేశారామె. అప్పట్లో కె. బాలచందర్‌ రచన, దర్శకత్వం వహించిన పలు నాటకాల్లోనూ వేషాలు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement