breaking news
South Indian Actress
-
తల వంచని తార
మంచి నటి... తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆ విషయాన్ని నిరూపించుకున్నారు జానకి. ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. మంచి వ్యక్తిత్వం... వ్యక్తిగా జానకి మీద చాలామందికి ఉన్న అభి్రపాయం ఇది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తల వంచలేదు... తనని తాను తగ్గించుకోలేదు. వెండితెరపై నటిగా ఆమె షావుకారు... తెరవెనక నిజజీవితంలో తొలి దశలో పేదరికాన్ని అనుభవించినా నిఖార్సయిన వ్యక్తిగా ఉన్న జానకి వ్యక్తిత్వపరంగానూ షావుకారే! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి, నటనకు నిలువెత్తు నిదర్శనంగా పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ‘షావుకారు’ ఇక లేరు.‘షావుకారు’ జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1931 డిసెంబరు 11న శచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావు దంపతులకు మూడో సంతానంగా జన్మించారు జానకి. ఆమెకు అన్నయ్య, అక్కయ్యతో పాటు చెల్లి కృష్ణకుమారి తోబుట్టువులు. జానకిది సంప్రదాయ కుటుంబం కావడంతో అమ్మ నుంచి ఆచారాలు, శుచీశుభ్రత అలవడ్డాయి. రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు జానకి. అయితే తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు మారుతూ ఉండటం వల్ల ఆమె చదువు సరిగ్గా సాగలేదు. చెన్నై వెళ్లిన తర్వాత ఆంధ్ర మహిళా సభలో జానకిని మెట్రిక్‌లో చేర్పించారు. చిన్నతనంలోనే స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకాశవాణి నాటికల ద్వారా కళారంగంలో అడుగుపెట్టారామె. ఓ సారి చెన్నైలో ఆకాశవాణిలో ‘బాలానందం’ అనే ప్రోగ్రామ్‌లో జానకి గాత్రం ప్రముఖ దర్శక–నిర్మాత బి. నాగిరెడ్డికి నచ్చింది. దీంతో ‘నీ గాత్రం బాగుంది. పదాలను చక్కగా ఉచ్చరిస్తున్నావు. సినిమాలో చాన్స్ ఇస్తాను.. నటిస్తావా’ అన్నారట. అసలు నటనంటే ఏంటో తెలియకపోయినప్పటికీ ‘నటిస్తాను’ అని చెప్పేసి ఇంటికొచ్చిన జానకి.. జరిగిన విషయాన్నంతా తల్లిదండ్రులకు చెప్పారు. అయితే జానకిని మందలించి, శంకరమంచి శ్రీనివాసరావుతో వివాహం చేశారు తల్లిదండ్రులు. ఓవర్ కోట్ కప్పుకుని పరీక్షకు వెళ్లి... పెళ్లయినప్పుడు జానకి వయస్సు 15 ఏళ్లు. భర్తతో కలిసి విజయవాడలో కొత్త కాపురం ఆరంభించారామె. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అస్సాంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు జానకి. అప్పట్లో జానకి చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. తనని చదివిస్తూ, తాను కూడా చదువుకుంటూ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ ఓవర్ కోట్ కప్పుకుని పరీక్ష రాశారు జానకి. పెళ్లి తర్వాత ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం సరి కాదని చెన్నైలోని మేనమామ ఇంటికెళ్లారు. అక్కడే యజ్ఞ ప్రభకి జన్మనిచ్చారు. ఆ సమయంలో బి. నాగిరెడ్డి గతంలో తనకు ఇస్తానన్న సినిమా చాన్స్ గురించి భర్తకు చెప్పి, నటించటానికి ఒప్పించారు. చంకలో పాపాయితో ఆడిషన్స్‌కి... అవకాశం కోసం చంకలో పాపాయి, భర్తతో కలిసి బి. నాగిరెడ్డిని కలిశారు జానకి. పలు ఆడిషన్స్ తర్వాత ‘షావుకారు’ సినిమాలో హీరోయిన్గా తొలి అవకాశం వచ్చింది. మూడు నెలలు ఉన్న యజ్ఞ ప్రభని ఇంట్లో వదిలి ‘షావుకారు’లో నటించారు. ఆ సమయంలో ఓ తల్లిగా ఎంతో మానసిక వేదన అనుభవించారట ఆమె. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా నటించారామె. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో బి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ‘షావుకారు’ సినిమా 1950 ఏప్రిల్ 7న విడుదలై మంచి విజయం అందుకుంది. తొలి చిత్రంతోనే అసాధారణమైన అభినయాన్ని కనబరిచి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ‘షావుకారు జానకి’గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఐదువందల సినిమాల్లో... ‘షావుకారు’ మూవీ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 500 సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారామె. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోసిన జానకి దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి అగ్ర కథానాయకుల సరసన సుమారు రెండు వందలకు పైగా సినిమాల్లో ఆమె కథానాయికగా నటించడం విశేషం. ‘రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, అక్కాచెల్లెలు, బడిపంతులు, సంసారం ఒక చదరంగం, మంచి మనసులు’ వంటి పలు సినిమాలు జానకి నటనా పటిమకు నిదర్శనాలు. బుల్లితెర పైనా... ‘షావుకారు’ జానకి కేవలం వెండితెరపైనే కాదు... సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. తెలుగులో ‘నీడ, వరూధిని పరిణయం’, తమిళంలో ‘ఊరరింద రహస్యం, పెన్, అక్షయ’ వంటి సీరియల్స్‌లో నటించారు జానకి. వయసు మీద పడుతున్నప్పటికీ నటనపై ఉన్న మక్కువతో విశ్రాంతి తీసుకోకుండా ‘బిస్కోత్’ (తమిళం), ‘అన్నీ మంచి శకునములే’ (తెలుగు) వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారామె. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నీ మంచి శకునములే’(2023).పద్మశ్రీ జానకిషావుకారు జానకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం ఆమెకు దేశంలోని అత్యున్నత ΄ûర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు. పలు సంస్థలు ఆమెను జీవిత సాఫల్య పురస్కారాలతో గౌరవించాయి. అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న జానకి కళారంగంతో పాటు సామాజిక సేవకు గాను యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా నుంచి డాక్టరేట్ పొందారు. షావుకారు జానకి మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.ఇంట్లోకి రానివ్వని బంధువులు సినిమాల్లో వేషాలు వేయడానికి వెళ్లడం... హీరోయిన్గా హీరోలతో తాళి కట్టించుకునే సన్నివేశాలు, డ్యాన్స్ చేయడం.. వీటి వల్ల బంధువులు జానకిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదట. ఒకసారి ఇల్లు వెతుక్కునే క్రమంలో చుట్టాల ఇంట్లో నిద్రపోదామని వెళ్తే.. ‘వద్దమ్మా! అంకుల్ ఏదైనా అంటారు. రావద్దు’ అని మొహం మీదే చెప్పారట. కుటుంబంలో ఎవ్వరూ ప్రోత్సహించనప్పటికీ వృత్తి పట్ల అంకితభావంతో పని చేశారు. మూడు ప్రసవాలు జరిగినా కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 20 సినిమాలు చేయడం విశేషం. ‘నటిగా నువ్వు పనికి రావు’ అన్న కె. వి. రెడ్డితో ‘పనికి వస్తావు’ అనిపించుకునే స్థాయికి ఎదిగానని ఆమె ఓ సందర్భంలో చెప్పారు. నలుగురు ముఖ్యమంత్రులతో... భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ నటికీ దక్కని అరుదైన గౌరవం ‘షావుకారు’ జానకికి దక్కింది. దక్షిణాది రాజకీయాల్లో, సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తులుగా వెలిగిన నలుగురు దిగ్గజ ముఖ్యమంత్రులతో ఆమె వెండితెరను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎం.జి. రామచంద్రన్, జయలలిత, ఎం. కరుణానిధి... ఇలా నలుగురు సీఎంలతో కలిసి నటించారామె. వ్యక్తిత్వంలోనూ షావుకారే... కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటు ఉన్న జానకి దానివల్ల కొన్ని అవకాశాలు కోల్పోయారు. ఈ విషయం గురించి ఓ సందర్భంలో ఆమె చెప్పారు. ‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికీ నచ్చదు. కెరీర్ మొదట్లో నాకు నచ్చిన పాత్ర మాత్రమే ఎంచుకునేదాన్ని. పాత్రలో పూర్తిగా లీనమవ్వగలనన్న నమ్మకం ఉన్నప్పుడే అంగీకరించేదాన్ని. కొందరు నాకు పొగరు అన్నారు... కొందరు జానకితో సినిమా కష్టం అనేవారు... నేను మాత్రం అలా ఉండడమే నా వ్యక్తిత్వం అంటాను. అలా ఉండడం వల్ల చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది. అయినా నేను మాత్రం నా వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు. కుటుంబం విషయంలోనూ ఇలానే ఉండేదాన్ని... మా అబ్బాయి 19 ఏళ్ల వయసులో చదువు కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. తిరిగి రాలేదు. అది అతని వ్యక్తిత్వం... అతని నిర్ణయం. ఇక తల్లిదండ్రులు బతికుండగా పిల్లలకు ఆస్తులు పంచకూడదు. ఏ బంధం శాశ్వతం కాదు. ఓసారి ఆరోగ్యం బాలేనప్పుడు పుట్టింటికి వెళ్లా. అప్పుడు వాళ్లకి నేను భారమని నాకు అనిపించింది. పెళ్లయిన తర్వాత ఏ ఆడపిల్లా పుట్టింటికి వెళ్లకూడదనిపించింది. నా భర్తతో విడాకులు తీసుకున్నాక రెండో పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం వద్దనుకున్నాను. గొప్పింట్లో పుట్టినా ఆస్తులన్నీ పోయాయి. పేదరికం వల్లే నేను, నా చెల్లి కృష్ణకుమారి సినిమాల్లోకి వచ్చాం. సంపాదించాం. కుటుంబాలను చూసుకున్నాం’’ అని పేర్కొన్నారామె.ఒంటిపూట భోజనం వెండితెరపై రాణించిన జానకి వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను కష్టపడి సంపాదిస్తే, తన భర్త విలాసాల కోసం ఖర్చు చేసేవారని, కొంత కాలానికి ఆస్తులన్నీ కరిగిపోయాయని ఆమె ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నమ్మక ద్రోహానికి కూడా గురయ్యానని బాధపడ్డారామె. ఒక దశలో పిల్లల పెంపకం కూడా కష్టమౌతుందని భావించారామె. అందుకే రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేశానని ఆమె పేర్కొన్నారు.నో బీపీ... షుగర్‘‘షూటింగ్స్ లేనప్పుడు ఇంటి పనులే నాకు పెద్ద వ్యాయామం’’ అని చెప్పేవారు జానకి. అలాగే తన ఆహారపు అలవాట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘నాకు వంట చేయడం బాగా అలవాటు. స్వీట్స్‌లో అరిసెలంటే ఇష్టం. అయితే అవి తిన్నప్పుడు మిగిలినవి కట్ చేస్తాను. వెన్న, నెయ్యి, పాలు వంటి వాటిని పరిమితంగా తీసుకుంటాను. ఆరోగ్యకరమైన భోజనం రోజుకి ఒక్కసారైనా చాలు. ఆకలి లేకపోతే పండు తిని మంచినీళ్లు తాగి పడుకుంటాను. ఈ అలవాట్ల వల్ల నాకు బీపీ, షుగర్లు లేవు. అయితే రెండు మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నాను. గుండె ఆపరేషన్ అయినా పని చేస్తూనే ఉన్నాను. నాకు దేవుడిపై భక్తి ఉంది. కానీ మూఢనమ్మకాలు లేవు. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని నమ్ముతాను’’ అని చెప్పుకొచ్చారు షావుకారు జానకి. -
షావుకారు జానకి కన్నుమూత
దక్షిణాది చిత్రసీమలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ నటి షావుకారు జానకి శుక్రవారం కన్నుమూశారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. చెన్నై తేనాంపేట సెనటాఫ్ రోడ్డులోని నివాసంలో ఉంటూ వచ్చారు జానకి. బుధవారం రాత్రి ఆమె అస్వస్థతకు గురయ్యారు. వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యల కారణంగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. శ్వాస సమస్య తలెత్తడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి, ఆమెకు చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారామె. జానకి భౌతిక కాయాన్ని ఆస్పత్రి నుంచి రాత్రి సమయంలో తేనాంపేటలోని స్వగృహానికి తరలించారు. జానకికి ఇద్దరు కుమార్తెలు యజ్ఞ›ప్రభ, సచ్చీరావు, కుమారుడు వెంకటరమణ ఉన్నారు. శనివారం సాయంత్రం బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయని షావుకారు జానకి మనవరాలు, నటి వైష్ణవి భర్త అరవింద్ మీడియాకు తెలిపారు.శ్రీదేవి పరిచయం జానకి వల్లే! షావుకారు జానకి వల్లే శ్రీదేవి వెండితెరకు పరిచయం అయ్యారు. వాహిని స్టూడియోస్ వాళ్ళు ఒక పెద్ద సినిమా తీస్తున్నారు. ఆ సమయంలో రాజేశ్వరి (శ్రీదేవి తల్లి) తన ఆరేళ్ల కుమార్తె శ్రీదేవితో కలిసి దూరంగా ఉండి షూటింగ్ చూస్తున్నారు. అప్పుడు ఆ చిత్రంలోని బాల మురుగన్ పాత్రకు ఓ పిల్లాడు కావాలి... అందంగా ఉండాలి... బ్రిలియంట్‌గా ఉండాలని దర్శకుడు చెబుతున్నారు. అది విని, శ్రీదేవిని తీసుకుంటే బాగుంటుందని ఆ దర్శకుడితో జానకి అన్నారు. రాజేశ్వరి కూడా ఒప్పుకున్నారు. మేకప్ టెస్ట్ చేస్తే, అందరూ ఆశ్చర్యపోయేలా బాల మురుగన్ పాత్రకు శ్రీదేవి చక్కగా సరిపోయింది. చిన్న చిన్న డైలాగ్స్ చెప్పమంటే... మంచి హావభావాలతో డైలాగ్స్ చెప్పడం చూసి వెంటనే ఓకే చేసేశారు. అలా శ్రీదేవి పరిచయం జానకి వల్ల జరిగింది.ఉచితంగా నాటకాలువెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్నప్పటికీ నాటకాల మీద మక్కువ మాత్రం పోలేదు షావుకారు జానకికి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, పైసా కూడా తీసుకోకుండా సుమారు 300 నాటకాలు చేశారామె. అప్పట్లో కె. బాలచందర్ రచన, దర్శకత్వం వహించిన పలు నాటకాల్లోనూ వేషాలు వేశారు. -
మురిసె... మెరిసె...
ఓనమ్ పండగ ఆనందంలో మాత్రమే కాదు... సక్సెస్ సంబరంలోనూ ఉన్నారు మాళవికా మోహనన్. మోహన్‌లాల్ హీరోగా మాళవికా మోహనన్ హీరోయిన్గా నటించిన మలయాళ చిత్రం ‘హృదయపూర్వం’ ఇటీవల విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో జోష్‌గా పండగ చేసుకున్నారు మాళవిక. మరో మాట.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’తో తెలుగులోకి వస్తున్నారీ బ్యూటీ. ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ⇒ ‘8 వసంతాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అనంతికా సనీల్‌కుమార్. ఈ యంగ్ బ్యూటీ ఓనమ్ సెలబ్రేషన్స్‌ను కాస్త ముందుగా మొదలుపెట్టి, ఆ ఫొటోలు షేర్ చేసి, ఆనందాన్ని వ్యక్తపరిచారు. ⇒ తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఆల్రెడీ గెలుచుకున్న హీరోయిన్ కృతీ శెట్టి ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రేమ, శాంతి, ఆనందం... మనందరి జీవితాల్లో నెలకొనాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారీ బ్యూటీ. ⇒ అరడజను సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ సంయుక్త. అయినా పండగకి ఓ కాల్షీట్ కేటాయించారీ సుందరి. ఓనమ్ ఫెస్టివల్‌ను సంతోషంగా జరుపుకుని, అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపారు. ⇒ ఒకప్పటి హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. సక్సెస్ఫుల్ హీరోయిన్గా మీనా గురించి, తెలుగు ప్రేక్షకులకు తెలుసు. మీనా ఓనమ్ ఫెస్టివల్‌ను సెలబ్రేట్ చేసి, ఆ ఫొటోలను షేర్ చేశారు. ఇక వెంకటేశ్ కాంబినేషన్లో మీనా నటించనున్న ‘దృశ్యం 3’ సినిమా ఈ నవంబరులో ప్రారంభం కానుంది. ఇంకా హీరోయిన్లు మడోనా సెబాస్టియన్, అంజు కురియన్, అనిఖా సురేంద్రన్ వంటి మరికొందరు ఓనమ్ పండగను జరుపుకున్నారు. కొందరు పండగ రోజున, మరికొందరు ప్రీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అంటూ సందడి చేశారు. -
తెలుగు సినిమాలపై ప్రేమలో పడుతున్న హీరోయిన్లు
దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలైతే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్లో సినిమాలు చేయాలని చాలామంది హీరోయిన్స్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఇక్కడ అవకాశం దక్కించుకుని, ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో తొలి అడుగు వేస్తున్న హీరోయిన్స్‌పై కథనం.డబుల్ ధమాకాకన్నడ ‘కేజీఎఫ్’ మూవీలతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించారు హీరోయిన్ శ్రీనిధీ శెట్టి. ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించనున్నారు. శ్రీనిధీ శెట్టి ప్రస్తుతం రెండు స్ట్రయిట్ తెలుగు మూవీస్ చేస్తున్నారు. ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్ 3 (హిట్ 3)’. ఇందులో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటిస్తున్నారు. ఈ చిత్రంలో మృదులగా హీరోయిన్ పాత్రను శ్రీనిధీ శెట్టి చేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రోడక్షన్స్ పతాకాలపై డా. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ఈ హిట్ 3 మూవీ మే 1న విడుదల కానుంది.ఇక శ్రీనిధి ఓ హీరోయిన్ గా చేస్తున్న మరో మూవీ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ‘హిట్ 3, తెలుసు కదా’... ఇలా ఒకేసారి రెండు సినిమాలతో డబుల్æధమాకాగా శ్రీనిధీ శెట్టి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.పదేళ్ల తర్వాత...నటిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు వస్తున్నారు హీరోయిన్ మాళవికా మోహనన్ . ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాళవికా మోహనన్ , నిధీ అగర్వాల్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. మాళవికాకు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో మాళవిక ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ‘రాజా సాబ్’ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కావడం లేదని, కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారని తెలిసింది. కాగా విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయాల్సిన ఓ స్పోర్ట్స్ డ్రామా ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్)లో మాళవికా మోహనన్ హీరోయిన్ గా చేయాల్సింది. 2019 వేసవిలో ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇలా... టాలీవుడ్‌కి మాళవిక రాక ఆలస్యమైంది.రీమేక్‌తో ఎంట్రీప్రముఖ తమిళ దర్శక–నిర్మాత శంకర్ కుమార్తె అదితీ శంకర్ ఈ ఏడాది తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మూవీ ‘భైరవం’. ఈ మూవీలో అదితీ శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్‌గా చేస్తున్నారు. కాగా అదితీ శంకర్‌కు ‘భైరవం’ తెలుగులో తొలి చిత్రం. డా. జయంతి లాల్ గడ సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. గత ఏడాది మేలో రిలీజైన తమిళ హిట్ మూవీ ‘గరుడన్ ’కు తెలుగు రీమేక్‌గా ‘భైరవం’ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్.ఫౌజీకి జోడీగా...స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ మూవీ ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తో హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవడం అనేది చిన్న విషయం కాదు. ఈ అవకాశం యంగ్ హీరోయిన్ ఇమాన్వీకి దక్కింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పీరియాడికల్ లవ్ అండ్ పేట్రియాట్రిక్ మూవీగా ‘ఫౌజి’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు.ఇమాన్వీకి ఫస్ట్ మూవీ ఇదే. హైదారాబాద్ శివార్లలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణలో ఇమాన్వీ పాల్గొంటున్నారు. ప్రభాస్, ఇమాన్వీలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. జయప్రద, మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. ఇలా కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రభాస్, జయప్రద, మిథున్ చక్రవర్తి వంటి పెద్ద యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇమాన్వీకి కచ్చితంగా ప్లస్ పాయింటే. ఇక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇమాన్వీ యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి, దర్శకుడు హను రాఘవపూడి ఆమెకు ‘ఫౌజీ’ మూవీలో అవకాశం కల్పించారట.కాంతార అమ్మాయికన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ సినిమాలో హీరోయిన్ గా చేసిన సప్తమీ గౌడ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ‘తమ్ముడు’ మూవీతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారని తెలిసింది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమాలో నితిన్ సరసన సప్తమీ గౌడ హీరోయిన్ నటిస్తున్నారు. లైలా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీని ఈ శివరాత్రికి థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు’ సినిమా విడుదలపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజికల్ మ్యాజిక్ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘΄పొన్నియిన్ సెల్వన్ ’ మూవీలో ఐశ్వర్యా రాయ్ యంగ్ రోల్ చేసిన నటి సారా అర్జున్ గుర్తుండే ఉంటారు. ఈ యంగ్ హీరోయిన్ స్ట్రయిట్‌గా తెలుగులో చేస్తున్న మూవీ ‘మ్యాజిక్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మ్యూజికల్ డ్రామా మూవీలో సారా అర్జున్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.కాలేజ్ ఫెస్టివల్ కోసం నలుగురు టీనేజర్లు ఓ ఒరిజనల్ సాంగ్‌ను కంపోజ్ చేయాలనుకునే ప్రయత్నంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది ఈ సినిమా కథాంశమని సమాచారం. ఈ మూవీలో ఎనిమిది పాటలు ఉంటాయట. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చు తుండటం విశేషం. ఈ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.అచ్చ తెలుగు అమ్మాయిప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లోని సినిమాలతో ఇలియానా వంటి హీరోయిన్ ్స తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కాగా ఆయన డైరెక్షన్ లో రానున్న తాజా చిత్రంతో వీణా రావు అనే తెలుగు అమ్మాయి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ మూవీలో నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామరావు హీరోగా పరిచయం అవుతున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఈ మూవీని గీత నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన వీణా రావుకు కూచిపూడి డ్యాన్స్‌లోనూ ్రపావీణ్యం ఉందని, మేకర్స్ ఇటీవల ఓ సందర్భంగా వెల్లడించారు.ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ‘లైలా’ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ నెల 14న ‘లైలా’ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ ఏడాదే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు ఆకాంక్ష. ‘తేరా యార్ హూ మై, కేసరి వీర్’ చిత్రాలతో పాటు దర్శకుడు మిలిప్ జవేరి డైరెక్షన్ లోని మరో మూవీలో నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ చిత్రాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇలా ఇటు తెలుగు అటు బాలీవుడ్లో ఒకే టైమ్‌లో ఆకాంక్ష ఎంట్రీ ఖరారు కావడం విశేషమనే చెప్పుకోవాలి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న హీరోయిన్స్ మరికొందరు ఉన్నారు. ఇంకొంత మంది హీరోయిన్స్ తెలుగుకు వచ్చేందుకు కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు -
యాక్టింగ్ రాదని ట్రోల్స్.. కానీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్.. లక్కీ హీరోయిన్ (ఫొటోలు)
-
అందాల తారలు, గారాల బెస్ట్ ఫెండ్స్ (ఫొటోలు)


