ఫండే
అందం, అభినయంతోనే కాదు... తన వ్యక్తిత్వంతోనూ ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న నటి సాయిపల్లవి. మేకప్ కంటే సహజత్వానికే ప్రాధాన్యమిస్తూ, కథల ఎంపికలోనూ తనదైన దారిలో సాగుతోన్న ఈ సీతా మాత జీవితంలోని ఆసక్తికరమైన సంగతులు ఆమె మాటల్లోనే...
పేరులోనే... సాయితత్త్వం!
నా సొంతూరు తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉన్న కోటగిరి. మాది బడగ కుటుంబం. మా అమ్మ రాధామణికి సాయిబాబా అంటే ఎంతో భక్తి. అందుకే నా పేరులో ‘సాయి’ అని చేర్చారు. అలా నా పేరులోనే అమ్మ భక్తి కనిపిస్తుంది. కుటుంబం, మన మూలాలు మన వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి.
డ్యాన్స్... నా ఫస్ట్ లవ్!
చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్‌లోనూ, కాలేజీలోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. అలా డ్యాన్స్‌తో మొదలైన నా ప్రయాణం నన్ను కెమెరా ముందుకు తీసుకొచ్చింది. అయితే నాన్న సెంతామరై మాత్రం ముందు చదువుపైనే దృష్టి పెట్టాలని చెప్పేవారు. అందుకే జార్జియాలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను.
‘ప్రేమమ్’తో ప్రేమ మొదలు!
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో నటిగా నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యా. ఒకే తరహా పాత్రల్లో కనిపించడం కంటే, ప్రతిసారీ కొత్తగా కనిపించే ప్రయత్నం చేస్తుంటా. పాత్రలో నిజాయతీ ఉంటే, భాష తెలియకపోయినా భావం ప్రేక్షకులకు చేరుతుందని నమ్ముతా.
మేకప్‌కి మినిమమ్ మార్కులే!
అందంగా కనిపించాలనే ఒత్తిడిని నేను ఎక్కువగా తీసుకోను. చర్మ సంరక్షణ విషయంలోనూ చాలా సాధారణమైన పద్ధతులనే అనుసరిస్తా. బయటకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా సన్ స్క్రీన్ రాసుకుంటా, లేదంటే మాయిశ్చరైజర్ వాడతా. అంతే!
అలాంటి బట్టలంటే.. నో నో!
నాకు నలిగిపోయిన దుస్తులు చూస్తే అస్సలు నచ్చదు. ఎవరైనా అలా కనిపిస్తే వెంటనే వారి దుస్తులను సరిచేస్తుంటా. ఇది చిన్న విషయమే అయినా, మన చుట్టూ ఉన్నవాటిని చక్కగా ఉంచుకోవాలనుకుంటాను. ఖాళీ సమయాల్లో తేనెటీగల పెంపకం, తోటపని చేస్తుంటాను. ప్రకృతితో గడపడం మనసుకు ప్రశాంతతనిస్తుంది.
తాతయ్యతో అనుబంధానికి గుర్తు
నాకు దైవభక్తి ఎక్కువ. మా తాతయ్య ఇచ్చిన రుద్రాక్ష మాలను ఎప్పుడూ చేతికి ధరిస్తా. అది నాకు కేవలం ఆభరణం కాదు, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే జ్ఞాపకం. మన జీవితంలో కొన్ని వస్తువులకు ప్రత్యేకమైన భావోద్వేగపరమైన విలువ ఉంటుంది. అలాంటిదే ఆ మాల.
సీతమ్మగా ఎదురుచూపు!
నాకు రామాయణం అంటే ఎంతో ఇష్టం. అందులోనూ సీతమ్మ పాత్ర అంటే ప్రత్యేకమైన అభిమానం. సీతమ్మ పాత్రలోని సహనం, ధైర్యం, ఆత్మగౌరవం– ఇలా ఎన్నో గొప్ప లక్షణాలు నన్ను ఆకట్టుకుంటాయి. అలాంటి పవిత్రమైన పాత్రను పోషించే అవకాశం రావడం ఒక బాధ్యతగా భావిస్తా. తెరపై నన్ను సీతమ్మగా చూడాలని మా కుటుంబం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
ఇదీ చదవండి: రణ్‌బీర్ కపూర్ రామాయణ.. టాలీవుడ్ హీరో రివ్యూ


