ఆరావళిలో వినిపించిన మృదుల రవళి... | Umashankar Joshi Jnanpith Poet | Sakshi
Sakshi News home page

ఆరావళిలో వినిపించిన మృదుల రవళి...

Nov 8 2026 1:16 PM | Updated on Nov 8 2026 1:16 PM

Umashankar Joshi Jnanpith Poet

ఉమాశంకర్‌ జోషీ, కథా రచయిత

ఫండే

లిటిల్‌వరల్డ్‌

‘హే నిశీథ, రుద్రరమ్య నర్తకా!
సృజన ఫలకమున నటించు శైలూషకా!!
నీ గళసీమను పొంగెనదే స్వర్గంగ కండ్రిక,
అరచేతను మోగెనదే ఆ ఝంఝా డమరుక!
తోకచుక్కలా తలపై తూగుతోంది తూలిక,  
ఉత్తరీయమై ఊగెను రజత మేఘమాలిక!’

– సున్నిత భావన, సునిశిత దర్శన, కోమల ప్రకటన కలగలిసిన లలితగీతం ఇది. ఉమాశంకర్‌ జోషీ పలికించిన ఈ సంస్కృతపద భూయిష్ఠమైన గుజరాతీ వచనగేయం 1938లో అచ్చయింది. ఆయన మరుసటి సంవత్సరం వెలువరించిన ‘నిశీథ!’ కవితా సంకలనానికి మకుటంగా ఈ గీతమే నిల్చింది. తెలుగులో మహాకవి శ్రీశ్రీ ‘హరోం హరోం హర హర హర హర హర’ అంటూ తన మహాప్రస్థాన గీతంలో నినదించి, అప్పటికి నాలుగేళ్ళే అయింది!

శ్రామిక జనపక్షపాతం పతాకగా పైకెత్తిన అభ్యుదయ కవిత్వం గతానికీ ఆగతానికీ మధ్య వారధిగా నిలిచింది. అదే దాని సహజ స్వరం! బహుశా అందుకేనేమో, భారతీయ అభ్యుదయ సాహిత్య ఉద్యమాన్ని ప్రభావితులు చేసిన ప్రముఖుల జాబితాలో జవాహర్‌లాల్‌ నెహ్రూ, శ్రీశ్రీ, అన్నా భావు సాఠేల పేర్లతో పాటుగా ఉమాశంకర్‌ జోషీ పేరు కూడా చేర్చారు జావేద్‌ అఖ్తర్‌. కవిగా, రూపకకర్తగా, కథానికా రచయితగా ప్రసిద్ధుడైన జోషీ 1939లోనే రంజిత్‌ రాం సువర్ణ చంద్రక పురస్కారం పొందారు.

మరో నాలుగేళ్ళకు నర్మద్‌ సువర్ణ చంద్రక పురస్కారం గెల్చుకున్నారు. 1967లో ఉమాశంకర్‌ జోషీ– కన్నడ బహుముఖ ప్రజ్ఞాశాలి ‘కువెంపు’తో కలిసి– జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా! 1970లో జోషీ రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. మరో మూడేళ్ళకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం కూడా దక్కింది.

దిశ మార్చిన నగరజీవనం
నూటపదిహేనేళ్ళ కిందట, 1911లో, జోషీ పుట్టిన వూరు బామ్నా ఓ బ్రాహ్మణాగ్రహారంగా వుండేది. అప్పట్లో అది ఇదార్‌ సంస్థానంలో భాగంగా వుండేది. (ప్రస్తుతం బామ్నా, గుజరాత్‌ రాష్ట్రంలోని ఆరావళీ జిల్లాలో భాగంగా ఉంది!) తన కుమారుడికి అగ్రహారపు బడిలో బోధన సక్రమంగా సాగడంలేదని గ్రహించిన ఉమాశంకర్‌ తండ్రి ఆయన్ని ముందుగా ఇదార్‌ పట్టణంలోనూ, ఆ తర్వాత అహ్మదాబాద్‌ నగరంలోనూ ఉన్న ఉన్నతపాఠశాలల్లో చేర్పించాడు.

బ్రిటిష్‌ ప్రభుత్వ పాలనలో వున్న అహ్మదాబాద్‌లో చదువుకోవడం తన జీవితాన్ని ఓ మలుపు తిప్పిందని జోషీ భావించేవారు. నగరజీవనమే ఆయన సామాజిక రాజకీయ చైతన్యాన్ని ఉన్నతదిశగా నడిపించింది. అదే నగరజీవనం గీతరచయితగా జోషిని గుజరాతీ సాహిత్యానికి పరిచయం చేసింది. పదిహేడేళ్ళ ప్రాయంలో ఉమాశంకర్‌ జోషీ ఆరావళీ పర్వత శిఖరంపైకి విహారయాత్రకు వెళ్ళారు. అక్కడ నిశ్చలంగా నిలిచిన నక్కీ సరోవరంపై శరత్పూర్ణ చంద్రోదయాన్ని వర్ణిస్తూ జోషీ ఓ ప్రకృతిగీతం రాశారు.

‘కనుల నిండ సౌందర్యం తాగు సఖా తాగు!
గుండె తానె నిండిపోయి,
      పాటై ప్రవహించుతుంది!!’
అనే ఈ గేయం 1928లో ఓ కాలేజ్‌ మేగజైన్లో అచ్చయింది. బహుశా, అదే ఆయన తొలి ప్రచురిత గేయం! జోషీ తర్వాతి రోజుల్లో ప్రచురించిన అసంఖ్యాక వచన గేయాలు, గుజరాతీ సాహిత్యరంగంలో ఆయన్ను ప్రముఖ కవిగా నిలబెట్టాయి. కవిగా ప్రఖ్యాతుడు కావడానికి ముందు జోషీ, స్వరాజ్య ఉద్యమ కార్యకర్తగా, సత్యాగ్రహిగా పోలీసుల దృష్టిలో గుర్తింపు సంపాదించుకున్నారు. 

పర్యవసానంగా, ఆయన దాదాపు రెండేళ్ళ కాలం కారగారవాసం అనుభవించవలసివచ్చింది. 1930వ సంవత్సరం నవంబర్‌లో బ్రిటిష్‌ ప్రభుత్వం జోషీని మొట్టమొదటిసారి నిర్బంధంలోకి తీసుకుంది. 14 వారాల పాటు సాగిన తొలిదశ నిర్బంధం సాబర్మతిలో అమలయింది. ఆ కాలంలోనే, జోషీ ‘విశ్వశాంతి’ అనే ఖండకావ్యం రచించారు.

మహాత్మా గాంధీ జీవనం గురించీ, జీవిత సందేశం గురించీ చెప్పడమే దీని ఇతివృత్తం. 1932లో, ఈ సుదీర్ఘ ఖండకావ్యం అచ్చయింది! అయిదున్నర మాసాల తర్వాత– ఇదే నిర్బంధానికి కొనసాగింపుగా– సాబర్మతి, విసాపూర్‌ కారాగారాల్లో ఎనిమిది మాసాలపాటు జోషీని నిర్బంధించారు.

ఆ కాలంలో– 1932, ’33 సంవత్సరాల్లో– జోషీ రచించిన విభిన్న కవితల సంకలనం ‘గంగోత్రి’ పేరిట 1934లో అచ్చయింది. అదే సంవత్సరం జోషీ రాజకీయ కార్యాచరణ రంగం నుంచి విరమించి బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్‌ కాలేజిలో చేరే నాటికే ఆయన రచనలు పాఠ్య పుస్తకాల్లో చోటు సంపాదించుకున్నాయి!      

అనువాదంలోనూ అందెవేసిన చేయి
ఇక జోషీ కథానికలు పాత్రల మనస్తత్త్వ చిత్రణలో సరికొత్త ధోరణిని ఆవిష్కరించాయి. ముఖ్యంగా, ‘శ్రావణి మేలో’ (శ్రావణ మాసపు జాతర) కథానిక ఈ ధోరణికి శ్రీకారం చుట్టింది. ఈ కథానికలో ప్రధానపాత్రలు ఇద్దరు అమ్మాయిలు. అంబి తన మనసులో ఏముందో పైకి పొక్కనివ్వని దాపరికం మనిషి.

ఆమె సఖి సోనా. అంబి తన సఖియను వానాకాలపు జాతరకు లాక్కుపోతుంది. కానీ అక్కడ మందలో కలవలేక ఇబ్బంది పడుతుంది. సున్నితమైన ఈ ద్వైదీ భావాన్ని జోషీ గొప్పగా చిత్రించారు. ఆయన కథానికల్లో ‘ఆఖరి పిడక’ వాస్తవిక చిత్రణకు పెట్టింది పేరు! ఆయన కథానికల సంకలనం ‘విశామో’ (‘విశ్రాంతి నిలయం‘) సుప్రసిద్ధం.

ఉమాశంకర్‌ జోషీ గొప్ప అనువాదకుడిగా కూడా ప్రముఖులు. ప్రపంచ ప్రసిద్ధ సంస్కృత రచనలు కొన్నింటిని జోషీ గుజరాతీలోకి అనువదించారు. వాటిలో ‘శాకుంతల’ (కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకానువాదం), ‘ఉత్తర రామచరిత’ (భవభూతి ‘ఉత్తర రామచరితం’ నాటకానువాదం), ‘ఈశావాస్య ఉపనిషత్‌’ (‘ఈశావాస్యోపనిషత్తు’కు అనువాదం) సుప్రసిద్ధాలు. 1967 లో కన్నడ మహాకవి ‘కువెంపు’తో కలిసి, గుజరాతీ మహాకవి ఉమాశంకర్‌ జోషీ జ్ఞానపీఠ పురస్కారం పంచుకుని చరిత్రకెక్కారు!

- మందలపర్తి కిషోర్‌

ఇదీ చదవండి: అపరిచితుడిని చంపితే దొరకరా? ఇదో వింత పరిశోధన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement