అపరిచితుడిని చంపితే దొరకరా? ఇదో వింత పరిశోధన! | Karma Never Forgets Mystery Story | Sakshi
Sakshi News home page

అపరిచితుడిని చంపితే దొరకరా? ఇదో వింత పరిశోధన!

Nov 8 2026 12:58 PM | Updated on Nov 8 2026 12:58 PM

Karma Never Forgets Mystery Story

ఫండే

కథాకళి

ఓ ఇరానీ రెస్టారెంట్లో చాయ్‌ తాగుతూ ఇరవై ఏళ్ళ మహాన్ష్‌ ‘డెక్కన్‌ క్రానికల్‌’ చదువుతున్నాడు. ఓ వార్త అతన్ని ఆకర్షించింది. వెంటనే తన మిత్రుడితో చెప్పాడు.

‘‘ఇది విన్నావా బ్రో? ఓ భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు. భర్త ఇంకో పెళ్ళి కూడా చేసుకున్నాడు. కాని తన మాజీ భార్య విడాకులకి దుఃఖపడకుండా, విచారపడకుండా ఆనందంగా ఉండటం చూసి కోపం పట్టలేక ఆమెని పొడిచి చంపేశాడట.’’
‘‘నీకు ఇలాంటి వార్తలే ఆసక్తిగా ఉంటాయి.’’ అతని మిత్రుడు నవ్వుతూ చెప్పాడు.

‘‘కదా! మటన్‌ సూప్, బ్లూ డ్రమ్, రెఫ్రిజిరేటర్, నిద్ర మాత్రలు, చున్నీతో... భర్తని వదిలించుకోడానికి తన ప్రేమికుడితో జతకట్టడం అనేది సాధారణమైపోయింది. మనం సిగ్గుపడాల్సినవి సిగ్గుపడని కాలంలో జీవిస్తున్నాం. ఇవన్నీ చదివితే పెళ్ళి చేసుకోవాలంటేనే అదురుగా ఉంది బ్రో.’’ మహాన్ష్‌ చెప్పాడు.

‘‘మన పోలీసులు అసాధ్యులు. వాళ్ళంతా దొరికిపోతున్నారు కదా?’’
‘‘పోలీసులు ప్రతీసారి హంతకులని ఎందుకు పట్టుకోగలుగుతున్నారో తెలుసా? వాళ్ళకి సంబంధించిన వాళ్ళే హత్య చేస్తారు... అసలు మనకి ఎలాంటి సంబంధం లేని వారిని చంపితే పోలీసులు పట్టుకోగలరా?’’
‘‘ఆధారాలు ఉంటే ఇట్టే పట్టుకుంటారు.’’ మిత్రుడు వెంటనే చెప్పాడు.

‘‘ఆధారాలు లేవు అనుకో. ఉదాహరణకి నేనొకరిని చంపాను. వాళ్ళకి, నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు జీవితంలో నేను వాళ్ళని చూడటం కూడా అప్పుడే మొదటిసారి. ఆ వ్యక్తిని నేను చంపితే పోలీసులు నన్ను పట్టుకోలేరు. అవునా?’’
‘‘అవును. వాళ్ళకి అసలు నువ్వంటూ ఓ మనిషి ఉన్నావనే తెలీదు.’’
‘‘నేనా ఎక్స్‌పరిమెంట్‌ చేసి చూడనా?’’

‘‘మహాన్ష్‌. నీకు పిచ్చెక్కిందా?’’ అతని మిత్రుడు కోప్పడ్డాడు.
‘‘నేను పట్టుబడను. ఒకవేళ పట్టుబడితే నన్ను పిచ్చివాడిని అనొచ్చు. ఎలాంటి లాభం లేని హత్య చేయడం పిచ్చివాడి పని. కాబట్టి నాకు ఉరిశిక్ష పడదు.’’
‘‘కాని కోర్ట్‌ నీకు శిక్ష వేయకపోయినా మనల్ని సదా చూసే కన్ను ఒకటి ఉంది. అది శిక్షిస్తుంది.’’ మిత్రుడు హెచ్చరించాడు.
‘‘నువ్వు చెప్పేది కర్మఫలం గురించా?’’

‘‘అవును.’’
‘‘చూసే కన్ను చాలామందిని ఏం చేయలేదు.’’
‘‘పోనీ గాలి అంతా చూస్తుంది. గాలి మర్చిపోదు. నీకు గాలి తన అవసరం లేకుండా చేస్తుంది.’’ మిత్రుడు హెచ్చరించాడు.
‘‘ఏదేమైనా నాకు ఈ పరిశోధన చేయాలని ఉంది. బహుశా ఇలాంటి వార్తలే నాకు ప్రేరణని ఇచ్చాయి అనుకుంటా.’’
‘‘డోంట్‌ టేక్‌ రిస్క్‌ మిత్రమా.’’ అతను హెచ్చరించాడు.
‘‘నువ్వు చెప్పిన గాలి మర్చిపోతుందా, లేదా అనేది కూడా ఈ పరిశోధనలో భాగమే. బన్‌ మస్కా బావుంది. ఇంకోటి చెప్తున్నాను.’’
∙∙ 
మహాన్ష్‌ వారం తర్వాత పొరుగూరిలోని ఓ సంతలో సైకిల్‌ యంత్రంతో సానబెట్టేవాడి నించి పదునైన కత్తిని నగదు ఇచ్చి కొన్నాడు. అది కొనడానికే ఆ ఊరు వెళ్ళాడు. తను దాన్ని కొన్నట్లుగా ఋజువు లేదు. ఎవరిని చంపాలి?
ఓ మనిషిని తప్ప ఫలానా వాళ్ళని అని ఆలోచించడం వృథా అనుకున్నాడు.

సరైన అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. వర్షం పడితే తను ఓ చెట్టు కిందకి వెళ్ళినప్పుడు తనలా వచ్చిన మరో మనిషిని చంపొచ్చు. అర్ధరాత్రి నడిచి వెళ్ళే అపరిచిత వ్యక్తిని చంపచ్చు. రైలు పెట్టెలోని బాత్‌రూంలో దాక్కుని లోపలకి వచ్చిన ప్రయాణికుడిని చంపొచ్చు. అలాంటి ఆలోచనలు అతనిలో చాలా కలిగాయి.
∙∙ 
వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. మహాన్ష్‌ ఆ గుంపులోని ఒకరి ఎడమ భుజం వెనక నించి బలంగా కత్తిని పొడిచాడు.
‘‘నేను నిలబడలేక పోతున్నాను.’’ అతను అరిచాడు.
పిడికి చుట్టిన బట్టని తీసి మహాన్ష్‌ జేబులో ఉంచుకున్నాడు. అక్కడ ‘రక్తం... కత్తి... పోలీసులు...’ అనే మాటలు వినిపిస్తూండగా అతను వేగంగా జనం మధ్య నించి వెళ్ళిపోయాడు.

మర్నాడు దినపత్రికల్ని ఆసక్తిగా చదివాడు. ‘గుర్తు తెలీని వ్యక్తి ఏభై ఏళ్ళ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ని వెన్నులో పొడిస్తే మరణించాడని, పోలీసులు ఆధారాల కోసం వెతుకుతున్నారని చదివాడు. మహాన్ష్‌ క్షణకాలం కూడా భయపడలేదు. తను చేసిన పరిశోధన గురించి అతను తన మిత్రుడికి అప్పుడే చెప్పదలచుకోలేదు.
∙∙ 
రెండు నెలలైనా టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ హత్య ఇంకా అపరిష్కృతంగానే ఉండిపోయింది. మహాన్ష్‌ తన మిత్రుడి గదిలో పేకాట ఆడి తిరిగి తన ఇంటికి వెళ్తున్నాడు. దారిలో చిన్న చినుకులు ఆరంభమై, పెద్దగా వర్షంగా మారడంతో మహాన్ష్‌ రోడ్‌ పక్కన చెట్టు కిందకి చేరాడు. కొద్ది నిమిషాల తర్వాత అక్కడికి వచ్చిన ఒకతను మహాన్ష్‌ని చూసి చటుక్కున బొడ్డులోంచి కత్తిని తీసి అతని గుండెల్లో పొడిచాడు.

‘‘ఎందుకు... ఎందుకు...?’’ బాధ అనుభవిస్తూ మహాన్ష్‌ ప్రశ్నించాడు.
‘‘సారీ. ఓ చిన్న పరిశోధన. అపరిచిత వ్యక్తిని చంపితే పోలీసులు పట్టుకోగలరా లేదా అనే పరిశోధన.’’ ఆ పద్ధెనిమిదేళ్ళ కుర్రాడు చెప్పాడు.
‘‘గాలి... మర్చిపోదు...’’ మహాన్ష్‌ చివరిసారి శ్వాస తీసుకుంటూ చెప్పాడు. 
‘‘చిన్న పరిశోధన. ఓ మనిషిని చంపితే ఎలా ఉంటుందో తెలుసుకుందామని.’’
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

ఇదీ చదవండి: ప్రత్యర్థిని బయటకు నెట్టడమే లక్ష్యం.. సుమో ఆట రూల్స్‌ ఇవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement