నివాళి
మంచి నటి... తొలి చిత్రం ‘షావుకారు’తోనే ఆ విషయాన్ని నిరూపించుకున్నారు జానకి. ఆ సినిమా పేరే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. మంచి వ్యక్తిత్వం... వ్యక్తిగా జానకి మీద చాలామందికి ఉన్న అభి్రపాయం ఇది. ఎలాంటి పరిస్థితుల్లోనూ తల వంచలేదు... తనని తాను తగ్గించుకోలేదు. వెండితెరపై నటిగా ఆమె షావుకారు... తెరవెనక నిజజీవితంలో తొలి దశలో పేదరికాన్ని అనుభవించినా నిఖార్సయిన వ్యక్తిగా ఉన్న జానకి వ్యక్తిత్వపరంగానూ షావుకారే! తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి, నటనకు నిలువెత్తు నిదర్శనంగా పేరు తెచ్చుకోవడంతో పాటు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ‘షావుకారు’ ఇక లేరు.
‘షావుకారు’ జానకి అసలు పేరు శంకరమంచి జానకి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో 1931 డిసెంబరు 11న శచీదేవి, టేకుమళ్ల వెంకోజీరావు దంపతులకు మూడో సంతానంగా జన్మించారు జానకి. ఆమెకు అన్నయ్య, అక్కయ్యతో పాటు చెల్లి కృష్ణకుమారి తోబుట్టువులు. జానకిది సంప్రదాయ కుటుంబం కావడంతో అమ్మ నుంచి ఆచారాలు, శుచీశుభ్రత అలవడ్డాయి. రాజమండ్రి ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏడో తరగతి వరకు చదువుకున్నారు జానకి. అయితే తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు మారుతూ ఉండటం వల్ల ఆమె చదువు సరిగ్గా సాగలేదు.
చెన్నై వెళ్లిన తర్వాత ఆంధ్ర మహిళా సభలో జానకిని మెట్రిక్‌లో చేర్పించారు. చిన్నతనంలోనే స్పష్టమైన ఉచ్చారణ, అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకాశవాణి నాటికల ద్వారా కళారంగంలో అడుగుపెట్టారామె. ఓ సారి చెన్నైలో ఆకాశవాణిలో ‘బాలానందం’ అనే ప్రోగ్రామ్‌లో జానకి గాత్రం ప్రముఖ దర్శక–నిర్మాత బి. నాగిరెడ్డికి నచ్చింది. దీంతో ‘నీ గాత్రం బాగుంది. పదాలను చక్కగా ఉచ్చరిస్తున్నావు. సినిమాలో చాన్స్ ఇస్తాను.. నటిస్తావా’ అన్నారట. అసలు నటనంటే ఏంటో తెలియకపోయినప్పటికీ ‘నటిస్తాను’ అని చెప్పేసి ఇంటికొచ్చిన జానకి.. జరిగిన విషయాన్నంతా తల్లిదండ్రులకు చెప్పారు. అయితే జానకిని మందలించి, శంకరమంచి శ్రీనివాసరావుతో వివాహం చేశారు తల్లిదండ్రులు.
ఓవర్ కోట్ కప్పుకుని పరీక్షకు వెళ్లి...
పెళ్లయినప్పుడు జానకి వయస్సు 15 ఏళ్లు. భర్తతో కలిసి విజయవాడలో కొత్త కాపురం ఆరంభించారామె. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అస్సాంలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు జానకి. అప్పట్లో జానకి చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. తనని చదివిస్తూ, తాను కూడా చదువుకుంటూ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పటికీ ఓవర్ కోట్ కప్పుకుని పరీక్ష రాశారు జానకి. పెళ్లి తర్వాత ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం సరి కాదని చెన్నైలోని మేనమామ ఇంటికెళ్లారు. అక్కడే యజ్ఞ ప్రభకి జన్మనిచ్చారు. ఆ సమయంలో బి. నాగిరెడ్డి గతంలో తనకు ఇస్తానన్న సినిమా చాన్స్ గురించి భర్తకు చెప్పి, నటించటానికి ఒప్పించారు.
చంకలో పాపాయితో ఆడిషన్స్‌కి...
అవకాశం కోసం చంకలో పాపాయి, భర్తతో కలిసి బి. నాగిరెడ్డిని కలిశారు జానకి. పలు ఆడిషన్స్ తర్వాత ‘షావుకారు’ సినిమాలో హీరోయిన్‌గా తొలి అవకాశం వచ్చింది. మూడు నెలలు ఉన్న యజ్ఞ ప్రభని ఇంట్లో వదిలి ‘షావుకారు’లో నటించారు. ఆ సమయంలో ఓ తల్లిగా ఎంతో మానసిక వేదన అనుభవించారట ఆమె. ఆ సినిమాలో ఎన్టీఆర్‌కి జోడీగా నటించారామె. ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో బి. నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించిన ‘షావుకారు’ సినిమా 1950 ఏప్రిల్ 7న విడుదలై మంచి విజయం అందుకుంది. తొలి చిత్రంతోనే అసాధారణమైన అభినయాన్ని కనబరిచి, ఆ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ‘షావుకారు జానకి’గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఐదువందల సినిమాల్లో...
‘షావుకారు’ మూవీ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 500 సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారామె. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోసిన జానకి దక్షిణాది సినిమా చరిత్రలో చెరగని అధ్యాయంగా మిగిలిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి అగ్ర కథానాయకుల సరసన సుమారు రెండు వందలకు పైగా సినిమాల్లో ఆమె కథానాయికగా నటించడం విశేషం. ‘రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, అక్కాచెల్లెలు, బడిపంతులు, సంసారం ఒక చదరంగం, మంచి మనసులు’ వంటి పలు సినిమాలు జానకి నటనా పటిమకు నిదర్శనాలు.
బుల్లితెర పైనా...
‘షావుకారు’ జానకి కేవలం వెండితెరపైనే కాదు... సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు. తెలుగులో ‘నీడ, వరూధిని పరిణయం’, తమిళంలో ‘ఊరరింద రహస్యం, పెన్, అక్షయ’ వంటి సీరియల్స్‌లో నటించారు జానకి. వయసు మీద పడుతున్నప్పటికీ నటనపై ఉన్న మక్కువతో విశ్రాంతి తీసుకోకుండా ‘బిస్కోత్’ (తమిళం), ‘అన్నీ మంచి శకునములే’ (తెలుగు) వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారామె. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం ‘అన్నీ మంచి శకునములే’(2023).
పద్మశ్రీ జానకి
షావుకారు జానకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2022లో భారత ప్రభుత్వం ఆమెకు దేశంలోని అత్యున్నత ΄ûర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని ప్రకటించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు నంది అవార్డులు అందుకున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు అవార్డులు అందుకున్నారు. పలు సంస్థలు ఆమెను జీవిత సాఫల్య పురస్కారాలతో గౌరవించాయి. అస్సాంలోని గౌహతి యూనివర్సిటీలో మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న జానకి కళారంగంతో పాటు సామాజిక సేవకు గాను యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనా నుంచి డాక్టరేట్ పొందారు. షావుకారు జానకి మృతితో భారతీయ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.
ఇంట్లోకి రానివ్వని బంధువులు
సినిమాల్లో వేషాలు వేయడానికి వెళ్లడం... హీరోయిన్‌గా హీరోలతో తాళి కట్టించుకునే సన్నివేశాలు, డ్యాన్స్ చేయడం.. వీటి వల్ల బంధువులు జానకిని ఇంట్లోకి రానిచ్చేవారు కాదట. ఒకసారి ఇల్లు వెతుక్కునే క్రమంలో చుట్టాల ఇంట్లో నిద్రపోదామని వెళ్తే.. ‘వద్దమ్మా! అంకుల్ ఏదైనా అంటారు. రావద్దు’ అని మొహం మీదే చెప్పారట. కుటుంబంలో ఎవ్వరూ ప్రోత్సహించనప్పటికీ వృత్తి పట్ల అంకితభావంతో పని చేశారు. మూడు ప్రసవాలు జరిగినా కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది రాకుండా సంవత్సరానికి 20 సినిమాలు చేయడం విశేషం. ‘నటిగా నువ్వు పనికి రావు’ అన్న కె. వి. రెడ్డితో ‘పనికి వస్తావు’ అనిపించుకునే స్థాయికి ఎదిగానని ఆమె ఓ సందర్భంలో చెప్పారు.
నలుగురు ముఖ్యమంత్రులతో...
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ నటికీ దక్కని అరుదైన గౌరవం ‘షావుకారు’ జానకికి దక్కింది. దక్షిణాది రాజకీయాల్లో, సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తులుగా వెలిగిన నలుగురు దిగ్గజ ముఖ్యమంత్రులతో ఆమె వెండితెరను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎం.జి. రామచంద్రన్, జయలలిత, ఎం. కరుణానిధి... ఇలా నలుగురు సీఎంలతో కలిసి నటించారామె.
వ్యక్తిత్వంలోనూ షావుకారే...
కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే అలవాటు ఉన్న జానకి దానివల్ల కొన్ని అవకాశాలు కోల్పోయారు. ఈ విషయం గురించి ఓ సందర్భంలో ఆమె చెప్పారు. ‘‘ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఎవరికీ నచ్చదు. కెరీర్ మొదట్లో నాకు నచ్చిన పాత్ర మాత్రమే ఎంచుకునేదాన్ని. పాత్రలో పూర్తిగా లీనమవ్వగలనన్న నమ్మకం ఉన్నప్పుడే అంగీకరించేదాన్ని. కొందరు నాకు పొగరు అన్నారు... కొందరు జానకితో సినిమా కష్టం అనేవారు... నేను మాత్రం అలా ఉండడమే నా వ్యక్తిత్వం అంటాను. అలా ఉండడం వల్ల చాలా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చింది. అయినా నేను మాత్రం నా వ్యక్తిత్వాన్ని వదులుకోలేదు.
కుటుంబం విషయంలోనూ ఇలానే ఉండేదాన్ని... మా అబ్బాయి 19 ఏళ్ల వయసులో చదువు కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే సెటిల్ అయిపోయాడు. తిరిగి రాలేదు. అది అతని వ్యక్తిత్వం... అతని నిర్ణయం. ఇక తల్లిదండ్రులు బతికుండగా పిల్లలకు ఆస్తులు పంచకూడదు. ఏ బంధం శాశ్వతం కాదు. ఓసారి ఆరోగ్యం బాలేనప్పుడు పుట్టింటికి వెళ్లా. అప్పుడు వాళ్లకి నేను భారమని నాకు అనిపించింది. పెళ్లయిన తర్వాత ఏ ఆడపిల్లా పుట్టింటికి వెళ్లకూడదనిపించింది. నా భర్తతో విడాకులు తీసుకున్నాక రెండో పెళ్లి చేసుకోవాలనిపించినా పిల్లల కోసం వద్దనుకున్నాను. గొప్పింట్లో పుట్టినా ఆస్తులన్నీ పోయాయి. పేదరికం వల్లే నేను, నా చెల్లి కృష్ణకుమారి సినిమాల్లోకి వచ్చాం. సంపాదించాం. కుటుంబాలను చూసుకున్నాం’’ అని పేర్కొన్నారామె.
ఒంటిపూట భోజనం
వెండితెరపై రాణించిన జానకి వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను కష్టపడి సంపాదిస్తే, తన భర్త విలాసాల కోసం ఖర్చు చేసేవారని, కొంత కాలానికి ఆస్తులన్నీ కరిగిపోయాయని ఆమె ఆ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నమ్మక ద్రోహానికి కూడా గురయ్యానని బాధపడ్డారామె. ఒక దశలో పిల్లల పెంపకం కూడా కష్టమౌతుందని భావించారామె. అందుకే రోజులో ఒక్క పూట మాత్రమే భోజనం చేశానని ఆమె పేర్కొన్నారు.
నో బీపీ... షుగర్
‘‘షూటింగ్స్ లేనప్పుడు ఇంటి పనులే నాకు పెద్ద వ్యాయామం’’ అని చెప్పేవారు జానకి. అలాగే తన ఆహారపు అలవాట్ల గురించి ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘నాకు వంట చేయడం బాగా అలవాటు. స్వీట్స్‌లో అరిసెలంటే ఇష్టం. అయితే అవి తిన్నప్పుడు మిగిలినవి కట్ చేస్తాను. వెన్న, నెయ్యి, పాలు వంటి వాటిని పరిమితంగా తీసుకుంటాను. ఆరోగ్యకరమైన భోజనం రోజుకి ఒక్కసారైనా చాలు. ఆకలి లేకపోతే పండు తిని మంచినీళ్లు తాగి పడుకుంటాను. ఈ అలవాట్ల వల్ల నాకు బీపీ, షుగర్‌లు లేవు. అయితే రెండు మోకాళ్ళకు ఆపరేషన్ చేయించుకున్నాను. గుండె ఆపరేషన్ అయినా పని చేస్తూనే ఉన్నాను. నాకు దేవుడిపై భక్తి ఉంది. కానీ మూఢనమ్మకాలు లేవు. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడని నమ్ముతాను’’ అని చెప్పుకొచ్చారు షావుకారు జానకి.


