‘‘ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర: పార్ట్ 1’ సినిమాలోని ‘చుట్టమల్లె...’ పాటను కృత్రిమ మేధతో(ఏఐ) మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేసిన ఘటనను కేవలం ఒక సంఘటనగా చూడకూడదు. అదుపులేని డిజిటల్ దుర్వినియోగం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలకు ఇది హెచ్చరికగా చూడాలి’’ అని ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) అధ్యక్షుడు, నటుడు విష్ణు మంచు అన్నారు.
కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన నకిలీ వీడియోల వ్యవహారంపై విష్ణు మంచు ఓ ప్రకటన ద్వారా స్పందించారు. ‘‘తాజా డీప్‌ఫేక్ వివాదం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు, ఆన్ లైన్ దుర్వినియోగంపై బాధ్యతను నిర్ధారించేందుకు పరిశ్రమవ్యాప్తంగా సమర్థవంతమైన వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రతి సినిమా వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, వందల కుటుంబాల జీవితం, భారీగా డబ్బు పెట్టుబడి పెట్టే నిర్మాతలు ఉంటారు. సినిమా నచ్చినా, నచ్చకపోయినా, విమర్శించినా ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. అయితే ప్రేక్షకులు సినిమా చూడకముందే వ్యతిరేకంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. పదేపదే దుష్ప్రచారాలకు పాల్పడుతున్న సామాజిక మాధ్యమ ఖాతాలు, వాటి వెనుక ఉన్న నెట్‌వర్క్‌లకు సంబంధించిన సమాచారాన్ని ‘మా’ సేకరిస్తోంది’’ అని విష్ణు మంచు పేర్కొన్నారు.


