‘‘భోగి’ ఫైనల్ కాపీ చూశాను. అద్భుతమైన సినిమా. మంచి భావోద్వేగాలు ఉన్న కథ’’ అని ప్రముఖ రచయిత చంద్రబోస్ తెలిపారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన చిత్రం ‘భోగి’. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రంలోని అన్ని పాటలూ రాసిన చంద్రబోస్ పంచుకున్న విశేషాలు...
⇒ ‘మల్లేశం’, ‘ఛాంపియన్’ సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాశాను. కాకపోతే ‘భోగి’ మూవీలో అత్యంత సహజమైన తెలంగాణ మాండలికంలో రాశాను. నేను చిన్నప్పుడు విన్నవి, మాట్లాడుకున్నవి, పరిశీలించిన మాటలను కూడా ఈ సినిమాలోని పాటల్లో రాసే అవకాశం వచ్చింది. ‘భోగి’ తెలంగాణ పల్లెటూరి బతుకు చిత్రం. ఆ జీవితాన్ని అత్యంత స్వచ్ఛమైన మాటల్లో, ఆ పరిభాష, యాసలో రాసే పనిలో సఫలమయ్యామని భావిస్తున్నాను.
⇒ ఓ సినిమా కవి ప్రతి మాండలికంలోనూ ఒదిగిపోవాలి. ‘రంగస్థలం’ సినిమాలో సుకుమార్‌గారితో కలిసి గోదావరి మాండలికంలో పాటలు రాశాను. అలాగే ‘పుష్ప’ చిత్రాల్లో చిత్తూరు యాస పరిశీలించి రాశాను. ఇక ‘భోగి’ విషయానికి వచ్చేసరికి నేను మా ఊరిలో నేర్చుకున్న భాష, ఆ పరిసరాలు, మాండలికం.జ. అవన్నీ ఇంకా నా లోపల ఉన్నాయి. వాటిని ‘భోగి’ కోసం రాశాను. మాతృ మాండలికంలో పాటలు రాసే అవకాశం రావడం సంతృప్తినిచ్చింది. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు పల్లెటూర్లలో ఆ దినచర్య ఎలా ఉంటుందో చెప్పేదే ‘ఏగిలి వారంగ...’ పాట. అది కళ్లకు కట్టినట్టుగా సాహిత్యంతో చె΄్పాను. అందుకే చాలామంది వ్యక్తిగతంగా ఈ పాటకు కనెక్ట్ అవుతున్నారు.
⇒ నా కెరీర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు..’ పాట రాయడానికి 19 నెలల సమయం పట్టింది. పాట త్వరగానే రాశాను. కానీ, ఆ పాటకు కంపోజ్ చేయడం, మార్పులు చేర్పులు.. మధ్యలో కోవిడ్.. ఇవన్నీ కలిసి 19 నెలలు పట్టింది. ఇది ప్రేమ గీతం కాదు, బంధాల మధ్య ఉండే గీతం కాదు, తాత్విక గీతం కాదు... ఆడి పాడే పాట.
ఆ సంవత్సరం ఈ పాటకు మించి ఉర్రూతలూగించిన పాట ఏదీ లేదు.. అందుకే ఆస్కార్ అవార్డు వచ్చిందనుకుంటున్నాను. 31 ఏళ్లుగా సాహితీ యజ్ఞం చేస్తున్నాను. భగవంతుడు ఈ రకంగా నన్ను కరుణించాడేమో అనిపించింది. పాటకు భావం ముఖ్యం. ఆ భావం ప్రజల భాషలో ఉండాలి. ప్రజల్లో చైతన్యం రగిలించాలంటే ప్రజల్లో ఒకరిగా ఉండాలి. వారి వాడుక భాషను మనం మాట్లాడాలి.


