ఏఐతో చీటింగ్‌.. వివరాలిస్తే రూ.6.5 కోట్ల నజరానా! | South Korea catches 111 students AI cheating | Sakshi
Sakshi News home page

ఏఐతో చీటింగ్‌.. వివరాలిస్తే రూ.6.5 కోట్ల నజరానా!

Nov 21 2026 12:50 PM | Updated on Nov 21 2026 12:50 PM

South Korea catches 111 students AI cheating

సియోల్: దక్షిణ కొరియాలో పరీక్షల్లో ఏఐ సాయంతో జరుగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నిర్వహించిన దేశవ్యాప్త యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష సునెంగ్‌లో నిషేధిత ఎలక్ట్రానిక్ పరికరాలతో వచ్చిన 111 మంది విద్యార్థులను అధికారులు గుర్తించారు. వీరిలో ఐదుగురు పరీక్ష సమయంలో వాటిని ఉపయోగిస్తూ పట్టుబడ్డారు. ఈ పరీక్షకు సుమారు 5.5 లక్షల మంది హాజరయ్యారు.

పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు అధికారులు వినూత్న చర్య చేపట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మూడు విడతల్లో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్లకు అత్యవసర అలర్ట్స్ పంపించారు. ఫోన్లు సైలెంట్‌లో ఉన్నప్పటికీ పెద్ద శబ్దంతో మోగేలా ఈ వ్యవస్థను రూపొందించారు. స్మార్ట్ గ్లాసెస్, సూక్ష్మ కెమెరాలు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ వంటి పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు.

ఇటీవల ట్యాక్స్ అకౌంటెంట్ సర్టిఫికేషన్ పరీక్షలో జరిగిన మోసం ఈ కఠిన చర్యలకు కారణమైంది. అత్యధిక మార్కులు సాధించిన హాన్ వోన్-సియోక్ అనే అభ్యర్థి రహస్య కెమెరాతో ప్రశ్నలను ఫొటోలు తీసి ఏఐకి పంపినట్లు అంగీకరించాడు. ఏఐ ఇచ్చిన సమాధానాలను స్మార్ట్‌ఫోన్‌లో పరిశీలించాడు. మొత్తం 160 ప్రశ్నల్లో ఒక్కదానికే తప్పు సమాధానం ఇచ్చినట్లు వెల్లడైంది.

ఈ ఘటనపై అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ తీవ్రంగా స్పందించారు. ఏఐతో చీటింగ్ చేయడం అనేది కష్టపడి చదివిన లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం చేయడమేనని పేర్కొన్నారు. పరీక్షల వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో ప్రశ్నలకు ఫొటోలు తీసి ఏఐ సంస్థలకు పంపిన వారి వివరాలను సేకరించే మార్గాలపైనా దృష్టి పెట్టారు. అంతేకాదు, పరీక్షల అక్రమాలపై సమాచారం అందించిన వారికి 10 కోట్ల కొరియన్ వోన్లు (రూ.6.5 కోట్లు) బహుమతిగా ప్రకటించారు. దక్షిణ కొరియాలో సునెంగ్ పరీక్షకు ఎంతటి ప్రాధాన్యముందంటే.. పరీక్ష సమయంలో ఇంగ్లిష్ లిజనింగ్ విభాగం కోసం 35 నిమిషాల పాటు విమానాల రాకపోకలను సైతం నిలిపివేస్తారు. 

ఇదీ చదవండి: పుతిన్‌పై జెలెన్‌స్కీ నిప్పులు.. హంతకుడంటూ ఫైర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement