విమానాలపై అల్‌ఖైదా గురి.. అమెరికాలో హైఅలర్ట్! | Security agencies warn US aviation industry | Sakshi
Sakshi News home page

విమానాలపై అల్‌ఖైదా గురి.. అమెరికాలో హైఅలర్ట్!

Nov 21 2026 12:36 PM | Updated on Nov 21 2026 12:36 PM

Security agencies warn US aviation industry

వాషింగ్టన్: అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థల నుంచి విమానయాన రంగానికి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో అమెరికా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. విమానాలు, విమానాశ్రయాలు, ఎయిర్ కార్గో కార్యకలాపాలపై దాడులు చేయాలంటూ ఉగ్రవాద అనుకూల వర్గాలు సందేశాలు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS), రవాణా భద్రతా సంస్థ (TSA) సంయుక్తంగా హెచ్చరిక జారీ చేశాయి.

సీఎన్‌ఎన్ కథనం ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన హైజాక్ యత్నాన్ని అల్‌ఖైదా అనుబంధ వర్గాలు ప్రశంసించాయి. ఇలాంటి దాడులను మళ్లీ నిర్వహించాలని తమ మద్దతుదారులను ప్రోత్సహిస్తున్నట్లు అమెరికా భద్రతా సంస్థలు గుర్తించాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు యూదుల ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవాలని సందేశాల్లో పేర్కొన్నట్లు వెల్లడించాయి.

సెప్టెంబర్‌లో దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో కోపైలట్‌ మరో పైలట్‌పై దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం అమెరికాలో ఏదైనా నిర్దిష్ట ఉగ్రదాడి జరగబోతోందనే విశ్వసనీయ సమాచారం లేదని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఉగ్రవాద సంస్థల ప్రచారంతో ప్రభావితమయ్యే వ్యక్తులు ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా అమెరికా వ్యతిరేక భావాలను పెంచి ఉగ్రవాద అనుకూల వ్యక్తులను హింసాత్మక చర్యలకు ప్రేరేపించే ప్రమాదం ఉందని హెచ్చరించాయి.

అనుమానాస్పద కదలికలపై నిఘా
విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు కొన్ని అనుమానాస్పద ప్రవర్తనలను గుర్తించాలని భద్రతా సంస్థలు సూచించాయి. భద్రతా తనిఖీలను తప్పించుకునేందుకు ప్రయత్నించడం, విమాన కార్యకలాపాలు, భద్రతా ఏర్పాట్ల గురించి అనవసరంగా సమాచారం సేకరించడం, విమానాశ్రయ సిబ్బంది అనుమతులు లేదా యూనిఫాంలు కనిపించకుండా పోవడం వంటి అంశాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపాయి. మరోవైపు.. అమెరికాలో థాంక్స్ గివింగ్ సెలవుల నేపథ్యంలో విమాన ప్రయాణాలు భారీగా పెరగనున్నాయి. నవంబర్ 24 నుంచి 30 వరకు సుమారు 60 లక్షల మంది దేశీయ విమానాల్లో ప్రయాణిస్తారని అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ (AAA) అంచనా వేసింది. ఈ రద్దీ సమయంలో విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రతా సంస్థలు సూచించాయి.

ఇదీ చదవండి: టెక్‌ కంపెనీలకు ట్రంప్‌ వార్నింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement