ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమవుతోంది  | Rahul Gandhi Takes Aim At Modi Government In Chicago | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమవుతోంది 

Nov 20 2026 4:58 AM | Updated on Nov 20 2026 4:58 AM

Rahul Gandhi Takes Aim At Modi Government In Chicago

ప్రజలు గుర్తించేదాకా పోటీ చేయడమే ప్రతిపక్షాల వ్యూహం

ఎన్నికల బహిష్కరణ ప్రజాస్వామ్య పవిత్రతకు భంగకరం 

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ స్పష్టీకరణ 

స్వల్ప తేడాతో ఓడిపోవడం వెనుక ఏదో మతలబు ఉందని వ్యాఖ్య

న్యూఢిల్లీ/షికాగో: భారత ప్రజాస్వామ్యం పవిత్రమైందని, ఎన్నికలను బహిష్కరించే ప్రశ్నే లేదని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. ఎన్నికలను బహిష్కరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కోల్పోతుందని చెప్పారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగోలో బుధవారం విద్యార్థులతో జరిగిన ఇష్టాగోష్ఠిలో రాహుల్‌ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమవుతున్న విషయం, దేశంలో వాస్తవంగా ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించే దాకా ఎన్నికల్లో పోటీ చేయడమే కాంగ్రెస్, ప్రతిపక్షాల వ్యూహమని ఆయన తెలిపారు. 

‘2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో విపక్షాలు ఓడిపోయాయి. ఇందులో ఏదో మతలబు ఉంది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. తగిన ఆధారాలు లేవు కాబట్టే, దీనిపై మేం ఏమీ మాట్లాడలేకపోతున్నాం. నాకు దొరికిన రుజువును మా పారీ్టలోని రాజకీయ నాయకులకు చూపగా, వారు.. దయచేసి ఈ విషయాన్ని చెప్పవద్దని కోరారు. భారత ప్రజాస్వామ్యం ఎంతో పవిత్రమైంది. భారత ప్రజాస్వామ్యంలో సమస్య ఉందని ఆధారాలు లేకుండా చెప్పడం కష్టం’అని ఆయన అన్నారు. ‘అదే సమయంలో, ప్రతిపక్షాలన్నీ ఎన్నికల్లో పోటీ చేయకుంటే, ఆ క్షణమే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్లే అవుతుంది.

 ప్రజలు కూడా ఈ చర్యను తప్పుపట్టే ప్రమాదముంది. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయాలని, ఎన్నికల వ్యవస్థను విచి్ఛన్నం చేయాలని ప్రతిపక్షం కోరుకోవడం లేదు’అని ఆయన చెప్పారు. గాజాలో మారణకాండపై రాహుల్‌ మాట్లాడుతూ..‘ఇజ్రాయెల్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి. 150 కోట్ల జనాభా కలిగిన మా విదేశాంగ విధానం మాకు ఏది మంచిది అనే ప్రాతిపదికనే ఉంటుందే తప్ప, ఇతరులకు ఉద్దేశాలకు అనుగుణంగా ఉండదు. గాజాలోని అమాయకులపై ఇజ్రాయెల్‌ దాడులను ఖండిస్తున్నా’అని తెలిపారు. 

భారత్‌ చురుగ్గా వ్యవహరించాలి 
భౌగోళిక రాజకీయాలపై పూర్తి అవగాహన కలిగిన భారతదేశం అంతర్జాతీయ రాజకీయాల్లోనూ చురుగ్గా వ్యవహరించాలని రాహుల్‌ సూచించారు. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం భారత్‌ అప్రాధాన్య, ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితం కావడం తనకు షాక్‌ కలిగిస్తోందన్నారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చల్లో పొరుగు దేశం పాకిస్తాన్‌ చురుగ్గా వ్యవహరిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. గతంలో అలీనోద్యమంలో భారత్‌ సారథిగా వ్యవహరించిందని, ప్రపంచ వేదికపై తిరిగి అటువంటి స్థాయిని భారత్‌ సంపాదించుకోవడాన్ని తాను ఇష్టపడతానని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తున్నారన్న అంశంపై రాహుల్‌..వ్యక్తిగత సంబంధాలు, ప్రభుత్వాల విధానాలు రెండూ వేర్వేరని, నేతల మధ్య స్నేహం ప్రాతిపదికగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవని చెప్పారు. రానున్న కాలంలో భారత్, రష్యా, అమెరికా, చైనా, పశ్చిమాసియాలే ప్రపంచ గతిని శాసిస్తాయంటూ రాహుల్‌ గాంధీ విశ్లేషించారు. 

రాహుల్‌ కంటే ఏఐ బెటర్‌: బీజేపీ 
రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలను విదేశీ గడ్డపై చులకన చేసి మాట్లాడుతున్నారని, భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నారంటూ రాహుల్‌పై మండిపడింది. పదేపదే అవే విషయాలను చెబుతున్న రాహుల్‌ కంటే కాంగ్రెస్‌ కృత్రిమ మేధతో రూపొందించిన ప్రసంగాలను విదేశాలకు పంపించే విషయం ఆలోచించాలంటూ వ్యాఖ్యానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement