మీరు చప్పట్లు కొట్టరని నాకు బాగా తెలుసు
ఉద్యోగుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలి
దేశ ప్రజలకు నాణ్యమైన వస్తువులు విక్రయించాలి
‘ఫిక్కి’సమావేశంలో తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: పరిశ్రమలకు ప్రభుత్వం పన్ను రాయితీలు ఇస్తున్నప్పటికీ.. వాటికి అనుగుణంగా ఉద్యోగాల కల్పన, జీతాల పెంపు లేకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ పారిశ్రామిక వర్గాలను ప్రశ్నించారు. ప్రజల్లో పెరిగిన కొనుగోలు శక్తిని నూతన ఉపాధి అవకాశాలుగా, ఆర్థిక కార్యకలాపాలుగా మార్చాలని సూచించారు. గురువారం ఢిల్లీలో ‘ఫిక్కి’వార్షిక సర్వసభ్య సమావేశంలో మోదీ మాట్లాడారు. దేశంలో వ్యాపార వాతావరణాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు.
ప్రాథమిక కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడం, పన్ను రిటర్నులు, రీఫండ్ ప్రక్రియలను సరళీకరించడం, పలు ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించడం గురించి ప్రస్తావించారు. ‘‘మీరు చప్పట్లు కొట్టరని నాకు బాగా తెలుసు. మీ ఆకలి ఎంత విపరీతమైనదంటే.. మీకు ఎంత ఇచ్చినా అది ఎప్పటికీ సరిపోదు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కలి్పంచాం.
కానీ, మీరు మీ ఉద్యోగుల వేతనాలను పెంచారా? ఉద్యోగుల సంఖ్యను పెంచారా? లేదు కదా! ఎప్పుడూ ఇదే ధోరణి’’అని పారిశ్రామిక వర్గాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఆదాయపు పన్ను మినహాయింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, తద్వారా వస్తువులకు డిమాండ్ పెరగడమే కాకుండా వ్యాపార విస్తరణకు కూడా దోహదపడుతోందని పేర్కొన్నారు. వృద్ధికి సంబంధించిన బాధ్యతను కేవలం ప్రభుత్వంపైనే వదిలేయకుండా, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగుల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని
తేల్చిచెప్పారు.
వారిని దూషిస్తే దేశం ముందుకు సాగదు
ఒక దేశం పురోగమించాలంటే రైతులను, చిన్న తరహా పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను, సంపద సృష్టికర్తలను, పన్ను చెల్లింపుదారులను తప్పనిసరిగా గౌరవించాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. వారిని గౌరవించనంత వరకు ఏ దేశం కూడా పురోగమించదని చెప్పారు. వారిని దూషిస్తే దేశం ముందుకు సాగలేదని అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులతో జరిగిన సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘అందరినీ దొంగలుగా చూడటం ఎప్పుడు ఆపేస్తారు? ఇదేం పద్ధతి? మీరు దేశం కోసమే కదా పనిచేస్తున్నారు. ప్రతి పౌరుడూ తన వంతు కృషి చేస్తున్నాడు.
ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులే’’అని తేల్చిచెప్పానని వెల్లడించారు. మన భారీ దేశీయ మార్కెట్‌ను కేవలం అమ్మకాలు సాగించే ఒక వనరుగా భావించవద్దని హెచ్చరించారు. కంపెనీలు తమ ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపర్చుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలని పేర్కొన్నారు. ప్రతి ఉత్పత్తికీ దేశీయ మార్కెట్‌లో కొనుగోలుదారులు దొరుకుతారన్న మనస్తత్వాన్ని వదులుకోవాలన్నారు. వారికి నాణ్యమైన వస్తువులు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. విదేశీ వినియోగదారులకు ఎలాంటి వస్తువులు విక్రయిస్తారో అలాంటివే మన వాళ్లకు కూడా లభించాలని చెప్పారు. ‘‘నా దేశ ప్రజలు నాణ్యతకు అర్హులు’’అని మోదీ ఉద్ఘాటించారు.
మీ అవసరాలు ఏమిటో చెప్పండి
మరిన్ని సంస్కరణలు తీసుకొచ్చే విషయంలో పరిశ్రమల నుంచి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి ప్రకటించారు. అలాగే తమ అవసరాల గురించి ఎటువంటి సంకోచం లేకుండా తెలియజేయాలని వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి చేశారు.
గ్రాండ్ థెఫ్ట్ ఆటో వీడియో గేమ్‌తో పోలిక
భారత్ సాధించిన ప్రగతిని గ్రాండ్ థెఫ్ట్ ఆటో(జీటీఏ) వీడియో గేమ్ సహాయంతో మోదీ వివరించారు. బలహీన ఆర్థిక వ్యవస్థ నుంచి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారడం, సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.82 గిగావాట్ల నుంచి 175 గిగావాట్లకు పెంచుకోవడం, రైల్వే విద్యుదీకరణను 20 శాతం నుంచి 99.6 శాతానికి చేర్చడం వంటి అంశాల ద్వారా గత 12 ఏళ్లలో దేశం సాధించిన అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు (2013–14 కాలంలో) విడుదలైన ‘జీటీఏ5 గేమ్‌ను ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో (గురువారం) విడుదలైన ‘జీటీఏ6 గేమ్‌తో పోలుస్తూ వివిధ అభివృద్ధి సూచీలలో వచ్చిన మార్పులను తెలియజేశారు.


