కేంద్ర రోడ్డు, రవాణా రహదారుల శాఖ వెల్లడి
కొత్త వాహనాలకు మూడేళ్ల వరకు పీయూసీ సర్టిఫికెట్
సాక్షి, న్యూఢిల్లీ: వాహనాల వయసు, ఉద్గార ప్రమాణాలను ఆధారంగా కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం (పీయూసీ) చెల్లుబాటు గడువును సవరించేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్టంలోని రూల్ 115 సబ్ రూల్ (7)కు సవరణలు తీసుకురానుంది.కొత్తగా కొనుగోలు చేసిన, తక్కువ కాలుష్య ఉద్గారాలు విడుదల చేసే వాహనాల యజమానులపై నిబంధనల భారం తగ్గించడంతో పాటు, పాత వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నిరంతరం పర్యవేక్షించడమే ఈ ప్రతిపాదన ప్రధాన ఉద్దేశమని గురువారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతిపాదిత సవరణల ప్రకారం బీఎస్–1, బీఎస్–2, బీఎస్–3 ప్రమాణాల వాహనాలకు పీయూసీ సర్టిఫికెట్ మూడు నెలల పాటే చెల్లుబాటవుతుంది. బీఎస్–4 వాహనాలకు ఆరు నెలల గడువు ప్రతిపాదించారు.
పాత సర్టిఫికెట్లకు ప్రత్యేక వెసులుబాటు
ఈ సవరణలు అమల్లోకి రాకముందు జారీ చేసిన పీయూసీ సర్టిఫికెట్లకు కూడా కొత్త గడువు విధానం వర్తింపజేసే విషయంలో ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. సవరణలు అమల్లోకి వచి్చన తర్వాత ఆయా వాహనాలు మొదటిసారి సర్టిఫికెట్ పునరుద్ధరించుకున్నప్పటి నుంచి మాత్రమే కొత్త చెల్లుబాటు గడువు వర్తించనుంది. అదేవిధంగా పీయూసీ సర్టిఫికెట్ గడువు ముగియడానికి ముందు పది రోజుల వ్యవధిలో పునరుద్ధరించుకుంటే, కొత్త సర్టిఫికెట్ పాత సర్టిఫికెట్ గడువు ముగిసిన తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. అయితే, ఇప్పటికే గడువు ముగిసిన తర్వాత పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకుంటే, కొత్త సర్టిఫికెట్ పునరుద్ధరించిన తేదీ నుంచే చెల్లుబాటవుతుంది. వాహనాల వయసు, ఉద్గార సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని కాలుష్య పరీక్షల వ్యవధిని నిర్ణయించడం ద్వారా వాహనదారులకు సౌలభ్యం కల్పించడంతో పాటు, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించవచ్చని రోడ్డు రవాణా, రహదారుల శాఖ పేర్కొంది.
బీఎస్–6 వాహనాలకు వయసును బట్టి గడువు
బీఎస్–6 ప్రమాణాలతో కూడిన రవాణేతర వాహనాలకు మొదటి రిజి్రస్టేషన్ తేదీ నుంచి ఆరేళ్ల వరకు మూడేళ్ల చెల్లుబాటు గడువు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఆరేళ్లకుపైబడి పదేళ్లలోపు వయసున్న వాహనాలకు ఏడాది, పదేళ్లకు పైబడిన వాహనాలకు ఆరు నెలల గడువు నిర్ణయించారు. అదేవిధంగా బీఎస్–6 రవాణా వాహనాలకు మొదటి రిజి్రస్టేషన్ నుంచి ఆరేళ్ల వరకు రెండేళ్లు, ఆరేళ్లకు మించి పదేళ్లలోపు వయసున్న వాహనాలకు ఏడాది, పదేళ్లకు పైబడిన వాహనాలకు ఆరు నెలల పాటు పీయూసీ సర్టిఫికెట్ చెల్లుబాటులో ఉండేలా ప్రతిపాదించారు.


