అక్వాన్‌ తుపాను ఎఫెక్ట్‌.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన! | Cyclone Akvan Andhra Pradesh Heavy Rain Alert | Sakshi
Sakshi News home page

అక్వాన్‌ తుపాను ఎఫెక్ట్‌.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన!

Nov 19 2026 11:54 PM | Updated on Nov 19 2026 11:55 PM

Cyclone Akvan Andhra Pradesh Heavy Rain Alert

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘అక్వాన్‌’ ఉత్తరాంధ్ర–ఒడిశా తీరానికి చేరువవుతోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రాత్రి విస్తృతంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం (ఆర్టీజీఎస్‌) తెలిపింది. రేపు (నవంబర్‌ 20) తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు నుంచి ఒడిశాలోని ఉదయగిరి మధ్య తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.

గురువారం రాత్రి 9 గంటల సమయానికి తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నానికి 320 కిలోమీటర్లు, నరసాపురానికి తూర్పు ఆగ్నేయంగా 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది.

గత ఆరు గంటల్లో గంటకు 11 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదిలింది. తీరం దాటే సమయానికి బలహీనపడి దీప్‌ డిప్రెషన్‌ లేదా తుపానుగా మారే అవకాశం ఉందని, గంటకు 60–75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అంచనా.

రేపు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, తుపాను తీరం దాటిన తర్వాత వర్షాల తీవ్రత త్వరగా తగ్గనుంది. ఈ వ్యవస్థ ప్రభావం ప్రధానంగా ఉత్తరాంధ్రపైనే ఉండనుండగా.. మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర ప్రాంతాల్లో గణనీయమైన ప్రభావం ఉండకపోవచ్చని అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గోదావరి జిల్లాల ప్రజలు ఈ రాత్రి, రేపు ఉదయం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని తెలిపారు.

అలాగే చెరువులు, రిజర్వాయర్లు, ప్రమాదకర ప్రాంతాలు, తీర ప్రాంతాల పరిస్థితిని జిల్లా యంత్రాంగాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. తుపాను కదలికలను 24 గంటలూ గమనిస్తూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించనున్నట్లు ఆర్టీజీఎస్‌ వెల్లడించింది.

ఇదీ చదవండి: శబరిమల బుకింగ్‌లు ఫుల్‌.. దర్శనానికి మాత్రం భక్తులు డుమ్మా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement