విజయవాడ: ఓటమి భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు దౌర్జన్యాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఎవరొచ్చినా నామినేషన్లు చింపేస్తామని టీడీపీ నేతలకు పోలీసులు హామీ ఇచ్చారని, అందులో భాగంగానే తమ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎస్‌ఈసీకి ప్రతీ రోజూ ఫిర్యాదు చేస్తున్నా చర్యలు మాత్రం కన్పించడం లేదన్నారు.
ఈరోజు(గురువారం, నవంబర్ 19వ తేదీ) ఎస్‌ఈసీని వైఎస్సార్‌సీపీ నేతలు కలిసి.. వేంపల్లిలో నామినేషన్ చింపి వేయడంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలు, పోలీసుల వైఖరి పై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు వైఎస్సార్‌సీపీ నేతలు.
అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ నామినేషన్లలో నారా వారి రక్త చరిత్ర మొదలైంది. ఓడిపోతామనే భయంతో పోలీసులను పెట్టుకొని ఎలక్షన్ చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరు వచ్చినా నామినేషన్ పత్రాలు చింపేస్తామని టీడీపీ నేతలకు పోలీసులు హామీ ఇచ్చారు.
నామినేషన్ వేయడానికి వస్తే వచ్చిన వాళ్ళు కొట్టండి కేసులు లేకుండా మేము చూసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఎస్‌ఈసీకి రోజూ వస్తున్నాం.. వినతి పత్రం ఇస్తున్నాం. మాపైనే దాడులు చేసి తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. నామినేషన్ కేంద్రంలో వందలమంది టీడీపీ నేతలు ఉంటారు.. మమ్మల్ని మాత్రం ఒకరి లేక ఇద్దరు నేతలు రావాలని అంటున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘ ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ని కోరాం, రోజుకి రెండుసార్లు ఎస్‌ఈసీ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాం. ఎన్నికల అధికారులు కలెక్టర్లకి చెబుతారు.. ఆ కలెక్టర్లేమో చాలా బాగుంది అని అంటారు. అంతా క్లియర్‌గా జరిగితే మరి ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి.
శాంతియుతంగా జరిగింది అని చెప్పడం దారుణం. ప్రజాస్వామ్యం లో నామినేషన్ వేసే హక్కు లేదా?, మా అభ్యర్థుల నామినేషన్లను చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేస్తున్నారు. ఓటమి భయంతో ఏదొక రీజన్ చెప్పి మా నామినేషన్లను పక్కన పెడుతున్నారు’ అని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: ‘ఇంతటి వరస్ట్ పోలీసింగ్ ఎప్పుడూ చూడలేదు’


