శ్రీకాకుళం: బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆక్వాన్ తుపాను తీవ్రరూపం దాల్చింది. ఒరిస్సాలోని గోపాల్‌పూర్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఉత్తరాంధ్రలోని తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి మరియు కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.
ఆక్వాన్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో పలు విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించారు. తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్న పలాస రెవెన్యూ డివిజన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 11 తీరప్రాంత మండలాల్లోని అన్ని రకాల విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. మందస, సంతబొమ్మాళి, రణస్థలం, పొలాకీ, కవిటి, శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, వజ్రపుకత్తూరు, ఇచ్ఛాపురం, సోంపేట మండల్లాలోని విద్యాసంస్థలకు హాలీడే డిక్లేర్ చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా సెలవు ప్రకటించారు.
అప్రమత్తంగా ఉండాలి
ఆక్వాన్ తుపాను గడిచిన 6 గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది నరసాపురానికి 390 కి.మీ., కళింగపట్నంకి 320 కి.మీ.,గోపాల్‌పూర్‌కి 410 కి.మీ., పూరీకు 470 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయినట్టు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: దిశ మార్చుకున్న ఆక్వాన్ తుపాను


