బామ్మకు దొరికిన రూ.24 లక్షల బంగారు శిలువ | Grandmother Finds usd27K Medieval Gold Cross | Sakshi
Sakshi News home page

బామ్మకు దొరికిన రూ.24 లక్షల బంగారు శిలువ

Nov 19 2026 3:38 PM | Updated on Nov 19 2026 3:38 PM

Grandmother Finds usd27K Medieval Gold Cross

ఇంగ్లండ్‌లోని ఓ వ్యవసాయ పొలంలో లోహాల కోసం అన్వేషిస్తున్న 58 ఏళ్ల ఓ బామ్మకు అరుదైన మధ్యయుగ కాలం నాటి బంగారు శిలువ లభించింది. మొదట దాన్ని సాధారణ నగలాగా భావించిన ఆమె.. దాని అసలు విలువ తెలిసి ఆశ్చర్యపోయింది. ఈ అరుదైన వస్తువు విలువ సుమారు 20,000 పౌండ్లు (రూ.24 లక్షలు) ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

కెంట్‌లోని ఐల్ ఆఫ్ షెప్పీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదుగురు మనవళ్లకు బామ్మ అయిన షెల్లీ కౌజిన్స్ (58) గత ఆగస్టులో ఈ అరుదైన వస్తువును గుర్తించారు. గత నాలుగేళ్లుగా ఆమె లోహాలను గుర్తించే పరికరంతో అన్వేషణ చేస్తున్నారు. ఈ క్రమంలో మెడ్‌వే హిస్టరీ ఫైండర్స్ బృందంలోని ఇతర సభ్యులతో కలిసి తాజాగా దున్నిన ఓ రైతు పొలానికి వెళ్లారు.

ఆ రోజు ఉదయం నుంచి దాదాపు ఐదు గంటల పాటు వెతికినా విలువైన వస్తువులేవీ దొరకలేదు. పనికిరాని లోహపు ముక్కలే ఎక్కువగా కనిపించాయి. మధ్యాహ్నం సమయంలో ఆమె చేతిలోని పరికరం భూమిలో ఏదో లోహం ఉన్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో సుమారు 12 అంగుళాల లోతు వరకు తవ్వగా చిన్నపాటి శిలువ బయటపడింది.

మొదట దాన్ని సాధారణ అలంకరణ వస్తువుగా భావించారు. అయితే బృందంలోని ఇతర సభ్యులకు చూపించగా అది స్వచ్ఛమైన బంగారంతో తయారైందని గుర్తించారు. అనంతరం అది మధ్యయుగ కాలానికి చెందిన బంగారు శిలువ ఆకారంలోని పవిత్ర అవశేషాల భాండాగారమని (రెలిక్వరీ) నిర్ధారించారు.

ఈ వస్తువు బరువు సుమారు 10.6 గ్రాములు. దీనిపై రెండు మతపరమైన చిత్రాలు ఉన్నాయి. ఒకవైపు ఏసుక్రీస్తు శిలువ వేసిన దృశ్యం ఉండగా.. మరోవైపు బాల ఏసును చేతుల్లో పట్టుకున్న మేరీ మాత చిత్రం ఉంది. వ్యవసాయ దున్నే యంత్రం మరోసారి దానిపై నుంచి వెళ్లి ఉంటే ఈ వస్తువు దెబ్బతిని విరిగిపోయే ప్రమాదం ఉండేదని షెల్లీ తెలిపారు. అది చెక్కుచెదరకుండా లభించడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. అక్రమంగా పురాతన వస్తువుల కోసం అన్వేషించే వ్యక్తులు అక్కడికి చేరుకునే ప్రమాదం ఉండటంతో ఈ వస్తువు దొరికిన కచ్చితమైన ప్రదేశాన్ని బృందం రహస్యంగా ఉంచింది.

బ్రిటిష్ మ్యూజియం పరిశీలనలో బంగారు శిలువ
బ్రిటన్‌లోని పురాతన వస్తువుల చట్టాల ప్రకారం, నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పురావస్తు సంపద లభిస్తే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. అందులో భాగంగా ఈ శిలువను గుర్తించి ప్రాథమికంగా పరిశీలించిన అనంతరం సంబంధిత అధికారికి అప్పగించారు. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియం దీన్ని పరిశీలిస్తోంది. తమ సేకరణలో చేర్చుకోవాలా వద్దా అనే విషయంపై ఆ మ్యూజియం నిర్ణయం తీసుకోనుంది.

న్యూస్‌బ్రేక్ కథనం ప్రకారం.. ఈ శిలువ విలువ సుమారు 20,000 పౌండ్లు (27,000 డాలర్లు) ఉండవచ్చని అంచనా. అయితే ఇది అధికారిక విలువ నిర్ధారణ కాదు. బ్రిటిష్ మ్యూజియం దీన్ని సేకరణలో చేర్చుకోవాలని నిర్ణయిస్తే అధికారికంగా విలువను నిర్ణయిస్తారు. అనంతరం ఆ మొత్తాన్ని షెల్లీ కౌజిన్స్, పొలం యజమాని మధ్య పంచుతారు. మ్యూజియం తుది నిర్ణయం, అధికారిక విలువ నిర్ధారణపైనే ఈ అరుదైన శిలువ ద్వారా ఆమెకు లభించే ఆర్థిక ప్రయోజనం ఆధారపడి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement