బ్రిటన్‌లో ఓ మహిళను వ్యక్తిగత వీడియోతో బెదిరించి పెళ్లి చేసుకుని, టార్చర్ పెట్టిన మహమ్మద్ అలక్కావీ (25)అనే వ్యక్తికి కోర్టు 26 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించింది. పెళ్లి తర్వాత మూడేళ్ల పాటు భార్యను శారీరకంగా, లైంగికంగా వేధించడంతో పాటు ఆమె జీవితంపై పూర్తి నియంత్రణ చెలాయించినట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలు మాయా అనే మారుపేరుతో తొలిసారిగా తన అనుభవాలను వెల్లడించారు. తనను వేధించిన వ్యక్తికి శిక్ష పడటం ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె తెలిపారు.
మాయా వయసు 2021 సెప్టెంబరులో 20 ఏళ్లు. ఆమె పాలస్తీనాలో కుటుంబంతో కలిసి నివసించేవారు. అలక్కావీ ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం పంపడంతో వారి పరిచయం మొదలైంది. ఇద్దరి మధ్య సంభాషణలు పెరిగాయి. రెండు వారాల్లోనే అతడు పెళ్లి ప్రతిపాదన చేశాడు. కుటుంబ సభ్యులకు ఈ సంబంధంపై సందేహాలున్నప్పటికీ, అదే ఏడాది డిసెంబరులో మాయా రెండు వారాల పర్యటన కోసం బ్రిటన్‌కు వెళ్లారు.
అక్కడ ఆమెకు తెలియకుండా చిత్రీకరించిన నగ్న వీడియోను చూపించి అలక్కావీ బెదిరింపులకు దిగాడు. ఆ వీడియోను తన ముస్లిం కుటుంబ సభ్యులకు, పాలస్తీనాలోని స్నేహితులకు, యజమానికి పంపిస్తానని హెచ్చరించాడు. దీంతో భయాందోళనలకు గురైన మాయా అతడి ఒత్తిడికి లొంగిపోయారు. మే నెల చివరి నాటికి లండన్‌కు రావాలని అతడు ఆదేశించగా, మరుసటి రోజే ఇద్దరికీ మతపరమైన వివాహం జరిగింది.
వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేయడానికి అలక్కావీ నిరాకరించడంతో తొలుత మాయాకు కారణం అర్థం కాలేదు. తర్వాత అతడికి అప్పటికే మరో భార్య ఉన్నట్లు, మరో మహిళతో కవల పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. వివాహమైన వెంటనే గర్భం దాల్చాలని ఒత్తిడి చేసిన అతడు, ప్రతిరోజూ రాత్రి గర్భ నిర్ధారణ పరీక్ష చేయించేవాడు. పెళ్లైన మొదటి వారంలోనే, నెలసరి సమయంలో తన ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని మాయా తెలిపారు. “ఆగమని వేడుకున్నా అతడు పట్టించుకోలేదు. నోటిపై చేతిని పెట్టి త్వరగా ముగిస్తాను అని పదేపదే చెప్పాడని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఐదు వారాల గర్భవతిగా ఉన్నప్పుడు అలక్కావీ తొలిసారి ఆమెపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. వండిన స్పఘెట్టి బొలోనీస్ వంటకంలో మాంసం, పాస్తాను కలపలేదనే కారణంతో ఆహారాన్ని ఆమెపై విసిరి, వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. తర్వాత ఆమెను సిగరెట్లతో కాల్చడం, తిట్టడం, అరవడం, లైంగిక దాడులకు పాల్పడటం కొనసాగించాడు.
ఆమె సంపాదనను కూడా తీసుకుంటూ..
ఆమె సంపాదనపై కూడా అతడు అధికారం చెలాయించాడు. యూనివర్సల్ క్రెడిట్ కోసం దరఖాస్తు చేయించి, ఖాతాలో డబ్బు పడగానే తీసుకునేవాడు. ఏ వస్తువు కొనాలన్నా అనుమతి తీసుకోవాలని, నిర్దిష్టమైన శుభ్రత నియమాలు పాటించాలని ఒత్తిడి చేసేవాడు. తనను, పిల్లలను చంపేస్తాడనే భయంతో అతడిని ఎదిరించలేకపోయానని మాయా చెప్పారు.
రెండో బిడ్డకు గర్భవతిగా ఉన్న సమయంలో అలక్కావీ తనను మెట్లపై నుంచి తోసేందుకు ప్రయత్నించడాన్ని చూసిన మాయా తల్లి.. తొలుత పోలీసులను ఆశ్రయించారు. అరెస్టయిన రోజున కూడా తన ఇష్టానికి వ్యతిరేకంగా సిజేరియన్ చేయించుకోవాలని అలక్కావీ ఒత్తిడి చేశాడని మాయా తెలిపారు. తర్వాత కుమారుడికి జన్మనిచ్చిన ఆమెను తిరిగి తన వద్దకు రప్పించేందుకు అతడు ఫోన్లు, సందేశాలతో వేధించాడు. ఆమె అంగీకరించకపోవడంతో మళ్లీ ఆ వీడియోతో బెదిరించాడు. చివరకు పిల్లల భద్రత కోసం పోలీసులకు వాంగ్మూలం ఇవ్వాలని మాయా నిర్ణయించుకున్నారు.
కింగ్‌స్టన్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణలో అలక్కావీ బలవంతపు వివాహం, రెండు అత్యాచారాల కేసుల్లో దోషిగా తేలాడు. శిశువుకు పాలిస్తున్న సమయంలో కూడా మాయాపై అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారణ అయింది. విచారణ మధ్యలో ఆమెను బెదిరించడం, ఉద్దేశపూర్వకంగా గొంతు నులిమి హింసించడం, సాక్షిని బెదిరించడం, వేధింపులకు పాల్పడటం వంటి నేరాలను అతడు అంగీకరించాడు.
న్యాయమూర్తి సైమన్ హెప్టన్‌స్టాల్.. మొత్తం మీద అలక్కావీ 26 ఏళ్ల ఆరు నెలల వరకు జైలు శిక్ష అనుభవించేలా తీర్పు ఇచ్చారు. ప్రస్తుతం మాయా కళాశాలలో కౌన్సెలింగ్, థెరపీకి సంబంధించిన విద్యను అభ్యసిస్తున్నారు. పిల్లల కోసం కథల పుస్తకాలు రాసి, బొమ్మలు వేయాలనేది ఆమె లక్ష్యం. “వేధింపుల తర్వాత కూడా జీవితం ఉంటుంది. జీవితాంతం భయంతో, హింసను భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు” అని ఆమె ఇతర మహిళలకు సందేశమిచ్చారు.
లండన్ మెట్రోపాలిటన్ పోలీసుల తరఫున దర్యాప్తు చేపట్టిన డిటెక్టివ్ సూపరింటెండెంట్ లూయిస్ కాలిన్స్ మాయా ధైర్యాన్ని ప్రశంసించారు. బాధితులు స్నేహితులు, కుటుంబ సభ్యులు, వైద్యులు, సహాయక సంస్థలు లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు.


