- సముద్ర తీరంలో అత్యంత విషపూరిత చేప
- సైనైడ్ కంటే 1,000 రెట్లు ప్రమాదకరం
బీచ్‌కు వెళ్లినప్పుడు సముద్ర తీరంలో ఏదైనా వింత చేప కనిపిస్తే దాన్ని ముట్టుకునే సాహసం చేయకండి. అది చనిపోయి ఉన్నా సరే.. దాని దగ్గరకు వెళ్లడం ప్రమాదకరమే. బ్రిటన్‌లోని ప్రముఖ సముద్ర తీరంలో ఇలాంటి చేప కనిపించడంతో స్థానికంగా అలర్ట్ ప్రకటించారు. ఇది సాధారణ చేప కాదు.. అత్యంత విషపూరితమైన పఫర్‌ఫిష్. ఈ చేప శరీరంలో ఉండే విషపదార్థం సైనైడ్ కంటే 1,000 రెట్లు ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ చేప చనిపోయిన తర్వాత కూడా దానిలోని విషం ప్రాణాంతకంగానే ఉంటుంది.
సముద్ర తీరంలో చనిపోయిన చేప
‘ది సన్’ కథనం ప్రకారం.. బ్రిటన్‌లోని డోర్సెట్ ప్రాంతం స్టడ్లాండ్‌లో ఉన్న నోల్ బీచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్ర తీరంలో నడుస్తున్న ఓవెన్ బూటీ అనే వ్యక్తికి సుమారు 17 అంగుళాల పొడవున్న వింత వస్తువు కనిపించింది. తొలుత అది సముద్రంలో గుర్తులు చూపించేందుకు ఉపయోగించే చిన్న బోయా (నీటిపై తేలే గుర్తింపు పరికరం) లేదా ప్లాస్టిక్ సంచిగా భావించారు.
అయితే, దగ్గరకు వెళ్లి చూడగా అది చనిపోయిన చేప అని గుర్తించారు. దాని శరీరం బెలూన్‌లా ఉబ్బిపోయి ఉంది. గతంలో విదేశాల్లో సముద్రంలో ఈత కొట్టే సమయంలో ఓవెన్ పఫర్‌ఫిష్‌లను చూశారు. దీంతో అది అలాంటి చేపే అయి ఉంటుందని భావించారు. అయితే, నిర్ధారించుకునేందుకు చేప ఫొటోలను డోర్సెట్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్‌తో పాటు సముద్ర జీవుల నిపుణుడికి పంపించారు. పరిశీలించిన తర్వాత అది పఫర్‌ఫిష్ అని నిర్ధారించారు.
సైనైడ్ కంటే 1,000 రెట్లు విషపూరితం ఎందుకు?
పఫర్‌ఫిష్‌లో ఉండే టెట్రోడోటాక్సిన్ అనే విషపదార్థమే అత్యంత ప్రమాదకరం. ఇది శక్తిమంతమైన నాడీ వ్యవస్థ విషం. శరీరంలోని నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల కండరాలు పనిచేయడం ఆగిపోవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి ప్రాణాలు కూడా పోవచ్చు.
ఈ చేప కాలేయం, అండాశయాలు, పేగులు, చర్మంలో విషం ఉండవచ్చు. అందుకే దీన్ని ముట్టుకోవడం, తినడం అత్యంత ప్రమాదకరం. చేపను సరిగ్గా శుభ్రం చేయకపోతే దానిలోని విషపూరిత అవయవాల నుంచి విషం తినదగిన మాంసంలోకి చేరవచ్చు. దీంతో తీవ్ర ఆహార విషబాధ కలుగుతుంది. పలు దేశాల్లో ఈ చేపను తినేందుకు అత్యంత కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ప్రత్యేక శిక్షణ పొందినవారికి మాత్రమే దీన్ని శుభ్రం చేసి వడ్డించేందుకు అనుమతి ఉంటుంది.
ముట్టుకున్నా ప్రమాదమే!
పఫర్‌ఫిష్‌ను ముట్టుకోవడం వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంది. దాని శరీరంపై చిన్నపాటి పదునైన ముళ్లు ఉంటాయి. అవి చర్మంలోకి గుచ్చుకుని విషం రక్తప్రవాహంలోకి చేరితే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అందువల్ల సముద్ర తీరంలో ఇలాంటి చేప కనిపిస్తే దానికి దూరంగా ఉండటమే అత్యంత సురక్షితమైన మార్గం. ముఖ్యంగా చేప చనిపోయిన తర్వాత కూడా దానిలోని విషం ఏమాత్రం తగ్గదు.
బ్రిటన్ తీరానికి ఎలా చేరుకుంది?
పఫర్‌ఫిష్‌లు సాధారణంగా వెచ్చని సముద్ర జలాల్లో కనిపిస్తాయి. ప్రధానంగా హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని వెచ్చని నీటి ప్రాంతాలు వీటి ఆవాసాలు. బ్రిటన్‌లోని చల్లటి సముద్ర తీరంలో ఇవి కనిపించడం చాలా అరుదు.
ఇటీవల వచ్చిన ఆస్టెన్, బోలో అనే తుపానుల కారణంగా ఈ చేప తన సాధారణ ఆవాసానికి వందల మైళ్ల దూరం కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, బ్రిటన్ తీరానికి చేరుకోవడానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. పఫర్‌ఫిష్ అనే పేరు రావడానికి దాని ప్రత్యేక రక్షణ పద్ధతే కారణం. వేటాడే జీవుల నుంచి ప్రమాదం ఎదురైనప్పుడు ఈ చేప తన శరీరంలోకి నీరు లేదా గాలిని నింపుకుని బెలూన్‌లా ఉబ్బిపోతుంది. దీంతో దాని పరిమాణం గణనీయంగా పెరుగుతుంది. పెద్ద చేపలు సైతం దీన్ని మింగలేకపోతాయి. ఇలా ఉబ్బినప్పుడు దాని శరీరం గుండ్రటి బంతిలా కనిపిస్తుంది.
చేపలకు దూరంగా ఉండాలని హెచ్చరిక
ఓవెన్ బూటీ మాట్లాడుతూ.. తాను డోర్సెట్ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువ సమయం గడుపుతానని, అక్కడి సముద్ర జీవుల గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. అయితే, స్థానిక సముద్ర తీరంలో పఫర్‌ఫిష్ కనిపిస్తుందని అస్సలు ఊహించలేదన్నారు.
డోర్సెట్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ప్రతినిధి కూడా బ్రిటన్ సముద్ర ప్రాంతాల్లో ఈ చేప కనిపించడం అరుదైన విషయమని తెలిపారు. సముద్ర తీరంలో ఎక్కడైనా పఫర్‌ఫిష్ కనిపిస్తే దాన్ని ముట్టుకోవద్దని, సంబంధిత సంస్థకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
ఇక స్టడ్లాండ్ బీచ్ యాజమాన్య హక్కులు ఉన్న నేషనల్ ట్రస్ట్ సంస్థ మాత్రం ఈ చేప కనిపించిన విషయంపై తమకు ఇప్పటివరకు అధికారిక సమాచారం అందలేదని తెలిపింది. మొత్తంగా సముద్ర తీరంలో కనిపించిన ఈ చేప చూడటానికి చిన్నగా, వింతగా ఉన్నప్పటికీ.. దాని శరీరంలో ఉండే విషం అత్యంత ప్రమాదకరం. అందుకే ఇలాంటి చేపలు కనిపిస్తే ఆసక్తితో దగ్గరకు వెళ్లడం, ముట్టుకోవడం ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టవచ్చు.


