కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని మాంటెరీ కౌంటీలో ఉన్న మాస్ ల్యాండింగ్ స్టేట్ బీచ్‌లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతులు, క్షతగాత్రుల సంఖ్యపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే మాంటెరీ కౌంటీ షెరీఫ్ కార్యాలయానికి చెందిన పోలీసులు, దర్యాప్తు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనలో పలువురు మరణించినట్లు, మరికొందరు గాయపడినట్లు షెరీఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది.
కాల్పుల నేపథ్యంలో కాలిఫోర్నియా స్టేట్ పార్క్స్ పోలీసులు జెట్టీ రోడ్‌తో పాటు మాస్ ల్యాండింగ్ స్టేట్ బీచ్‌ను మూసివేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేశారు. కాల్పుల ఘటన అనంతరం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎలాంటి తక్షణ ముప్పు లేదని మాంటెరీ కౌంటీ షెరీఫ్ కార్యాలయం స్పష్టం చేసింది. మాస్ ల్యాండింగ్ కమ్యూనిటీకి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ఇది ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని, ప్రస్తుతానికి మరిన్ని వివరాలు వెల్లడించలేమని పేర్కొంది.
బాధితులకు సెనేటర్ జాన్ లైర్డ్ సంతాపం
ఈ ఘటనపై మాంటెరీ కౌంటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాలిఫోర్నియా స్టేట్ సెనేటర్ జాన్ లైర్డ్ స్పందించారు. వారాంతంలో దేశవ్యాప్తంగా పలు కాల్పుల మరణాల ఘటనలు నమోదైనట్లు గుర్తుచేశారు. తాజాగా మాస్ ల్యాండింగ్‌లోనూ అర్ధరాత్రి దాటిన తర్వాత పలువురు మరణించినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితులు, వారి కుటుంబాలు పడుతున్న బాధను మాటల్లో చెప్పలేమని విచారం వ్యక్తం చేశారు. పరిస్థితులను సమర్థంగా నిర్వహిస్తున్న మాంటెరీ కౌంటీ షెరీఫ్, పోలీసు బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. బాధితులకు ఏదైనా సహాయం అవసరమైతే తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
పర్యాటక ప్రాంతంలో విషాదం
మాస్ ల్యాండింగ్ స్టేట్ బీచ్ మాంటెరీ బే నేషనల్ మెరైన్ శాంక్చురీ అందాలను వీక్షించేందుకు ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. పిక్నిక్‌ల కోసం కూడా ఈ బీచ్‌కు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. అలాంటి పర్యాటక ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: 20 వేల బ్యాలెట్లపై ట్రంప్‌కు సుప్రీంకోర్టులో షాక్!


