ఇల్లు చేరిన సుదీర్ఘ బాటసారి  | British man Karl Bushby returns home after 28 years | Sakshi
Sakshi News home page

ఇల్లు చేరిన సుదీర్ఘ బాటసారి 

Nov 3 2026 6:39 AM | Updated on Nov 3 2026 6:39 AM

British man Karl Bushby returns home after 28 years

50 వేల కిలోమీటర్ల నడక 

ద.అమెరికా నుంచి కాలినడకనే ఇంగ్లాండ్‌కు 

28 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం 

హల్‌ (యూకే): ఇరవై ఎనిమిదేళ్ల సుదీర్ఘ నడకకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. ఎప్పుడ 1998లో నడక మొదలు పెట్టిన కార్ల్‌ బుష్‌బై యాభై వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టేసి... ఆలసి, సొలసి ఉత్తర ఇంగ్లాండ్‌లోని తల్లి ఇంటికి చేరుకున్నాడు. చిన్నప్పుడు తండ్రి పంపిన ఒక బర్త్‌డే కార్డు కార్ల్‌ జీవిత గమ్యాన్ని మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. 1990ల మధ్యలో తండ్రి కీథ్‌ ఒక విషయం చెబుతూండే వాడట. 

లండన్‌ నుంచి బేరింగ్‌ లాండ్‌ బ్రిడ్జ్‌ మీదుగా అమెరికాలోని న్యూయార్క్‌కు కాలి నడకన వెళ్లడం సాధ్యమేనా? అని తాను పనిచేస్తున్న మిలటరీ విభాగంలో చర్చ జరుగుతోందని కార్ల్‌కు పంపిన ఒక బర్త్‌డే కార్డులో ప్రస్తావించాడు కీథ్‌. ఎన్నో యుగాల క్రితం ఆది మానవులు ఆసియా నుంచి ఈ మార్గం గుండానే అమెరికాకు చేరారని సైంటిస్టులు చెబుతారు. 

రెండు గమ్యాలకు మధ్య కాకులు దూరని కారడవులూ... చీమలు దూరని చిట్టడవులూ ఉన్నాయి. అంతేనా.. ఎడారులు, మంచుతో గడ్డకట్టుకుపోయిన ప్రాంతాలూ లెక్కకు మిక్కిలి. ఈ చర్చ కాస్తా కార్ల్‌లో ఆసక్తిని పెంచింది. సాహసం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర రవాణా మార్గాలేవీ వాడకుండానే 1998 నవంబరు ఒకటవ తేదీన దక్షిణ అమెరికా దేశం చిలీలో ప్రయాణం మొదలుపట్టి ముప్ఫై దేశాల గుండా దాదాపు 50 వేల కిలోమీటర్లు దాటాడు. ఎట్టకేలకు 2026 నవంబరు ఒకటవ తేదీన సొంతింటికి చేరుకున్నాడు. 

కొడుకు రాక కోసం కళ్లల్లో వొత్తులేసుకుని మరీ వేచి చూస్తున్న తల్లి ఆంజెలాను హత్తుకుని కార్ల్‌ కూడా ఉద్వేగభరితుడైపోయాడు. రికార్డు నడకను చిత్రీకరించిన డాక్యుమెంటరీ సిబ్బంది, జర్నలిస్టులు, జన సామన్యులు అనేకులు ఇంటిచుట్టూ గుమికూడి కార్ల్‌కు స్వాగతం పలికారు. ‘‘వెల్‌కమ్‌ హోం సన్‌’’అన్న బ్యానర్‌ అతడిని పలుకరించింది. బుష్‌బైకు 29 ఏళ్ల వయసుండగా పారాట్రూపర్‌గా రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ కేంద్రానికి వెళ్లాడు. దక్షిణ అమెరికా విమానమెక్కాడు. ఇప్పుడు 57 ఏళ్ల వయసులో పరిణితి చెందిన వ్యక్తిగా తిరిగివచ్చాడు.  

ఎన్నో ఇక్కట్లు... 
కార్ల్‌ ప్రయాణం ఏమంత సాఫీగా జరగలేదు. ఐదేళ్లలోనే ప్రయాణం పూర్తవుతుందని లెక్కకట్టుకుని బయలుదేరాడు కానీ.. రకరకాల ఇక్కట్లు. దుర్గమమైన అటవీ ప్రాంతాలు, ఎడారులు ఆయన ప్రయాణాన్ని నెమ్మదింపజేశాయి. కొన్నిచోట్ల అధికారుల పుణ్యమా అని దీర్ఘకాలం పాటు ఉండిపోవాల్సి వచ్చింది కూడా. డారియన్‌ గ్యాప్‌లో యుద్ధం వస్తే ఆ ప్రాంతాన్ని వదిలి చుట్టు తిరిగి రావాల్సి వచ్చింది. 2001లో రహదారుల్లేని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ఆసక్తికరంగా పనామా ప్రాంతంలో నిషిద్ధ సరిహద్దును దాటాడని కార్ల్‌ను 18 రోజులపాటు జైల్లో ఉంచారు. 

2006లో రష్యా వీసా నిరాకరించడంతో కొండలు గుట్టలు టెక్‌ చేసి మరీ ప్రయాణించాడు. మార్గమధ్యంలో పోలార్‌ ఎలుగుబంట్లను ఎదుర్కొన్నాడు. గడ్డకట్టిపోయే మంచులో ఈదుతూ, చావుకు దగ్గరైనా నడకను మాత్రం మానలేదు. ఇంతా చేస్తే రష్యాలోకి అక్రమంగా ప్రవేశించారని ప్రభుత్వం కార్ల్‌ను జైల్లో పెట్టింది. అక్కడి నుంచి బయట పడేందుకు వీసా సంపాదించుకుని నడకను పునః ప్రారంభించేందుకు, రష్యాను దాటి వచ్చేందుకు దాదాపు పదేళ్ల సమయం పట్టింది. అందుకేనేమో... ‘‘మహా అయితే పన్నెండేళ్లు + కొంత ఎక్కువ సమయం పడుతుందని అనుకున్నాం కానీ.. ఈ ఎక్కువ సమయం అన్నది చాలా... ఎక్కువై పోయింది’’అని కార్ల్‌ విలేకరులతో మాట్లాడుతూ చమత్కరించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement