అణు యుద్ధం మొదలైంది బాబోయ్‌ అంటూ గజగజా వణికిన జనాలు | Fake Nuclear Alerts After Ukraine Russia Air Alert Apps Hacked | Sakshi
Sakshi News home page

అణు యుద్ధం మొదలైంది బాబోయ్‌ అంటూ గజగజా వణికిన జనాలు

Nov 2 2026 6:58 PM | Updated on Nov 2 2026 7:08 PM

Fake Nuclear Alerts After Ukraine Russia Air Alert Apps Hacked

ఉక్రెయిన్‌, రష్యాలో ఆదివారం రాత్రి సైబర్‌ దాడులు కలకలం సృష్టించాయి. ఇరు దేశాల్లో ప్రజలకు అత్యవసర హెచ్చరికలు పంపే అధికారిక యాప్‌లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో అణు దాడులు, రేడియేషన్‌ ముప్పు, రసాయన దాడులు, వీధుల్లో కాల్పులు జరుగుతున్నాయంటూ తప్పుడు సందేశాలు వెలువడ్డాయి. అప్రమత్తమైన అధికారులు యాప్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సైబర్‌ దాడుల వెనుక ఎవరున్నారు? రెండు దేశాల్లో జరిగిన ఘటనలకు సంబంధం ఉందా? అనే విషయాలు ఇంకా తెలియరాలేదు.

ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణులు, డ్రోన్ల దాడుల హెచ్చరికలు దాదాపు ప్రతి రాత్రి వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం దేశవ్యాప్తంగా ఎయిర్‌ అలర్ట్‌ యాప్‌ ద్వారా రెడ్‌ అలర్ట్‌లు జారీ అయ్యాయి. కీవ్‌ సహా కొన్ని ప్రాంతాల్లో రేడియేషన్‌, రసాయన దాడులు, వీధి పోరాటాలు జరుగుతాయంటూ అదనపు సందేశాలు వచ్చాయి. అయితే ఈ సందేశాలు రష్యన్‌ భాషలో ఉండటంతో పలువురు అనుమానించారు.

ఈ ఘటనపై ఉక్రెయిన్‌ వైమానిక దళం టెలిగ్రామ్‌లో స్పందించింది. యాప్‌పై శత్రుపక్షం జోక్యం చేసుకుని ఉండొచ్చని, ఎలాంటి రేడియేషన్‌ ముప్పు లేదని స్పష్టం చేసింది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని సూచించింది. యాప్‌ భద్రత దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని చెబుతూ ప్రభుత్వం నిర్వహణ పనుల కోసం దాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.

అయ్యో దేవుడా.. 
కీవ్‌కు చెందిన ఒలెనా మాట్లాడుతూ.. ‘‘ఆ సందేశం చూసిన వెంటనే అయ్యో దేవుడా.. ఇలాంటి పరిస్థితికి నేను సిద్ధంగా లేనే అనిపించింది. విద్యుత్‌ కోతలు, నీటి సరఫరా నిలిచిపోవడం వంటివాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా.. అణు దాడిని ఎదుర్కోవడానికి కాదు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తకు కీవ్‌లో వీధి పోరాటాలు జరుగుతున్నాయంటూ మరో హెచ్చరిక రావడంతో యాప్‌ హ్యాక్‌ అయినట్లు అర్థమైందన్నారు.

రష్యాలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. తమ అధికారిక యాప్‌పై భారీ సైబర్‌ దాడి జరిగిందని, ప్రజలకు తప్పుడు సమాచారం చేరిందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. రష్యాలోని అన్ని ప్రాంతాలపై అణు వార్‌హెడ్లతో కూడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు దూసుకొస్తున్నాయంటూ నకిలీ హెచ్చరికలు జారీ అయ్యాయి. మూడు వారాలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకుని, సురక్షిత ప్రాంతాల్లో దాక్కోవాలని అందులో పేర్కొన్నారు. అసభ్య పదజాలంతో కూడిన ఈ సందేశాలను ఉక్రెయిన్‌ అనుకూల పక్షపాత సంస్థ అటేష్‌ టెలిగ్రామ్‌లో పంచుకుంది.

రష్యా అధ్యక్ష భవనం సహా ప్రభుత్వ ఇంటర్నెట్‌ వ్యవస్థలన్నీ నిరంతరం సైబర్‌ దాడులకు గురవుతున్నాయని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ పేర్కొన్నారు. కృత్రిమ మేధ సాంకేతికత విస్తరణ కూడా సైబర్‌ దాడులు పెరగడానికి కారణమవుతోందన్నారు. రష్యా రక్షణ శాఖ ప్రకారం.. యాప్‌ పూర్తి స్థాయిలో సోమవారం రాత్రికి అందుబాటులోకి రానుంది. అయితే విస్తృత హెచ్చరికల వ్యవస్థపై ఈ దాడి ప్రభావం చూపలేదని తెలిపింది.

స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన సైబర్‌ భద్రతా పరిశోధకుడు హెర్బర్ట్‌ లిన్‌ మాట్లాడుతూ.. అధికారిక ఉక్రెయిన్‌ సమాచార యాప్‌పై ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి కావచ్చని, అయితే భవిష్యత్తులోనూ ఇలాంటివి జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఉక్రెయిన్‌లో ఖెర్సన్‌ ప్రాంతంలో అమల్లో ఉన్న స్థానిక కాల్పుల విరమణ ముగియడానికి కొద్ది నిమిషాల ముందు ఈ నకిలీ హెచ్చరికలు వెలువడ్డాయి. ఆక్రమిత ఒలెష్కీ నగరం నుంచి పౌరులను తరలించేందుకు గత మంగళవారం ఈ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. 

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ కూడా దీనికి కొంతవరకు మధ్యవర్తిత్వం వహించారు. 2022 ఫిబ్రవరిలో రష్యా పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి కొనసాగుతున్న యుద్ధంలో సైబర్‌ దాడులు మరో కీలక ముప్పుగా మారుతున్నాయి. అత్యవసర సమాచార వ్యవస్థల విశ్వసనీయతను కాపాడుకోవడం ఇరు దేశాలకూ సవాలుగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement