అమెరికా తమ డిమాండ్లకు అంగీకరిస్తే రెండు రోజుల్లోనే హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు అమెరికాతో మధ్యవర్తుల ద్వారా చర్చలు కొనసాగుతున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ వెల్లడించారు. అయితే తదుపరి చర్చలన్నీ అమెరికా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని అన్ని రంగాల్లో ముగించాలని, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని, చమురు రంగంపై ఆంక్షలను ఎత్తివేయాలని, అమెరికా నావికాదళ దిగ్బంధనాన్ని తొలగించడం వంటి డిమాండ్లను ఇరాన్.. అమెరికా ముందుంచింది. అలాగే హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు ఇరాన్, ఒమన్ అంగీకరించిన కొత్త మార్గాన్ని అమెరికా గుర్తించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కోరారు.
ఇక మరోవైపు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడులకు ఒత్తిడి తెస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు హార్ముజ్ జలసంధి మీదుగానే జరుగుతుండటంతో ఈ పరిణామాలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇదీ చదవండి: దీపావళికి 'గ్రీన్ క్రాకర్స్'కు సుప్రీంకోర్టు అనుమతి


