క్యూబెక్: కెనడాలోని క్యూబెక్ ప్రావిన్స్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పాఠశాలల్లో మతపరమైన గుర్తులు, వస్త్రధారణపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సిక్కుల తలపాగాలు (టర్బన్లు), ముస్లింల నిఖాబ్‌లు ధరించడాన్ని నిషేధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రధానంగా సిక్కు, ముస్లిం, యూదు విద్యార్థులపై ప్రభావం చూపనుంది.
అక్టోబర్‌లో జరిగిన ప్రావిన్షియల్ ఎన్నికల్లో వేర్పాటువాద భావజాలం కలిగిన పార్టీక్యుబెకోయిస్ అధికారంలోకి వచ్చింది. పాఠశాలల్లో బహిరంగంగా మతపరమైన గుర్తులు ధరించకుండా నిషేధించడం ఆ పార్టీ ఎన్నికల హామీల్లో ఒకటి. ఈ హామీ మేరకే ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. క్యూబెక్‌లో మతపరమైన గుర్తులపై ఆంక్షలు విధించే ప్రక్రియ 2019లోనే ప్రారంభమైంది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన లౌకికవాద చట్టం ప్రకారం ఉపాధ్యాయులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు వంటి అధికార హోదాల్లో ఉన్నవారు మతపరమైన గుర్తులు ధరించడంపై నిషేధం విధించారు.
తాజా ప్రతిపాదనపై కెనడియన్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మత స్వేచ్ఛపై ప్రభుత్వం క్రమంగా ఆంక్షలు పెంచుతోందని సంస్థ ప్రతినిధి అనైస్ బుసియర్స్ మెక్‌నికోల్ విమర్శించారు. చిన్నారులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా వారిలో వివక్ష భావనను పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ‘ఎన్నికల్లో ఓడితే..’ షాకిస్తున్న ట్రంప్ వ్యాఖ్యలు!


