విద్యార్థి ఆందోళనలపై ఫ్రాన్స్‌ నిషేధం  | France bans student protests | Sakshi
Sakshi News home page

విద్యార్థి ఆందోళనలపై ఫ్రాన్స్‌ నిషేధం 

Oct 23 2026 4:38 AM | Updated on Oct 23 2026 4:38 AM

France bans student protests

ఆందోళనల ముసుగులో చోరీలు, లూటీలు 

హింస నివారణకే నిషేధం: పోలీసులు 

భధ్రత ఏర్పాట్లపై మాక్రాన్‌ సమీక్ష

ప్యారిస్‌: విద్యావ్యవస్థలో లోపాలను నిరసిస్తూ ఫ్రాన్స్‌లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నిరసన ప్రదర్శనలు కాస్తా హింసాత్మకంగా మారిన నేపథ్యంలో ప్యారిస్‌తోపాటు లియోన్, లీల్, గ్రెనోబుల్‌ నగరాల్లో గురువారం తలపెట్టిన ప్రదర్శనలపై అధికారులు నిషేధం విధించారు. 

రాజధాని ప్యారిస్‌సహా కొన్ని ఇతర నగరాల్లో ఇప్పటికే రాత్రిపూటకర్ఫ్యూ పెట్టిన ఫ్రాన్స్‌ గత శని, ఆదివారాల్లో చెలరేగిన హింస పునరావృతం కారాదనే ఆందోళనలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో నివసిస్తున్న భారతీయులు లేదా ఆ దేశానికి వెళుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. గురువారం నాటి ఆందోళనలపై నిషేధం విధించడంపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, విద్యార్థి సంఘాలు మాత్రం నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు గత శని, ఆదివారాల్లో ముసుగులు ధరించిన యువకుల కొందరు పోలీసులతో ఘర్షణలకు దిగారు. 

కొందరు దుకాణాలను దోచుకోవడంతోపాటు వాహనాలకు నిప్పుపెట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కారాదన్న కారణంతోనే గురువారం నాటి ఆందోళనలపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల ఉత్తర్వుల మేరకు పారిస్‌లో అధ్యక్ష భవనం ఎలిసీ ప్యాలెస్, పార్లమెంటు ఉభయ సభలు, ప్రధాన రైల్వే స్టేషన్ల పరిసరాల్లో రాత్రి ఎనిమిది గంటల వరకూ నిషేధం ఉంటుంది.  

శనివారం మహా ప్రదర్శన... 
ఫ్రాన్స్‌లో రానున్న శనివారం మరో భారీ నిరసన ప్రదర్శన జరగనుంది. 2018, 2019లలో ఇంధన ధరలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనల్లో కీలకపాత్ర పోషించిన ‘ఎల్లో వెస్ట్‌’కార్యకర్తలు కూడా ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధాని సెబాస్టియన్‌ లెకోర్నూ కారి్మక సంఘాల ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. శనివారం నాటి ఆందోళనల సందర్భంగా తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లను వెల్లడించారు. 

గత వారాంతంలో చిన్నచిన్న అల్లరిమూకలు సృష్టించిన హింస భద్రతా ఏర్పాట్లలోని లోపాలను బయటపెట్టిందని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ కూడా గురువారం ఉదయం నిఘా సంస్థల ప్రతినిధులు, ప్రధాని లెకోర్ను, మంత్రులతో సమావేశమై భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.

అప్రమత్తంగా ఉండండి: భారత్‌ 
ఫ్రాన్స్‌లో అశాంతి, హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. రద్దీ ప్రాంతాలతోపాటు ఆందోళనలు జరుగుతున్న చోట్లకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల ఆదేశాలను పాటించాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో పారిస్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని లేదా మార్సేలోని భారత కాన్సులేట్‌ జనరల్‌ను సంప్రదించవచ్చునని తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement