నిరసన గళం వినిపిస్తే చాలు.. ఉరికంబం ఎక్కాల్సిందేనా? ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న మహిళలకు మరణశిక్షలు విధిస్తుండటం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. జైళ్లలో చిత్రహింసలు, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు తమను కాపాడాలంటూ కన్నీటితో వేడుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన నిరసనలకు సంబంధించి ఆరుగురు మహిళలకు మరణశిక్షలు విధించినట్లు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ప్రతినిధి మై సాటో పేర్కొన్నారు.
అయితే, వారిలో 21 ఏళ్ల తరానె రహీమి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కవల సోదరి రొమినాతో కలిసి నిరసనల్లో పాల్గొన్న ఆమెను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి.
విచారణ పేరుతో ఆమె కాళ్లపై తీవ్రంగా కొట్టడంతో నడవలేని పరిస్థితి ఏర్పడిందని, తలకు తగిలిన గాయం కారణంగా చెవికి ఇన్ఫెక్షన్ వచ్చిందని బంధువు మసూద్ నూర్‌మహమ్మది తెలిపారు. సోదరిని కళ్ల ముందే అత్యాచారం చేస్తామని బెదిరించడంతో బలవంతంగా నేరాన్ని అంగీకరించిందని ఆరోపించారు. ఈ కేసులో తరానెకు ఉరిశిక్ష, సోదరి రొమినాకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
మరోవైపు మహబూబె షబానీ (33), నజ్మె అమీని (23), మొజ్దె హషేమి బజర్గానీ (27) వంటి మహిళలు కూడా మరణశిక్షలను ఎదుర్కొంటున్నారు. గాయపడిన నిరసనకారులకు సాయం చేశారని, సామాజిక మాధ్యమాల్లో మతదూషణకు పాల్పడ్డారని, గూఢచర్యం చేశారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి. అలాగే జైళ్ల నుంచి పంపిన ఆడియో సందేశాల్లో తమపై చిత్రహింసలకు పాల్పడుతున్నారని, బలవంతంగా నేరాలను అంగీకరించేలా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత డిసెంబర్‌లో ఆర్థిక సమస్యలపై ప్రారంభమైన నిరసనలు క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి. వీటిని అణచివేసేందుకు భద్రతా బలగాలు చేపట్టిన చర్యల్లో 7 వేల మందికి పైగా మరణించినట్లు అమెరికాకు చెందిన హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ సంస్థ అంచనా వేసింది. అయితే ఇరాన్ ప్రభుత్వం మాత్రం ఈ ఘటనల్లో 3,117 మంది మరణించినట్లు ప్రకటించింది. నిరసనలకు సంబంధించి ఇప్పటికే కనీసం 39 మందిని ఉరితీసినట్లు మై సాటో తెలిపారు.
అలాగే ఇరాన్‌లో మహిళలపై అణచివేత 2022లో మహ్సా అమిని మరణం తర్వాత మరింత చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి మహిళలు ప్రభుత్వ విధానాలను బహిరంగంగా ప్రశ్నిస్తూ నిరసనల్లో ముందుంటున్నారని, దాంతో వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని మై సాటో అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నిరసనలతో సంబంధం ఉన్న ఆరుగురితోపాటు మరో ముగ్గురు మహిళలకు ఇతర ఆరోపణలపై మరణశిక్షలు విధించినట్లు తెలిపారు.
అయితే చిత్రహింసలు, బలవంతపు వాంగ్మూలాల ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది. శాంతియుత నిరసనల్లో పాల్గొన్నందుకు మాత్రమే ఎవరికీ మరణశిక్ష విధించలేదని, హత్య, ఉగ్రవాదం, గూఢచర్యం వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి శిక్షలు విధించినట్లు స్పష్టం చేసింది.
ఐక్యరాజ్యసమితి నిపుణుల ప్రకారం జనాభా నిష్పత్తితో పోలిస్తే ప్రపంచంలో అత్యధికంగా ఉరిశిక్షలు అమలు చేస్తున్న దేశం ఇరాన్. 2026 అక్టోబర్ వరకు ఏడాది కాలంలో 2,003 మందిని ఉరితీసినట్లు హెచ్‌ఆర్‌ఏఎన్‌ఏ నమోదు చేసింది. ఈ క్రమంలో తమవారు క్షేమంగా తిరిగి రావాలని ఆశగా ఎదురుచూస్తున్నట్లుగా.. ఉరికంబం నీడలో ఉన్న మహిళల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: 2028 వరకు ఆగని యుద్ధం.. జ్యోతిష్యుల హెచ్చరిక!


