సక్సెస్‌కి షార్ట్‌కట్స్‌ లేవు.. | sakshi interview with Durga Jasraj daughter of Pandit Jasraj | Sakshi
Sakshi News home page

సక్సెస్‌కి షార్ట్‌కట్స్‌ లేవు..

Nov 24 2026 4:30 AM | Updated on Nov 24 2026 4:30 AM

sakshi interview with Durga Jasraj daughter of Pandit Jasraj

 సంగీత సమారోహం

‘మనల్ని నిలబెట్టేది... చివరదాకా మనల్ని నడిపించేది మన హార్డ్‌ వర్క్‌ మాత్రమే’ అంటారు దుర్గా జస్‌రాజ్‌. సంగీత కళాకారిణిగా, టెలివిజన్‌ ప్రజెంటర్‌గా, నటిగా సంగీత కార్యక్రమాల రూపకర్తగా తనకంటూ ప్రత్యేమైన గుర్తింపు పొందిన ఈ కళాకారిణి ప్రఖ్యాత శాస్త్రీయ సంగీత దిగ్గజం పండిట్‌ జస్‌రాజ్‌ కుమార్తె. హైదరాబాద్‌లో నేటి నుంచి జరగనున్న‘జై హో పండిట్‌ జస్రాజ్, సంగీత్‌ సమారోహ్‌’ కార్యక్రమానికి ముంబై నుంచి వచ్చిన దుర్గా జస్‌రాజ్‌ సాక్షితో పంచుకున్న విషయాలివి..

‘‘ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న అసాధారణ సంగీత వారసత్వానికి ప్రతీక గా నిలిచిన ‘జై హో పండిట్‌ జస్‌రాజ్, సంగీత సమారోహం’ 54వ ఎడిషన్‌ నేటి నుంచి ఏడు రోజుల పాటు (నవంబర్‌ 24 – 30) హైదరాబాద్‌లోని మాదాపూర్, సీసీఆర్‌టీ యాంఫీథియేటర్‌లో జరగనుంది. 

ఈ వేడుకలో శాస్త్రీయ, సూఫీ–ఖవ్వాలీ, గజల్స్, ఆధ్యాత్మిక–భక్తి, హవేలీ, జానపద, లలిత సంగీతం, సింఫనీ, శాస్త్రీయ నృత్యం .. ఇలా వివిధ విభాగాలకు చెందిన 150 మందికి పైగా యువ కళాకారులు ప్రదర్శనలు ఇస్తున్నారు. ‘అష్ట ప్రహర్‌’ ఇతివృత్తంతో రూపొందించిన ప్రత్యేక ప్రదర్శనలో 45 మందికి పైగా సంగీత కళాకారులు ఒకేసారి సింఫనీ సంగీతంతో అలరించనున్నారు. 

అత్యంత ప్రాచీన సంగీత ఉత్సవంగా గుర్తింపు పొందిన ఈ సమారోహం, భారతీయ సంప్రదాయ సంగీతాన్ని అందరికీ చేరువ చేయాలన్న పండిట్‌ జస్రాజ్‌ ఆశయాన్ని కొనసాగింపు. దీనికి తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారం అందిస్తోంది. ఈ సంగీత వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేయడంతోపాటు, భారతీయ సంగీతాన్ని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలన్నదే మా లక్ష్యం. నాన్నగారి ఆశయాలను కొనసాగించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. పండిట్‌ జస్రాజ్‌కు ప్రత్యేక నివాళిగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. 

సంగీత దిగ్గజ కుమార్తె నుంచి ప్రత్యేక గుర్తింపు వరకు..
మా నాన్న గొప్ప సంగీత విద్వాంసుడు కావడంతో ఆయన స్థాయికి తగినట్లుగా ఎదగాలనే ఒత్తిడి నాలో ఉండేది. అంతేకాదు, మా తాతగారు పండిట్‌ మోతీరాజ్‌ నిజాం పరిపాలకుల వద్ద ఆస్థాన గాయకుడిగా ఉన్నారు. నా స్కూల్‌ రోజులు హైదరాబాద్‌లోనే. ఫలానా వారి అమ్మాయి అంటూ నన్ను ప్రత్యేకంగా చూసేవారు. ఆరేళ్ల వయసులో నాన్నగారి సంగీతం నన్ను ఆకర్షించింది. ఆయన సంగీతాన్ని వింటూ పెరిగాను. అమ్మ మధురా శాంతారామ్‌ రచయిత్రి, నృత్య దర్శకురాలు, టెలివిజన్‌లోనూ వర్క్‌ చేశారు. ఇంట్లో ఎప్పుడూ సంగీత వాతావరణమే ఉండేది. 

 చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాను. నాన్నతో కలిసి అనేక సంగీత కచేరీల్లో పాల్గొన్నాను. నేనూ సాధన చేస్తూ ఎదిగాను. కానీ, నాన్నగారు మహావృక్షం. ఒక దశలో నాన్న ప్రయాణం నుంచి బయటకు వచ్చి నా గుర్తింపును నిర్మించుకోవాలనుకున్నాను. అందుకు చాలా ప్రయత్నాలు చేశాను. రేడియో కాన్సర్ట్స్‌లో, టెలివిజన్‌ షోలలో, సినిమా పాటలు, ప్రదర్శనలు.. అవకాశాలు సృష్టించుకుంటూ వెళ్లాను. మనం ఏం చేస్తే మనసుకు సంతృప్తిగా అనిపిస్తుందో అది చే యాల్సిందే. ప్రాక్టీస్‌ కూడా అంతే స్థాయిలో ఉండాలి. మగ–ఆడ తేడాలేదు హార్డ్‌ వర్క్‌ ఒక్కటే మనల్ని బలంగా మారుస్తుంది. సక్సెస్‌కు షార్ట్‌కట్స్‌ ఉండవు. 

నేటి రోజుల్లో శాస్త్రీయ సంగీతం.. 
ఇప్పుడు సంగీతం చాలా వేగంగా ప్రజలకు చేరుతోంది. సోషల్‌ మీడియా వల్ల కళాకారులకు విస్తృతమైన అవకాశాలు వచ్చాయి. చాలమంది ఏఐ టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటారు. కానీ, అది కొంతవరకే. మనలోని భావోద్వేగం, క్రమశిక్షణ, కృషి, సాధన, గురువు నుంచి పొందే అనుభవాన్ని ఏ సాంకేతికతా భర్తీ చేయలేదు. సంగీతానిది కళ్లతో చూసే అందం కాదు... మనసుతో పొందే అద్భుతానుభూతి.  ప్రపంచమంతా గౌరవించే భారత శాస్త్రీయ సంగీతాన్ని ముందుతరాలకు అందించే బాధ్యత మనదే.’’అన్నారు ఈ కళాకారిణి. 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
ఫొటోలు: నోములు రాజేష్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement