మైలేజీ, ప్రీమియం వాహనాలకూ ఆదరణ
పండగ సీజన్‌లో రెండంకెల వృద్ధి అంచనాలు
హీరో మోటోకార్ప్ సీబీవో అశుతోష్ వర్మ వెల్లడి
పండుగ సీజన్‌లో వాహన విక్రయాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు తమకు రాక్ స్టార్లుగా నిలుస్తున్నాయని ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ (ఇండియా బీయూ) అశుతోష్ వర్మ తెలిపారు. మోటార్ సైకిల్స్‌తో పాటు స్కూటర్లకు కూడా డిమాండ్ గణనీయంగా పెరిగిందని కంపెనీ ప్రతినిధులతో కలిసి సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఈవీల విక్రయాలు, విస్తరణ ప్రణాళికలు మొదలైనవి కూడా వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే ..
నండూరి పార్థసారథి
పండుగ సీజన్‌లో అమ్మకాలు మా అంచనాలకు మించి నమోదవుతున్నాయి. గతేడాది హై–బేస్ మీద జాతీయ స్థాయిలో ఈసారి ‘వాహన్’ రిజిస్ట్రేషన్ల వృద్ధి దాదాపు ఆరు శాతం స్థాయిలో ఉంది. ఇప్పటిదాకా గణాంకాలను బట్టి చూస్తే అమ్మకాల వృద్ధి రెండంకెల స్థాయికి చేరొచ్చని అంచనాలు ఉన్నాయి. పండుగ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాకు రాక్ స్టార్లుగా రాణిస్తున్నాయి. మాకు సంబంధించి అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఇవి రెండూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో వాహన విక్రయాల వృద్ధి 6 శాతం స్థాయిలో ఉంటే తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమ సగటుకు మించి ఉంటున్నాయి. గతేడాది నవరాత్రులతో పోలిస్తే ఇక్కడ ఈసారి మా అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి.
స్కూటర్స్ వైపు మొగ్గు..
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటంతో పాటు డిస్పోజబుల్ ఆదాయాలు పెరుగుతుండటం ఇందుకు తోడ్పడుతున్నాయి. కొనుగోలుదారులు స్కూటర్ల వైపు మొగ్గు చూపడం పెరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్లామర్, పాషన్ మోడల్స్ ఎక్కువగా అమ్ముడయ్యేవి. ఇప్పుడు డెస్టినీ 125 సారథ్యంలోని మా స్కూటర్ల శ్రేణికి కూడా గణనీయంగా ఆదరణ ఉంటోంది. ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది మార్కెట్లో మా వాటాను పెంచుకునేందుకు ఉపయోగపడుతోంది. కేవలం ఏదో ఒక మోడల్‌కి పరిమితం కాకుండా స్ప్లెండర్, ప్యాషన్, గ్లామర్, డెస్టినీ మోడల్స్‌తో సమతూకంగా ఉన్న మా పోర్ట్‌ఫోలియో అధిక స్థాయి వృద్ధికి తోడ్పడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో విస్తరణ..
ఇక్కడ మేము గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ మార్కెట్లలో విక్రయించే చాలా మటుకు వాహనాలను ఇక్కడి చిత్తూరు ప్లాంటులో తయారు చేస్తున్నాం. ఇక రూ. 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే క్రమంలో గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కి శ్రీకారం చుట్టాం. అలాగే, హైదరాబాద్‌లో రీజనల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ (ఆర్‌డీసీ) ఏర్పాటు చేశాం. దేశీయంగా గౌహతి తర్వాత ఇది రెండో ఆర్‌డీసీ. ఆర్డరిచ్చిన ఇరవై నాలుగ్గంటల్లోపే కస్టమర్లకు వాహనాలను మరింత వేగవంతంగా అందించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి.
ఈవీలకు పెరుగుతున్న డిమాండ్..
ఇంధన ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటం వల్ల సహజంగానే కొనుగోలుదారులు ఇంధనాలను ఆదా చేసే వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. ఈవీల విషయంలో గతంలో నాలుగో స్థానంలో ఉన్న మేము ఇప్పుడు మూడో స్థానానికి చేరాం. త్వరలో రెండో స్థానానికి చేరతాం. అందుకు తగ్గట్లుగా ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నాం. అపార్ట్‌మెంట్ వాసులకు సౌకర్యంగా ఉండేలా రిమూవబుల్ బ్యాటరీలతో ఈవీలను అందిస్తుండటం మాకు సానుకూలాంశంగా ఉంటోంది.
ఈవీలకు సంబంధించిన ముడి వస్తువులపరంగా సవాళ్ల విషయానికొస్తే.. పటిష్టమైన సరఫరా వ్యవస్థను ఏర్పర్చుకున్నందున మాకు ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు. ఇక ఇటీవల ప్రవేశపెట్టిన ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు (స్లె్పండర్, హెచ్‌ఎఫ్ డీలక్స్) మంచి స్పందన కనిపిస్తోంది. ఇవి ఈ85 (85 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధనంతో కూడా పని చేస్తాయి. ఉద్గారాలు 40 శాతం తక్కువగా ఉంటాయి. 30 శాతం ఎక్కువ శక్తితో పని చేస్తాయి. ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికతను మరిన్ని మోడల్స్‌కి కూడా విస్తరిస్తాం. ఈ ఇంధనం లభ్యత పెరిగేలా చూసేందుకు ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం.
గ్రామీణ మార్కెట్ల జోరు..
గ్రామీణ మార్కెట్లలో ఎల్‌నినో ప్రభావాలపై ఆందోళన నెలకొన్నప్పటికీ.. వాస్తవం చెప్పాలంటే, దానికి విరుద్ధమైన పరిస్థితిని చూస్తున్నాం. పట్టణ ప్రాంత మార్కెట్లకు మించి గ్రామీణ మార్కెట్లు వృద్ధి చెందుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎల్ నినోపరమైన ఆందోళన నెలకొన్నప్పటనకీ, రుతుపవనాల పరిస్థితి ఊహించిన దానికంటే
కొంత మెరుగ్గానే నమోదైంది. అయితే, దీనిపై ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనడానికి నిదర్శనంగా, దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలోనూ గ్రామీణ మార్కెట్లు పటిష్టమైన వృద్ధి సాధిస్తున్నాయి.
వృద్ధి ప్రణాళికలు.. ప్రీమియం సెగ్మెంట్ ..
ఈ ఆర్థిక సంవత్సరంలో టూ–వీలర్ పరిశ్రమ గరిష్ట సింగిల్ డిజిట్ స్థాయి వృద్ధి సాధించవచ్చని భావిస్తున్నాం. మేము పరిశ్రమ సగటుకి మించి వృద్ధి సాధిస్తామని విశ్వసిస్తున్నాం. ఈవీలు, స్కూటర్లు, ఇంధనం ఆదా చేసే 100 సీసీ వాహనాలు ఇందుకు దోహదపడనున్నాయి. ఈ పండుగ సీజన్‌లో 15 కొత్త మోడల్స్, వేరియంట్స్‌ని ప్రవేశపెట్టాం. అటు, ప్రీమియం సెగ్మెంట్‌ని మేము మరింత పటిష్టం చేసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా 175 ప్రీమియం షోరూంలను ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లోనే నాలుగు ఉన్నాయి. అటు వరంగల్, విజయవాడ, విశాఖ తదితర నగరాల్లోకి కూడా ప్రీమియం కార్యకలాపాలను దూకుడుగా విస్తరిస్తున్నాం. ఎక్స్‌పల్స్, అప్‌గ్రేడ్ చేసిన ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ లాంటి మోడల్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.


