– అనుపమ పరమేశ్వరన్
‘‘నా కెరీర్ ఆరంభం నుంచి నా సక్సెస్, ఫెయిల్యూర్‌ని పట్టించుకోకుండా తెలుగు ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. వాళ్ల మనిషిగా నన్ను చూస్తున్నారంటే నాకు అదే పెద్ద విజయం. దీన్ని గౌరవంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు సంతోషపడటంతో పాటు గర్వపడేలా నటించేందుకు నా వంతుగా మరింత కష్టపడతాను... మంచి సినిమాలు చేస్తాను’’ అని హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అన్నారు. పేరుకు మలయాళీ అయినప్పటికీ తెలుగమ్మాయే అనేంతలా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అనుపమ పరమేశ్వరన్.
‘అ ఆ’ (2016) మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారామె. ఆ తర్వాత ‘ప్రేమమ్’ (మలయాళ రీమేక్), శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు, కార్తికేయ 2, టిల్లు స్క్వేర్, పరదా, క్రేజీ కళ్యాణం’ వంటి పలు చిత్రాలతో మన తెలుగమ్మాయే అనేంతలా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారీ బ్యూటీ. తెలుగులో పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు.
→ నేను తెలుగు పరిశ్రమకి వచ్చి అప్పుడే పదేళ్లయిందంటే ఆశ్చర్యంగా ఉంది. కాలం వేగంగా పరిగెడుతోందనిపిస్తోంది. ఇన్ని సంవత్సరాలు ఒక ఇండస్ట్రీలో ఉండడం అన్నది మామూలు విషయం కాదు. దానికి ప్రేక్షకుల సపోర్ట్ కావాలి. నన్ను ఇంతలా ప్రేమిస్తున్న, అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను.
→ సాధారణంగా షూటింగ్స్ కోసం వేరే వేరే ఊర్లకి వెళుతుంటాం. తెలుగు వాళ్లు కొన్నిసార్లు నేను చేసిన క్యారెక్టర్స్ పేరుతో పిలుస్తుండటం సంతోషంగా అనిపిస్తుంటుంది. హీరో రామ్ అయితే ‘ఉప్మా’ అంటూ ఒక పేరు ఇచ్చారు నాకు. ఆ పేరు గురించి చాలామందికి తెలుసు. నన్నెవరైనా ‘ఉప్మా పాప’ అని పిలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాదు... మరికొందరు ‘దొండకాయ బెండకాయ అనుపమ నా గుండెకాయ, అల్లం బెల్లం అనుపమ నా పెళ్లాం’ వంటి ఫన్నీ స్లోగన్స్ చెప్పినప్పుడు క్యూట్‌గా అనిపిస్తుంది. ప్రేమతో ఏ పేరుతో పిలిచినా సంతోషమే. అంతేకానీ కోపం రాదు.
→ తెలుగువారి రుచుల్లో నాకు అన్నం, పప్పు, నెయ్యి, ఆవకాయ, ముద్దపప్పు అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి పులిహోర అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. కేరళ ఫుడ్ అంటే ఐ లవ్ రైస్. మా అమ్మ చేసిన ఏ కర్రీ అయినా కూడా అన్నంతో తినడమంటే నాకు చాలా ఇష్టం. అలాగే చికెన్ బిర్యానీ, ఫిష్ ఇష్టం. అదే విధంగా చికెన్ సూప్‌ని చాలా ఇష్టంగా తాగుతాను.
→ నేను బాగా తింటాను. అలాగే వంట కూడా చేస్తాను. హీరోయిన్‌గా బిజీ అయ్యాక చాలా తగ్గింది. కానీ, 10వ తరగతి ఎగ్జామ్ టైమ్‌లో నేనెక్కువ కుక్ చేశాను. ఎందుకంటే చదవకుండా కుక్ చేయడం నాకు చాలా నచ్చేది. కుక్ చేస్తానని అమ్మకు చెప్పి చదవడం నుంచి బ్రేక్ తీసుకొని మరీ వండేదాన్ని. సమోసాలు, కట్లెట్లు వంటి వెరైటీస్ కూడా ట్రై చేసేదాన్ని. ఘీ రైస్, ఎగ్ రోస్ట్‌తో పాటు చికెన్ వెరైటీస్ అన్నీ వండగలను. ఇప్పుడంటే కొంచెం లేజీ అయిపోయాను (నవ్వుతూ...).
→ సంక్రాంతి, దసరా, దీపావళి, బతుకమ్మ వంటి తెలుగువారి పండగలంటే నాకెంతో ఇష్టం. కొన్ని పండగలను సినిమా షూటింగ్స్‌లో కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. మరికొన్నింటిని రియల్‌గా చూస్తుంటాను. అలా చూసినవాటిలో బతుకమ్మ పండగ ఒకటి. ఈ పండగ సమయంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు పూలు పేర్చి చుట్టూ మహిళలందరూ చేరి, పాటలు పాడుతూ డాన్స్ చేయడం నాకు బాగా అనిపించింది. దసరా, దీపావళి వంటి పండగలను తెలుగు వారు సెలబ్రేట్ చేసినంత గ్రాండ్‌గా కేరళలో సెలబ్రేట్ చేసుకోరు.
→ కెరీర్‌లో బయోపిక్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ, అది ఎవరి బయోపిక్ అనేదాన్ని బట్టి చేయాలా? వద్దా? ఆ పాత్ర మనం చేయగలమా? లేదా? అన్నది ఆధారపడి ఉంటుంది. నటిగా నేను వెర్సటైల్‌గా ఉండాలని ప్రయత్నిస్తుంటాను. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అనుకోకూడదు. వైవిధ్యమైన పాత్రలు చేసి, ప్రేక్షకులను మరింతగా అలరించాలన్నదే నా లక్ష్యం. అలాగే నేను ఇప్పటిదాకా ట్రై చేయని వైవిధ్యభరితమైన పాత్ర ఏదైనా చేయాలని ఉంది. మనం కొత్తగా ఏ క్యారెక్టర్ చేసినా అది సవాల్‌గా అనిపిస్తుంది... అలాంటి పాత్రలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే.


