– రజత్ రాఘవ్
‘‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’కి మంచి స్పందన వస్తోంది. ఎక్కువగా మహిళలు, పిల్లలు మా చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి అందరూ కంటతడి పెట్టుకుంటున్నారు’’ అని హీరో రజత్ రాఘవ్ తెలిపారు. శరత్ దర్శకత్వంలో రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్, బేబీ పరిణీత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. దీపక్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదలైంది.
ఈ సినిమా సక్సెస్ మీట్‌లో రజత్ రాఘవ్ మాట్లాడుతూ– ‘‘కూతురి కోసం సింగపూర్ నుంచి వచ్చిన తండ్రి ఏం చేశాడు? అన్న ఈ కథ అందరికీ కనెక్ట్ అయింది. కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయనే సందేశాన్నిచ్చేలా మా చిత్రం ఉంటుంది. పీవీఆర్‌తో కనెక్ట్ అవడం మాకు బాగా కలిసొచ్చింది. డైరెక్టర్ శరత్ నాకు మంచి స్నేహితుడు. ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ కథ నాకు, నిర్మాత దీపక్‌కి నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. నా తర్వాతి సినిమా ఇదే ప్రొడక్షన్, ఇదే కాంబినేషన్‌లో ఉంటుంది’’ అని చెప్పారు.


