వై. రవిశంకర్, రవితేజ, నక్షత్ర, ప్రియా భవానీశంకర్, శివ నిర్వాణ
‘‘ఇరుముడి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సక్సెస్ మీట్‌లో మాట్లాడతానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా మీద మాకు మొదటి నుంచి అంత నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ తమిళనాడులో కూడా ఉండాలని కోరుకున్నాను. శివ నిర్వాణ అద్భుతంగా తీశాడు. ఈ సినిమాని మీతోపాటు మీ మనసులో పెట్టుకుంటారు’’ అని రవితేజ చెప్పారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా, బేబీ నక్షత్ర కీలకపాత్రలో నటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం (ఆగస్టు 21) విడుదలైంది.
శనివారం చెన్నైలో నిర్వహించిన హార్ట్ విన్నింగ్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘నాకు తమిళ సినిమాతో చాలా అనుబంధం ఉంది. నటుడిగా నా ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది’’ అని తెలిపారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘తమిళ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ‘ఇరుముడి’ కథ అనుకున్నప్పుడే తమిళ్‌లో విడుదల చేయాలనుకున్నాం’’ అన్నారు.
‘‘ఇరుముడి’ చిత్రాన్ని ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది’’ అని ప్రియా భవానీశంకర్ చెప్పారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ఎంత విజయం సాధిస్తుందని ఆశించామో దానికి మూడు రెట్లు ఎక్కువ విజయాన్ని అయ్యప్ప స్వామి మాకు అందించారు’’ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కుమార్, బేబి నక్షత్ర మాట్లాడారు.


