వాంగ... వాంగ... వణక్కమ్‌! | Upcoming Movie Updates on Tamil Directors Working with Telugu Heroes | Sakshi
Sakshi News home page

వాంగ... వాంగ... వణక్కమ్‌!

Nov 25 2026 12:33 AM | Updated on Nov 25 2026 12:37 AM

Upcoming Movie Updates on Tamil Directors Working with Telugu Heroes

తమిళ దర్శకుల డైరెక్షన్‌లో తెలుగు హీరోలు

‘వాంగ... వాంగ... వణక్కమ్‌’ అంటూ తమిళ దర్శకులను తెలుగు స్టార్స్‌ సాదరంగా ఆహ్వానించారు. అంటే... రండి... రండి... స్వాగతం అని అర్థం. ఇలా వెల్‌కమ్‌ చెప్పి, తమిళ దర్శకుల డైరెక్షన్‌లో సినిమాలు చేస్తున్నారు మన హీరోలు. ఏ హీరోతో ఏ తమిళ దర్శకుడు సినిమా చేస్తున్నారు? ఆ విశేషాలేంటో ‘పాక్కలామ్‌ వాంగ’ (చూద్దాం రండి)...

బ్యాక్‌ టు బ్యాక్‌
తమిళ దర్శకులతో బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు అల్లు అర్జున్‌. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘రాకా’ అనే సినిమా తెరకెక్కుతోంది. దీపికా పదుకోన్‌ ఓ లీడ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నైనా గ్రేవాల్, ఫెమినా జార్జ్, రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్‌ సర్భ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. అంతేకాదు... ఈ సినిమాలో అల్లు అర్జున్‌ నాలుగు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో కనిపిస్తారట.

దీంతో కథ రీత్యా నలుగురు హీరోయిన్స్‌కు కూడా చాన్స్‌ ఉందని, ఈ హీరోయిన్స్‌గా రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాళ్‌ ఠాకూర్, ఐశ్వర్య లక్ష్మి కనిపిస్తారని తెలిసింది. అలాగే రష్మిక క్యారెక్టర్‌లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని సమాచారం. పునర్జన్మల కాన్సెప్ట్‌తో సాగే సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ డ్రామాగా ‘రాకా’ సినిమా కథ ఉంటుందని, ఏలియన్స్‌ ప్రస్తావన కూడా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నారు.

అయితే ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్‌ అవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒక భాగం అయితే 2028లో ‘రాకా’ మూవీ విడుదల అవుతుందట. ఒకవేళ చిత్రయూనిట్‌ ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకుంటే మాత్రం తొలి భాగం 2027లో, మలి భాగం 2028లో విడుదలవుతుందని భోగట్టా. ఇటు దర్శకుడు సుకుమార్‌తో ‘పుష్ప, పుష్ప 2’ సినిమాలతో సూపర్‌ హిట్స్‌ అందుకున్నారు అల్లు అర్జున్‌.

అటు షారుక్‌ ఖాన్‌తో ‘జవాన్‌’  సినిమా తీసి, రూ. 1000 కోట్లు వసూలు చేసిన సినిమాను డైరెక్ట్‌ చేసిన దర్శకుల జాబితాలో చేరిపోయారు అట్లీ. ఇలాంటి తరుణంలో అల్లు అర్జున్‌–అట్లీల కాంబినేషన్‌లో రానున్న ఈ సినిమాపై అంచనాలు ఉండటం సహజం. ‘రాకా’ సినిమాకు భారీ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌ జరుగుతున్న కారణంగానే, ఈ సినిమా రిలీజ్‌ గురించిన అప్‌డేట్స్‌ ఆలస్యమౌతున్నాయని తెలుస్తోంది.

సత్యంసుందరం దర్శకుడితో..!
‘హిట్‌ 3, ది  ప్యారడైజ్, బ్లడీ రోమియో’ (ప్రజెంట్‌ సెట్స్‌పై ఉన్న సినిమా)... ఇలా వరుస యాక్షన్‌ సినిమాలు చేస్తున్న నాని ఈ జానర్‌కు చిన్న బ్రేక్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. తమిళంలో ‘96, సత్యం సుందరం’ వంటి సెన్సిబుల్‌ సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన సి. ప్రేమ్‌కుమార్‌తో నాని హీరోగా ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఏషియన్‌ సునీల్‌ ఈ సినిమాను నిర్మించనున్నారని తెలిసింది. అయితే ప్రస్తుతం ‘బ్లడీ రోమియో’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు నాని. 

ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత సి. ప్రేమ్‌కుమార్‌ డైరెక్షన్లోని సినిమాలో నాని హీరోగా నటిస్తారా? లేదా అనే విషయంపై సరైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే తమిళ ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ మల్టీస్టారర్‌ కథను రెడీ చేస్తున్నారని, ఇందులో ఒక హీరోగా ధనుష్‌ నటిస్తారని, మరో హీరోగా సూర్య లేదా నాని నటిస్తారనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘నవాబు, ఓ కాదల్‌ కణ్మని’ (తెలుగులో ‘ఓకే బంగారం’) సినిమాల్లో హీరోగా చేసే చాన్స్‌ నానికి లభించినప్పటికీ కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదట. 

మరి... ఈ సారైనా మణిరత్నం డైరెక్షన్‌లో నాని కనిపిస్తారా? లేదా అనేది చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి. ఇంకా ‘జై భీమ్‌’ ఫేమ్‌ దర్శకుడు టీజే జ్ఞానవేల్, తమిళ హిట్‌ మూవీ ‘డాన్‌’ దర్శకుడు సిబీ చక్రవర్తిలతో కూడా నాని చర్చలు జరిపారట. కానీ ఇప్పటివరకు ఏ తమిళ దర్శకుడితో కూడా నాని సినిమా కన్ఫార్మ్‌ కాలేదు. వచ్చే ఏడాది తమిళ దర్శకుడితో నాని మూవీ ఖరారైందనే కబురు వచ్చే చాన్సెస్‌ మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.

కింగ్‌ 100 రెడీ 
నాగార్జున కెరీర్‌లోని వందో సినిమా ‘కింగ్‌ 100’. ఈ సినిమాకు తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాజేష్, నాగార్జున కుమార్తెగా సుష్మితా శెట్టి, విలన్‌గా అశోక్‌ సెల్వన్, కాస్త నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో టబు నటిస్తున్నారని తెలిసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఒక సాంగ్‌ మినహా పూర్తయిందని ఇటీవల జరిగిన ‘ఇట్లు అర్జున’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెల్లడించారు నాగార్జున.

 ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 24న విడుదల కానుంది. ఒక దశలో ‘కింగ్‌ 100’ సినిమా క్రిస్మస్‌కు విడుదల కాకపోవచ్చే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో జరిగింది. కానీ సినిమా రిలీజ్‌లో ఏ మాత్రం లేటు లేదని, మరో ముప్పై రోజుల్లో ‘కింగ్‌ 100’ సినిమా థియేటర్స్‌కు వస్తుందని, మంగళవారం మరోసారి చిత్రయూనిట్‌ స్పష్టం చేసింది. 

ఇక అసాధారణ ప్రయాణం చేసిన ఒక వ్యక్తి జర్నీ, రూ. 50 వేల కోట్ల స్కామ్, రాజకీయాలు, తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌... ఇలా పలు అంశాల మేళవింపుతో ఈ ‘కింగ్‌ 100’ సినిమా రూ΄÷ందుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక తమిళంలో ‘నిత్తమ్‌ ఒరు వానం’ సినిమాతో రా. కార్తీక్‌ ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత ఈ యువదర్శకుడు చేసిన ‘మేడ్‌ ఇన్‌ కొరియా’ వెబ్‌ సిరీస్‌ కూడా ఓ మంచి ప్రయత్నంగా నిలిచింది. తమిళ దర్శకుడు రా. కార్తీక్‌ తెలుగులో చేస్తున్న ఈ ‘కింగ్‌ 100’ మూవీ, అతని కెరీర్‌కు తప్పకుండ ప్లస్‌ అవుతుందని ఊహించవచ్చు.

జైలర్‌ దర్శకుడితో..! 
నయనతారతో ‘కోలమావు కోకిల’, శివ కార్తికేయన్‌తో ‘డాక్టర్‌’, రజనీకాంత్‌తో ‘జైలర్, జైలర్‌ 2’ సినిమాలు చేసి, కెరీర్‌లో దూసుకెళ్తున్నారు తమిళ యువ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. సూపర్‌స్టార్‌ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్‌ నటిస్తున్న మల్టీస్టారర్‌ని డైరెక్ట్‌ చేసే చాన్స్‌ సైతం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కే లభించింది. కోలీవుడ్‌లోని టాప్‌ డైరెక్టర్స్‌లో నెల్సన్‌ పేరు ఉందనటానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ దర్శకుడి గురించి ఇంతలా ప్రస్తావన ఎందుకంటే... ఎన్టీఆర్‌తో నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఓ సినిమా చేయాల్సి ఉంది. 

ఆల్రెడీ కథాచర్చలు కూడా జరిగాయని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తారు. అయితే ప్రజెంట్‌ ప్రశాంత్‌ నీల్‌తో ఎన్టీఆర్‌ ‘డ్రాగన్‌’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్‌లో రిలీజ్‌ కానుంది. ఆ తర్వాత ఇప్పటికే తాను కమిటైన త్రివిక్రమ్‌ మైథాలజీ సినిమా, అనిల్‌ రావిపూడి సినిమాలను ఏకకాలంలో సెట్స్‌కు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారట ఎన్టీఆర్‌. 2028 సంక్రాంతికి అనిల్‌ రావిపూడి సినిమా రిలీజ్‌ అవుతుంది. 

త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ చేయబోయే ‘గాడ్‌ ఆఫ్‌ వార్‌’ చిత్రం షూటింగ్‌ కూడా ఓ కొలిక్కి వస్తుంది. ఈ లోపు రజనీకాంత్‌ – కమల్‌హాసన్‌ల మల్టీస్టారర్‌ మూవీని కంప్లీట్‌ చేస్తారు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌. ఆ తర్వాత 2028 ద్వితీయార్ధంలో ఎన్టీఆర్‌–నెల్సన్‌ల కాంబినేషన్లోని సినిమా సెట్స్‌కు వెళ్లొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాస్త అటూ ఇటూ అయినా  నెల్సన్‌తో ఎన్టీఆర్‌ సినిమా ఉంటుందనేది ఖాయం అని తెలిసింది. మరోవైపు మరో తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో ఎన్టీఆర్‌ సినిమా ఉంటుందనే వార్తలు ఎప్పట్నుంచో ఉన్నాయి. మంచి కథ కుదిరితే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని వెట్రిమారన్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు.

గ్యాంగ్‌ స్టార్‌? 
తమిళ యువ దర్శక–నిర్మాత, నటుడు లోకేష్‌ కనగరాజ్‌తో అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా ఖరారైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా కథ గురించి సుధీర్ఘంగా చర్చలు జరిపారట అల్లు అర్జున్, లోకేష్‌. 

స్క్రిప్ట్‌ ఫైనలైజ్‌ అయిన తర్వాత ఈ మూవీ సెట్స్‌కు వెళ్తుంది. మోస్ట్‌లీ వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుందని తెలిసింది. అల్లు అర్జున్‌ కెరీర్‌లోని ఈ 23వ సినిమాకు ‘గ్యాంగ్‌ స్టార్‌’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్‌. ఇదొక గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అని, అందుకే ఈ మూవీకి ‘గ్యాంగ్‌ స్టార్‌’ అనే టైటిల్‌ను లోకేష్‌ అండ్‌ టీమ్‌ పరిశీలిస్తున్నారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

మరింత ఆలస్యంగా...?
హీరో నాగ చైతన్య, దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ రానుందనే టాక్‌ ఎప్పట్నుంచో వినిపిస్తోంది. కథా చర్చలు అయితే జరిగాయి. కానీ ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ‘వృషకర్మ’తో బిజీగా ఉన్నారు నాగ చైతన్య. డిసెంబరు 4న ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఈ మూవీ తర్వాత నాగ చైతన్య కెరీర్‌లోని మైల్‌స్టోన్‌ మూవీ అయిన 25వ సినిమాను ‘బెదురులంక 2012’ ఫేమ్‌ క్లాక్స్‌ డైరెక్ట్‌ చేస్తారని తెలిసింది.

ఆ మూవీ తర్వాత పీఎస్‌ మిత్రన్‌తో నాగచైతన్య సినిమా చేసే అవకాశం ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. అయితే పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలోని గత చిత్రం ‘సర్దార్‌ 2’ (కార్తీ హీరో) ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ తరుణంలో సరైన స్క్రిప్ట్‌తో నాగ చైతన్యను మెప్పిస్తేనే పీఎస్‌ మిత్రన్‌తో నాగచైతన్య సినిమా ఉండొచ్చు. ఇందుకు కాస్త సమయం పట్టొచ్చు.  

కథ విన్నారు... కానీ..! 
హీరో చిరంజీవి, తమిళ దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల చిరంజీవిని కలిసి కార్తీక్‌ సుబ్బరాజు ఓ కథ వినిపించారు. కార్తీక్‌ చెప్పిన బేసిక్‌ స్టోరీ లైన్‌ చిరంజీవికి కూడా నచ్చిందట. అయితే చిరంజీవి ఫైనల్‌గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ లోపు స్క్రిప్ట్‌కు మరిన్ని మెరుగులు దిద్ది, మరోసారి చిరంజీవికి కథ వినిపిస్తారట కార్తీక్‌ సుబ్బరాజు. 

మరోవైపు ప్రస్తుతం ‘కాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు చిరంజీవి. బాబీ దర్శకత్వంలోని ఈ సినిమా 2027 సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానుంది. ‘కాకా’ సినిమా విడుదల తర్వాత చిరంజీవి నెక్ట్స్‌ సినిమాపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే అది కార్తీక్‌ సుబ్బరాజుతోనే అనేది తెలియాలంటే మరికొంత సమయం ఎదురు చూడక తప్పదు.

అలాగే ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెలతో చిరంజీవి హీరోగా ఓ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. నాని నిర్మాతగా ఉన్న ఈ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి మరింత సమయం పట్టేలా ఉంది. ఇంకా దర్శకులు త్రివిక్రమ్, మారుతి, వెంకీ కుడముల చెప్పిన కథలను విన్నారు చిరంజీవి. మరి... చిరంజీవి లైనప్‌ ఎలా ఉండబోతుంది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

ధర్మన్‌తో ఎంట్రీ 
హీరో రామ్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ అయ్యింది. రజనీకాంత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘ధర్మన్‌’ సినిమాలో రామ్‌ ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు. రామ్‌ చేస్తున్న తొలి స్ట్రయిట్‌ తమిళ సినిమా ఇదే. ఇందులో రామ్‌ క్యారెక్టరైజేషన్లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది. ఇలా కోలీవుడ్‌లో విలన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు రామ్‌. నయనతార, సిమ్రాన్, శ్రీలీల, రాశీ ఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌ హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్‌ కానుంది.  

లోన్‌ మాఫియా 
‘ఈగో రాజా’ సినిమాతో కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు ఆది సాయికుమార్‌. తెలుగు, తమిళ భాషల్లో రూ΄÷ందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి గురు శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ నటుడు సతీష్, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ రామచంద్రరాజు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిజిటల్‌ లోన్‌ మాఫియా ఆగడాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్‌ కానుంది. ఎస్‌జీఎస్‌ ప్రోడక్షన్స్‌ పతాకంపై జి. సురేష్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆధ్య ప్రసాద్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రొమాంటిక్‌ లవ్‌స్టోరీ 
‘మ్యాడ్‌’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన యువ నటుడు రామ్‌ నితిన్‌ ఓ రొమాంటిక్‌ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన కార్తీక్‌ జై పళని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ప్రార్థనా నాథన్, తేజు అశ్విని ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా  గురించిన అధికారిక ప్రకటన వచ్చింది. సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, రెడాక్టెడ్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.  

న్యూ మేకోవర్‌ 
‘గోలీ సోడా’ ఫ్రాంచైజీ ఫేమ్‌ విజయ్‌ మిల్టన్‌ డైరెక్షన్‌లోని తాజా సినిమా ‘గాడ్స్‌ అండ్‌ సోల్జర్‌’. ఈ సినిమాతో రాజ్‌ తరుణ్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూ΄÷ందుతున్న ఈ సినిమాలో సునీల్, అమ్ము అభిరామి, భరత్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో రాజ్‌ తరుణ్‌కు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. త్వరలోనే రిలీజ్‌ డేట్‌పై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలోని రాజ్‌ తరుణ్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని, మేకోవర్‌ కూడా కొత్తగా ఉంటుందని చిత్రయూనిట్‌ పేర్కొంది.

ఇంకా తమిళ దర్శకులతో టచ్‌లో ఉన్న మరి కొంతమంది తెలుగు హీరోలు ఉన్నారు. తాను ఓ తమిళ దర్శకుడితో టచ్‌లో ఉన్నట్లు తేజ సజ్జా ఆల్రెడీ చెప్పారు. కానీ ఆ తమిళ దర్శకుడు పేరు చెప్పలేదు. అలాగే ఈ ఏడాది విడుదలైన ‘మండాడి’ మూవీతో సుహాస్‌ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి, అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా మరికొంత మంది హీరోలు ఉన్నారు.

– ముసిమి శివాంజనేయులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement