మన శరీరంలో ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే గుర్తొచ్చేవి రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు, స్కానింగ్‌లు. ఏదైనా వ్యాధి ఉందేమోనని అనుమానం వస్తే రక్తం ఇవ్వక తప్పదనే అనుకుంటాం. కొందరైతే కళ్లు మూసుకుని భయంతో, బాధతో పంటిబిగువున రక్తం ఇస్తుంటారు. అయితే భవిష్యత్తులో కొన్ని వ్యాధులను గుర్తించడానికి రక్తం ఇవ్వాల్సిన అవసరమే ఉండకపోవచ్చు. నోట్లో ఊరే కొద్దిపాటి లాలాజలాన్ని పరీక్షిస్తే చాలు... శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పుల గురించి తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం.
అవును.... మనం పెద్దగా పట్టించుకోని లాలాజలం (సెలైవా) ఇప్పుడు వైద్య పరిశోధనల్లో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఇందులో ఉండే ప్రోటీన్లు, హార్మోన్లు, యాంటీబాడీలు, జన్యు పదార్థాలు, ఇతర రసాయనాల సంకేతాలను విశ్లేషించడం ద్వారా నోటికి సంబంధించిన వ్యాధులే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలూ, వ్యవస్థల తాలూకు సమస్యలను కూడా గుర్తించే అవకాశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి.
సెలైవరీ డయాగ్నస్టిక్స్ అంటే...
ఇప్పుడు లాలాజలం సహాయంతో వైద్యరంగంలో వ్యాధినిర్ధారణ చేసే ఈ విధానాన్ని ‘సెలైవరీ డయాగ్నస్టిక్స్’గా పేర్కొంటున్నారు. రక్తంలో ఉండే కొన్ని వ్యాధుల తాలూకు సంకేతాలు లాలాజలంలోనూ కనిపించవచ్చన్నది ఈ పరిశోధనల వెనుక ఉన్న ప్రధాన ఆలోచనా, ప్రాతిపదిక.
లాలాజలంలో ఏముంటాయంటే...
సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు సుమారు అర లీటరు మొదలుకొని లీటరున్నర (1.5 లీటర్ల) వరకు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాడు. లాలాజలం ప్రధానంగా చెవుల దగ్గర, దవడల కింద, నాలుక కింద ఉండే మూడు జతల ప్రధాన లాలాజల గ్రంథులతో పాటు మరికొన్ని చిన్న గ్రంథుల నుంచి విడుదలవుతుంది.
లాలాజలం అంటే కేవలం నీళ్లు కాదు. అందులో నీటితోపాటు ఎంజైమ్‌లు, ప్రోటీన్లు, లవణాలు, యాంటీబాడీలు, హార్మోన్లు, వివిధ రకాల జీవరసాయన పదార్థాలు ఉంటాయి. అది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడటంతో పాటు నోటిని తేమగా ఉంచడం, దంతాలను రక్షించడం, హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడటం వంటి పనులనూ చేస్తుంటుంది.
అయితే లాలాజలానికి మరో ప్రత్యేకత ఉంది. నోటిలోని కణాలూ, పంటి చిగుర్ల నుంచి వచ్చే ద్రవం, నోటిలో నివసించే సూక్ష్మజీవులు, రక్తం నుంచి చేరే కొన్ని పదార్థాలు కూడా ఇందులో కలుస్తాయి. అందువల్ల శరీరంలో జరుగుతున్న కొన్ని జీవరసాయన మార్పుల సమాచారం కూడా లాలాజలం నుంచి దొరికే అవకాశం ఉంది.
ఉదాహరణకు రక్తంలో ఉండే కొన్ని ప్రోటీన్లు, హార్మోన్లు, వాటి సంబంధిత జీవరసాయన సంకేతాలు లాలాజలంలోనూ కనిపించవచ్చు. వాటిని అత్యంత సున్నితమైన పరీక్షా పద్ధతులతో గుర్తించగలిగితే కొన్ని వ్యాధులను సులభంగా పరిశీలించవచ్చు.
ఏయే వ్యాధులను గుర్తించవచ్చంటే...
1. మధుమేహం (డయాబెటిస్)
మధుమేహం ఉందో లేదో తెలుసుకోవడానికి సాధారణంగా రక్తంలో గ్లూకోజ్ మోతాదులు తెలుసుకోవడం, హెచ్‌బీఏ1సీ అనే పరీక్షలు చేస్తారు. అయితే మధుమేహం ఉన్నవారిలో లాలాజలంలోని గ్లూకోజ్, కొన్ని ్ర΄ోటీన్లు, ఎంజైమ్‌ల స్థాయుల్లోనూ మార్పులు కనిపించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.
ముఖ్యంగా లాలాజలంలో ఉండే గ్లూకోజ్ (సెలైవరీ గ్లూకోజ్), అల్ఫా ఎమైలేజ్, ఇతర జీవరసాయన పదార్థాలను విశ్లేషించి మధుమేహాన్ని గుర్తించే అవకాశాలపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని అధ్యయనాల్లో మధుమేహం ఉన్నవారికి, లేనివారికి మధ్య లాలాజలంలోని ఈ పదార్థాల స్థాయుల్లో / మోతాదుల్లో తేడాలు గుర్తించారు.
భవిష్యత్తులో లాలాజల పరీక్షల ద్వారా మధుమేహం ముప్పును ప్రాథమికంగా అంచనా వేయడం, ఇప్పటికే మధుమేహం ఉన్నవారిలో కొన్ని మార్పులను పర్యవేక్షించడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం లాలాజల పరీక్ష ఒక్కటే ఆధారంగా మధుమేహాన్ని నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. రక్తంలో గ్లూకోజ్, హెచ్‌బీఏ1సీ పరీక్షలే ప్రామాణికం.
2. క్యాన్సర్
లాలాజల పరీక్షల్లో అత్యంత ఆసక్తికరమైన పరిశోధన రంగాల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ముఖ్యంగా నోటి క్యాన్సర్, గొంతు, తల–మెడ ప్రాంతాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించేందుకు లాలాజలంలోని ప్రత్యేక జీవరసాయన సంకేతాలను పరిశీలిస్తున్నారు. క్యాన్సర్ కణాలు కొన్ని రకాల ప్రత్యేక ప్రోటీన్లు, డీఎన్‌ఏ ముక్కలు, మైక్రో ఆర్‌ఎన్‌ఏ వంటి జన్యు సమాచారాన్ని కలిగిన పదార్థాలను విడుదల చేయవచ్చు. వీటిలో కొన్నింటిని లాలాజలంలో గుర్తించే అవకాశాలున్నాయి.
అంతేకాదు, శరీరంలోని ఇతర ్ర΄ాంతాల్లో ఏర్పడే క్యాన్సర్లకు సంబంధించిన సంకేతాలనూ లాలాజలంలో గుర్తించవచ్చా అనే విషయంపైనా ఇప్పుడు పరిశోధనలు సాగుతున్నాయి. ముఖ్యంగా ‘సెలైవరీ ఎక్సోజోమ్స్’ అనే సూక్ష్మ కణాలపై శాస్త్రవేత్తలకు ఆసక్తి పెరుగుతోంది. ఇవి కణాల మధ్య సమాచారాన్ని చేరవేసే చిన్న పాకెట్స్ లాంటివి. వీటిలో ప్రోటీన్లు, ఆర్‌ఎన్‌ఏ వంటి పదార్థాలు ఉంటాయి. వ్యాధి కండిషన్లను ప్రతిబింబించే సంకేతాలు కూడా వీటిలో ఉండవచ్చు.
అయితే ఈ పరీక్షలన్నీ ఇంకా ఒకే స్థాయిలో అభివృద్ధి చెందలేదు. లాలాజల పరీక్షతో అన్ని రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని చెప్పడానికి ఇప్పటికి ఉన్న ఆధారాలు పూర్తిగా సరి΄ోవు. ఈ అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
3. వైరల్ ఇన్ఫెక్షన్లు
లాలాజల పరీక్షలతో ఇప్పటికే ఉపయోగాలు కనిపించిన మరో రంగం అంటువ్యాధుల (ఇన్ఫెక్షన్ల) గుర్తింపు. కోవిడ్–19 మహమ్మారి సమయంలో లాలాజల నమూనాలతో వైరస్‌ను గుర్తించేందుకు ‘ఆర్‌టీ–సీపీఆర్’ పరీక్షల్ని విస్తృతంగా నిర్వహించారు. ముక్కు నుంచి స్వాబ్ తీసుకోవడం కష్టంగా ఉండే పరిస్థితుల్లో లాలాజల నమూనా సేకరణ సులభమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడింది. అలాగే హెచ్‌ఐవీ వంటి వైరస్‌లను గుర్తించడానికి నోటి ద్రవంలో ఉండే యాంటీబాడీలను పరీక్షించే విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
కొన్ని పరీక్షలు నేరుగా వైరస్‌ను కాకుండా, దానికి వ్యతిరేకంగా శరీరం తయారు చేసిన యాంటీబాడీలను గుర్తిస్తాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అన్ని వైరస్‌లను లాలాజలంతో ఒకే విధంగా గుర్తించలేం. ఏ వైరస్‌ను గుర్తించాలనుకుంటున్నామనే దానిని బట్టి పరీక్షా విధానమూ, దాని ఖచ్చితత్వం మారుతుంటాయి.
4. గుండె జబ్బులు (కార్డియో వాస్క్యులార్ డిసీజెస్)
గుండెకు సంబంధించిన సమస్యలను గుర్తించడానికి సాధారణంగా ఈసీజీ, ఎకో–కార్డియోగ్రామ్, టీఎమ్‌టీ వంటి పరీక్షలతో పాటు ట్రోపోనిన్ వంటి రక్తపరీక్షలూ, ఇతర పరీక్షల్ని ఉపయోగిస్తారు. అయితే గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని జీవరసాయన సంకేతాలు లాలాజలంలోనూ కనిపించవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఉదాహరణకు గుండె కండరాలకు నష్టం జరిగినప్పుడు రక్తంలో పెరిగే కార్డియాక్ ట్రో΄ోనిన్ వంటి పదార్థాలను లాలాజలంలోనూ గుర్తించగలమా అనే అంశంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. అలాగే శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్)కు సంబంధించిన ‘సీ రియాక్టివ్ ప్రోటీన్ (సీఆర్‌పీ) వంటి సంకేతాలు, ఇతర ప్రోటీన్లపైనా పరిశోధనలు సాగుతున్నాయి.
భవిష్యత్తులో ఈ విధానాలు ముందుగానే గుండె జబ్బుల ముప్పును అంచనా వేయడానికీ లేదా కొన్ని పరిస్థితులను పర్యవేక్షించడానికి తోడ్పడవచ్చు. అయితే ప్రస్తుతం గుండెపోటును నిర్ధారించడానికి ట్రోపోనిన్ రక్తపరీక్షకు ప్రత్యామ్నాయంగా లాలాజల పరీక్షను ఉపయోగించడం సాధ్యం కాదు.
5. హార్మోన్ల సమస్యలు (హార్మోనల్ డిజార్డర్స్)
లాలాజల పరీక్షలు ఇప్పటికే కొంతవరకు వైద్యపరంగా ఉపయోగిస్తున్న అంశాల్లో హార్మోన్ల పరీక్షలూ ఉన్నాయి. ముఖ్యంగా కార్టిజోల్ అనే హార్మోన్‌ను లాలాజలంలో కొలవవచ్చు. ఇది శరీరంలోని ఒత్తిడి పెరిగినప్పుడు స్రవించడం, జీవక్రియల్లో పాలు పంచుకోవడం జరుగుతుంది. రాత్రి సమయంలో లాలాజలంలో కార్డిజోల్ మోతాదును / స్థాయిని పరీక్షించడం అన్నది ‘కుషింగ్ సిండ్రోమ్’ అనే హార్మోన్ సమస్యను గుర్తించడంలో డాక్టర్లకు ఉపయోగపడుతుంది.
ఈ వ్యాధిలో శరీరంలో కార్టిజోల్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దాంతో బరువు పెరగడం, రక్తపోటు, రక్తంలో చక్కెర పెరగడం, కండరాల బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... రాత్రిపూట సేకరించిన కొద్దిపాటి లాలాజలంతోనే ఈ హార్మోన్ స్థాయిని పరిశీలించవచ్చు. అందుకే ఈ ‘సెలైవరీ కార్టిజోల్’ పరీక్షకు ఇతర పరిశోధనాత్మక లాలాజల పరీక్షలతో పోలిస్తే మెరుగైన వైద్యపరమైన గుర్తింపు ఉందనే చెప్పవచ్చు.
మరి లాలాజల పరీక్షల్లో సమస్యలేమిటంటే...
ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ రక్తపరీక్షలకు పూర్తిస్థాయి ప్రత్యామ్నాయంగా మారడానికి ఈ లాలాజల పరీక్షలు ఇంకా కొన్ని అడ్డంకులున్నాయి. అవేమిటంటే...
మొదటిది... లాలాజలంలో ఉండే పదార్థాల స్థాయులు / మోతాదులు రోజంతా ఒకేలా ఉండవు. ఉదయం, రాత్రి, ఆహారం తీసుకున్న తర్వాత, ఒత్తిడికి గురైనప్పుడు, నీళ్లు తక్కువగా తాగినప్పుడు కూడా వాటిలో మార్పులు రావచ్చు.
రెండోది... చిగుర్ల వాపు, నోటిలో రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, పొగతాగే అలవాటు, కొన్ని మందుల వాడకం కూడా వైద్య పరీక్షల ఫలితాలను ప్రభావితం చేయవచ్చు.
మూడోది... రక్తంలో ఒక వ్యాధి సంకేతం కనిపించిందంటే... అదే స్థాయిలో ఆ సంకేతం లాలాజలంలోనూ కనిపిస్తుందని చెప్పలేం. కొన్ని పదార్థాలు లాలాజలంలో చాలా తక్కువ పరిమాణంలోనే ఉంటాయి. వాటిని గుర్తించడానికి అత్యంత సున్నితమైన పరికరాలు, పరీక్షా పద్ధతులు అవసరమవుతాయి.
అంతేకాదు, ఒక వ్యక్తికి వ్యాధి ఉందో లేదో చెప్పడానికి పరీక్షలో ఎంత స్థాయిలో ఆ పదార్థం ఉంటే సరి΄ోతుందనే ప్రమాణాలనూ (రిఫరెన్స్ రేంజెస్‌నూ) వైద్య శాస్త్రవేత్తలు / వైద్య నిపుణులు ఇంకా నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం చాలా పెద్ద సంఖ్యలో చాలామంది వ్యక్తులపైనా, వివిధ ప్రాంతాల్లో చాలా సుదీర్ఘకాలం పాటు అధ్యయనాలు చేయాల్సిన అవసరముంటుంది.
భవిష్యత్తులో ఒక చిన్న ప్యాచ్‌తోనే ఆరోగ్య పరీక్షలా?
లాలాజల పరీక్షల భవిష్యత్తులో మరో ఆసక్తికరమైన అంశం ‘వేరబుల్ బయో–సెన్సర్స్’. అంటే శరీరంపైన ధరించగలిగేవీ లేదా నోట్లో అమర్చుకోగలిగే చిన్న సెన్సార్లు అని అర్థం.
ఉదాహరణకు దంతాలకు అమర్చుకునే ప్రత్యేక పరికరాలు లేదా నోట్లో ఉండే చిన్న సెన్సార్ల సహాయంతో లాలాజలంలోని గ్లూకోజ్, పీహెచ్‌తో పాటు కొన్ని ఇతర రసాయన పదార్థాలను నిరంతరం పరిశీలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ‘మైక్రో ఫ్లుయిడిక్స్’ అనే సాంకేతికత ద్వారా చాలా తక్కువ పరిమాణంలో ఉండే లాలాజలాన్ని చిన్న చిప్‌లోకి పంపించి, అందులోని అనేక పదార్థాలను ఒకేసారి పరీక్షించే పరికరాలనూ ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నారు.
వీటిని ‘ల్యాబ్ ఆన్ ఎ చిప్’ అంటారు. భవిష్యత్తులో ఇలాంటి పరికరాలు మరింత అభివృద్ధి చెందితే కొన్ని ఆరోగ్య సూచికలను... ఏ డయాగ్నస్టిక్ సెంటర్‌కుగానీ లేదా హాస్పిటల్‌కు గానీ వెళ్లకుండానే... కేవలం ఇంటి దగ్గరే పరిశీలించుకునే అవకాశం రావచ్చు. అయితే ప్రస్తుతం వీటిలో చాలా పరికరాలు పరిశోధన లేదా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా సాధారణ ప్రజలు రోజూ ఉపయోగించుకునే స్థాయికి అన్నీ చేరలేదుగానీ చేరేరోజు చాలా దగ్గర్లోనే ఉంది.
రక్తపరీక్షలతో పోలిస్తే లాలాజల పరీక్షలు ఎందుకు సులభం...
లాలాజల పరీక్షలపై పరిశోధకులకు ఆసక్తి పెరగడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి.
సిరెంజీ సూది అవసరం ఉండక΄ోవడం : ఇందులో రక్తాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందువల్ల సూదులంటే భయపడేవారికి, తరచూ పరీక్షలు చేయించుకోవాల్సినవారికి ఇది సౌకర్యంగా ఉంటుంది.
సులభంగా సేకరించగలగడం : ప్రత్యేకమైన వైద్య సిబ్బంది / శిక్షణ పొందిన సిబ్బంది అవసరం లేకుండానే కొన్ని పరీక్షలకు నమూనాలను చాలా తేలిగ్గా / సులువుగా సేకరించవచ్చు.
పిల్లలకు, వృద్ధులకు అనుకూలం: రక్తం తీసుకోవడం కష్టంగా ఉండే చిన్నారులు, చాలా పెద్దవయసు వారి నుంచి కూడా లాలాజల నమూనాలను సులభంగా, తేలిగ్గా పొందవచ్చు.
తరచూ పరీక్షలు చేసే అవకాశం: కొన్ని జీవరసాయన మార్పులను తరచూ (చాలా ఫ్రీక్వెంట్‌గా) పరిశీలించేందుకు ఇది ఉపయోగపడవచ్చు.
ఖర్చులు తగ్గే ఆస్కారం : కొన్ని పరీక్షల్లో నమూనా సేకరణ, రవాణా ప్రక్రియలు సులభమైతే మొత్తం వైద్యపరీక్షలకు అవసరమైన ఖర్చులు తగ్గేందుకు అవకాశాలెక్కువ.
చివరగా...
మన నోటిలో ఊరే లాలాజలాన్ని ఇప్పటివరకూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అందులో మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో జీవరసాయన సంకేతాలు దాగి ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. అందుకే లాలాజలాన్ని భవిష్యత్తులో ఒక విలువైన ‘డయాగ్నస్టిక్ ఫ్లుయిడ్’గా అంటే వ్యాధి నిర్ధారణకు అవసరమైన ద్రవంగా చూస్తున్నారు.
రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు, ఇతర వైద్య పరీక్షలకు బదులుగా అన్నింటినీ లాలాజలంతోనే గుర్తించే రోజులు వస్తాయని ఇప్పటికిప్పుడే చెప్పలేం. కానీ కొన్ని వ్యాధుల విషయంలో లాలాజల పరీక్షలు ఇప్పటికే ఉపయోగపడుతుండగా, మరికొన్నింటికి సంబంధించి పరిశోధనలు ఆశాజనకంగా సాగుతున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే... మన నోట్లో ఊరే లాలాజలం
కేవలం జీర్ణక్రియకు ఉపయోగపడే ద్రవం మాత్రమే కాదు. భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడే మంచి వనరు కూడా కావచ్చు.
నిర్వహణ యాసీన్
ఇదీ చదవండి: పరిస్థితులు ఎలా ఉన్నా.. పోరాడటం అంటే ఇదే..! నాలుగో అంతస్తు నుంచి అమాంతం..


