ఇన్నోవేషన్‌ ఇన్సులిన్‌: మేడిన్‌ ల్యాబ్‌..! | Health Tips: Advances in Pancreatic Islet Cell Transplantation | Sakshi
Sakshi News home page

ఇన్నోవేషన్‌ ఇన్సులిన్‌: మేడిన్‌ ల్యాబ్‌..!

Nov 22 2026 1:04 PM | Updated on Nov 22 2026 1:08 PM

Health Tips: Advances in Pancreatic Islet Cell Transplantation

మనిషి క్లోమం (ప్రాంక్రియాస్‌) నుంచి సేకరించిన కొద్దిపాటి మూలకణాల లక్షణాలున్న కణాల సాయంతో, ప్రయోగశాలలో ఇన్సులిన్‌  తయారు చేసే సూక్ష్మ కణ సముదాయాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిని డయాబెటిస్‌ ఉన్న ఎలుకల్లో ప్రవేశపెట్టగా, ఏడాది వరకు రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉన్నట్లు గుర్తించారు.

చైనాలోని షాంఘైలో ఉన్న చైనీస్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ ప్రయోగం నిర్వహించింది. ‘ఇ అరియల్‌ జెంగ్‌’ నేతృత్వంలోని ఈ పరిశోధకుల బృందం... అవయవదానం చేసిన వారి క్లోమం నుంచి ఇన్సులిన్‌  తయారు చేసే కణాల సమూహాల్లో (ఐలెట్స్‌) ఉండే మూలకణాల లక్షణాలున్న అరుదైన కణాలను సేకరించింది. వాటిని ప్రయోగశాలలో పెంచి, త్రీడీ రూపంలో చిన్న చిన్న కణ సముదాయాలుగా అభివృద్ధి చేసింది. వీటినే ‘ఆర్గనాయిడ్స్‌’ అంటారు.

ఐదు నెలల పాటు పది దశల్లో ఈ కణ సముదాయాలను పెంచారు. ఈ ప్రక్రియలో వాటి సంఖ్య దాదాపు 30 కోట్ల రెట్లు పెరిగింది. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగినప్పుడు, నిజమైన క్లోమంలోని కణాల మాదిరిగానే ఇవి కూడా ఇన్సులిన్‌ను విడుదల చేశాయి. 

డయాబెటిస్‌ ఉన్న ఎలుకల్లో ఈ కణ సముదాయాలను ప్రవేశపెట్టిన తర్వాత, సుమారు వారం రోజుల్లోనే వాటి రక్తంలో అధికంగా ఉన్న చక్కెర స్థాయులు తగ్గాయి. ఈ ప్రభావం కొన్ని నెలల పాటు కొనసాగింది. వీటిలో 11 ఎలుకలను ఏడాది పాటు పరిశీలించారు. అయితే, వాటి శరీరంలో ప్రవేశపెట్టిన ఈ కణ సముదాయాలను తొలగించగానే, రక్తంలో చక్కెర స్థాయులు మళ్లీ వేగంగా పెరిగాయి.

ప్రస్తుతం... టైప్‌–1 డయాబెటిస్‌ ఉన్న ఎంపిక చేసిన కొందరు పేషెంట్స్‌కు దాతల నుంచి సేకరించిన క్లోమంలోని ఇన్సులిన్‌ తయారీ కణాలను మార్పిడి చేస్తున్నారు. దీనివల్ల కొందరికి ఇన్సులిన్‌  ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం తగ్గవచ్చు లేదా లేకుండాపోవచ్చు. అవసరమైనంత మంది దాతలు అందుబాటులో లేనందున... ఇప్పటికి ఈ చికిత్సకు అవసరమైన క్లోమాలను సేకరించడం చాలా కష్టమవుతోంది.  

అందుకే ప్రయోగశాలలోనే ఇలాంటి కణాలను పెద్ద సంఖ్యలో పెంచగలిగితే, భవిష్యత్తులో డయాబెటిస్‌ చికిత్సకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ పరిశోధనలో ఉపయోగించినవి పెద్దవారి క్లోమం నుంచి సేకరించిన కణాలు. అంతేతప్ప... ఇవి పిండానికి సంబంధించిన మూలకణాలు (ఎంబ్రియోనిక్‌ స్టెమ్‌ సెల్స్‌) లేదా ఇతర కణాలను తిరిగి మూలకణాలుగా మార్చి తయారు చేసిన కణాలు కావు. అందువల్ల వీటితో కణితులు ఏర్పడే ముప్పు తక్కువగా ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

రెండు మకాక్‌ కోతులపై నిర్వహించిన ప్రయోగాల్లోనూ ఈ కణ సముదాయాలు వాటికి అవసరమైన ఇన్సులిన్‌  పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించాయి. అయితే, ఈ పరిశోధనలో అత్యంత స్పష్టమైన ఫలితాలు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లోనే వచ్చాయి. కోతులపై ప్రయోగాలు కూడా పరిమిత సంఖ్యలోనే జరిగాయి. 

అంతేకాదు, ఈ పరిశోధన ఫలితాలు ఇంకా ఇతర శాస్త్రవేత్తల సమీక్షకు (పీర్‌ రివ్యూ) లోనుకాలేదున ప్రస్తుతానికి అవి ప్రీప్రింట్‌ రూపంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ విధానం మనుషుల్లోనూ సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తుందని నిర్ధారణ చేయడానికి మరికొన్ని పరిశోధనలు అవసరం.

ఇదీ చదవండి: చుండ్రు ఉన్నపుడు తలకు నూనె రాస్తున్నారా?

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement